మనం ఎవరింటికి అయినా వెళ్ళినప్పుడు, లేదా ఎవరి ఫంక్షన్ కి అయినా వెళ్ళినప్పుడు చిరు కానుకలను ఇస్తూ ఉండడం సహజమే. ఐతే.. పెళ్లిళ్లలో కొంచం ఉపయోగపడే వస్తువులను ఖరీదైనవి అయినా సరే ఇస్తూ ఉంటారు.

అయితే.. మరికొందరు వారి శక్తియుక్తులను బట్టి డబ్బులు చదివించేస్తూ ఉంటారు. అయితే..ఈ డబ్బులు చదివించడం లో 116/516/1116 ఇలా చివరిలో 16 సంఖ్య వచ్చేలా చూసుకుంటారు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతోంది.

తమ పెద్దలు అలా ఇచ్చే వారు కాబట్టి.. తాము కూడా అలానే ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ, చివరిలో సున్నా ఉన్న సంఖ్యతో డబ్బును ఇవ్వకూడదు అనుకుంటే..

కనీసం ఒకటి, లేదా రెండు ఉండేటట్లు ఇవ్వొచ్చు కదా..? పదహారే ఉండేటట్లు ఎందుకు చూసుకుంటారు..? గతం లో బ్రిటిష్ వారు పాలన లో ఉన్న సమయం లో వంద రూపాయలు మార్చుకుంటే.. పదహారు రూపాయలు తక్కువ గా ఇచ్చేవారట. ఆ తరువాత తక్కువ అయ్యిన 16 రూపాయలను కూడా కలిపి 116 రూపాయలను ఇచ్చేవారట.

ఇది అక్కర్లేని ఆచారం గా మారి.. చివరకు 116/516/1116 రూపాయలుగా మారింది. దీనిపై మరో వాదన కూడా ఉంది. నిజాం సంస్థానం ఉన్న రోజుల్లో.. వారి లెక్కలు, ఆంధ్ర ప్రాంతం వారి లెక్కలు వేరేవిగా ఉండేవట.

ఈ క్రమం లో నిజాం (ప్రస్తుత తెలంగాణ) ప్రాంతం వారు ఆంధ్ర ప్రజలకు చెల్లింపులు చెల్లించాలంటే వందకు 116 రూపాయలు చెల్లిస్తేనే సమానం అయ్యేది. దానికి కారణం నిజాం వాసులు వాడే రూపాయి మారకం విలువ తక్కువ గా ఉండేది.

అందుకే వంద రూపాయలు చెల్లించాలంటే 116 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కాలక్రమం లో ఇదో సంప్రదాయం గా కొనసాగుతోంది.