ఆషాడం అంటే ఆడవాళ్లకి గుర్తొచ్చేది గోరింటాకు. ఈ సమయంలో దాదాపు అందరు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు కోన్ రూపంలో మార్కెట్ లో దొరికినా కానీ ఇప్పుడు మాత్రం చెట్టు గోరింటాకునే ఎక్కువమంది ఇష్టపడతారు.

ఒకవేళ వాళ్ళ ఇంటిదగ్గర గోరింటాకు చెట్టు లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా వెతికి ఆకులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల కూడా లేకపోతే తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి అడగడం లాంటివి చేస్తారు. గోరింటాకు చెట్లకి ఈ సమయంలో అంత డిమాండ్ ఉంటుంది.

అసలు ఆషాఢంలో నే ఇలా గోరింటాకు ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఆరోగ్యం కోసం. ఆషాడంలో వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలానికి ముందు ఎండాకాలం ఉంటుంది కాబట్టి మన శరీరం లో వేడి అలానే ఉంటుంది.

వర్షాకాలంలో కూడా వేడి అలానే ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోరింటాకు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అందుకే ఈ కాలం లో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటారు.

ఇంకొక కారణం ఆధ్యాత్మికతకు సంబంధించినది. మహిళలు ఈ కాలంలో గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్య వంతులు అవుతారు అని శాస్త్రం చెబుతోంది. ఏదేమైనా ఇంత అడ్వాన్స్డ్ జనరేషన్లో కూడా ఇంకా గోరింటాకు పెట్టుకోవడాన్ని పాటిస్తున్నారు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి

ఒకటి గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో తెలుస్తోంది. రెండవది ఈ ఆచారం ఎంత గొప్పదో అర్థమవుతోంది.