నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠినతరమైన చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగట్లేదు .  ఆరేళ్ల పసిదాని దగ్గర నుండి అరవైఏళ్ల ముసలి వారి వరకు కామాందులకి బలి కాక తప్పట్లేదు . ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్న జరిగిన దిశ ఘటన మరువనే లేదు, ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ దోషులకి శిక్ష పడనేలేదు . దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పంతొమ్మిదేళ్ల యువతి  రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు అత్యాచారానికి గురైంది . ఫిబ్రవరి 19న నవీ ముంబైలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు

బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఘటక్ పోర్ సబ్ అర్బన్ రైల్వే స్టేషన్ కు వెళ్లింది ఆ యువతి . ట్రైన్ మిస్ కావడంతో కొద్దిసేపు వెయిట్ చేసి మరో ట్రైన్ ఎక్కింది. థానే జిల్లాలోని ముంబ్రా రైల్వే స్టేషన్ చేరింది. ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి అక్కడే నిద్రపోయింది. ఫిబ్రవరి 19న మరో ట్రైన్ ఎక్కి దివా స్టేషన్ చేరుకుంది . చేతిలో డబ్బులు లేకపోవడంతో ముక్కుపుడకను అమ్మిపెట్టి డబ్బులు ఇవ్వాలని అక్కడే ఉన్న బిచ్చగత్తెని కోరింది . అయితే చీకటి పడడంతో ఆ పని కాలేదు. ఇద్దరూ నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్లి, రాత్రి 8.30గంటల సమయంలో ఓ హోటల్ దగ్గర ఇద్దరూ ఆగారు. అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ని పిలిచి, తమ దగ్గర డబ్బులు లేవని ఈ అమ్మాయిని దగ్గరలోని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టాలని కోరింది బిచ్చగత్తె . సరే అని ఆటో ఎక్కించుకున్నాడు ఆటోడ్రైవర్.

మహపే ప్రాంతంలోని నిర్మానుష్యమైన చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ పురాతన భవనంలోకి యువతిని బలవంతంగా లాక్కెల్లి ,  భయపెట్టి అత్యాచారం చేశాడు. తర్వాత ఆ అమ్మాయిని ఓ గుడి దగ్గర వదిలి వెళ్లిపోయాడు . జరిగిన పరిణామానికి షాక్ కి గురై, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఎవరైనా సాయం చేస్తారేమో అని రోడ్డుపై నిలబడింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వెళ్తూ కనిపించారు. వారిని ఆపి, దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ కి తీసుకెళ్లమని ప్రాథేయపడింది. సరేనని చెప్పి ఆ అమ్మాయిని స్కూటర్ ఎక్కించుకున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. గన్ సోలి ప్రాంతంలో ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకర  అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు మరోసారి షాక్ కి గురైంది .

సాయం చేయడానికి ఎవరూ లేరు , సాయం అడిగితే అత్యాచారానికి గురైంది . ఎవరిని నమ్మాలో , ఎవరిని నమ్మకూడదో పాలు పోని స్థితిలో పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను  అరెస్ట్ చేశారు.

రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు రేప్ చేయడం స్థానికంగా సంచలనం రేపింది. . అడుగడుగున అత్యాచారాలు జరుగుతుంటే ఆడపిల్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులని ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంటే, ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ నిందితులకి ఇంక శిక్ష పడలేదు ఇంక ఈ కేస్లో న్యాయం జరిగేదెన్నడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి .

source