దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కి మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా టీ20 కప్‌ గెలవడం ఇదే మొదటిసారి.

మ్యాచ్ గెలవగానే ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని వారు చాలా వింతగా ప్రదర్శించారు. కూల్ డ్రింక్స్ ను బూట్లలో పోసుకుని తాగేశారు. దీనితో చాలా మంది అవాక్కయ్యారు.

వాళ్ళు ఎందుకు బూట్లలో పోసుకుని తాగుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందండోయ్.

అదేంటంటే.. ఇది ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాల్లో ఒకటి. ఏదైనా అదృష్టం కలిసి వచ్చినప్పుడు.. సంబరాలు చేసుకునే సమయాల్లోనూ.. ఇలా బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగడాన్ని “షుయి” అని పిలుస్తారట.

వాస్తవానికి ఈ ఆచారం మొదట్లో 18 వ శతాబ్దంలో జర్మనీలో మొదలైంది. ఈ ఆచారం ఆస్ట్రేలియాలో కూడా పాపులర్ అయింది.

రీసెంట్ గా, ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్ డేనియల్ రేకిర్డో లు కూడా పోడియం పైనే ఇలా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాడికి ముందు, విజయం వచ్చిన తరువాత కూడా జర్మనీ సైనికులు ఇలాగే చేసారు. వారు తమ బూట్లలో బీర్ పోసుకుని తాగి తమ విజయోత్సాహాన్ని పంచుకున్నారు.

అయితే.. ఇలా చేయడం వలన మాత్రం ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బూట్లలో బాక్టీరియా ఉంటుంది.. అందులో ఆల్కహాల్ పోసుకుని తాగడం వలన ఈ బాక్టీరియా కడుపులోకి చేరి ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉందని.. సంబరాలను జరుపుకోవడానికి ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.