Ads
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ. ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ డిఫరెంట్ పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక డిఫరెంట్ పాత్ర చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : టైగర్ నాగేశ్వరరావు
- నటీనటులు : రవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్.
- నిర్మాత : అభిషేక్ అగర్వాల్
- దర్శకత్వం : వంశీ
- సంగీతం : జివి ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : అక్టోబర్ 20, 2023
స్టోరీ :
ప్రైమ్ మినిస్టర్ (అనుపమ్ ఖేర్) కి, గుంటూరు ఎస్పీ (మురళీ శర్మ) టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. స్టువర్టుపురంలో ఉండే ఒక వ్యక్తి స్టువర్టుపురం నాగేశ్వరరావు. యుక్త వయసులో ఉన్నప్పుడు సారా (నుపుర్ సనన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల స్టువర్టుపురం నాగేశ్వరరావు మారాల్సి వస్తుంది.
అసలు స్టువర్టుపురం నాగేశ్వరరావు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? స్టువర్టుపురం నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు అనే ఒక గజదొంగగా ఎందుకు మారాడు? ఒక వీవీఐపీ ఉన్నచోట రాబరీ ఎందుకు చేయాలి అనుకున్నాడు? వాళ్ల ఊరిలో ఎలాంటి మార్పు తెచ్చాడు? ఒక స్టువర్టుపురం దొంగని పట్టుకోవాలని ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆర్డర్ చేశారు? టైగర్ నాగేశ్వరరావుని పోలీసులు పట్టుకున్నారా? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోల్లో రవితేజ ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందరూ మా రవన్న అని చెప్పుకునే ఏకైక నటుడు రవితేజ. అందుకే రవితేజ సినిమా వచ్చింది అంటే ఏ హీరో అభిమాని అయినా సరే వెళ్లి, మన రవితేజ సినిమా అని సపోర్ట్ చేస్తారు.
రవితేజ కూడా ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెడుతూ, అటు కమర్షియల్ సినిమాలు, ఇటు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వంశీ అనే ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా తీశారు. డైరెక్టర్ వంశీ అంతకుముందు లక్ష్మీ మంచు హీరోయిన్ గా నటించిన దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలకి దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే, ఇది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా. నిజ జీవితంలో జరిగిన విషయాల మీద, అది కూడా ఇలా ప్రైమ్ మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న విషయాల మీద సినిమా తీయడం అనేది రిస్క్ తో కూడుకున్న విషయం. సినిమా స్టార్టింగ్ చాలా బాగా మొదలవుతుంది. సినిమా అంతా 1980 లోనే నడుస్తుంది. ఒక సాదాసీదా వ్యక్తి, అతని ఊరిలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు.
కానీ ఎప్పుడైతే సినిమాలో లవ్ ట్రాక్ మొదలవుతుందో అప్పటి నుండి అనవసరమైన కొన్ని ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ లవ్ స్టోరీ అంతా కూడా రవితేజ ఇడియట్ సినిమా లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అసలు ఈ స్టోరీ లేకపోయినా కూడా సినిమా బాగానే ఉండేది. సినిమా ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. రాబరీ సీన్స్ కొన్ని బాగా రాసుకున్నారు. అవి తెరపై కూడా బాగా కనిపించాయి. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం టైట్ గా ఉంటే బాగుండేది.
సినిమా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల చిన్న సీన్స్ కూడా చాలా లెంతీగా కనిపిస్తాయి. అందులోనూ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ని రవితేజ టార్గెట్ చేసే సీన్, అక్కడికి వెళ్లి రాబరీ అదంతా కూడా ఇంకా బాగా చూపించాల్సింది. మళ్లీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి సినిమా రాబిన్ హుడ్ స్టైల్ కి వెళ్ళిపోతుంది. హీరో ఒక దొంగ, చాలా దొంగతనాలు చేస్తాడు, చాలా డబ్బు దోచుకుంటాడు. కానీ ఆ డబ్బునంతా పేద వాళ్ళకి పంచి పెడతాడు. కాబట్టి హీరో దొంగలాగా కనిపించినా కూడా హీరో హీరోనే.
ఈ విషయాన్ని సెకండ్ హాఫ్ లో చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప సెకండ్ హాఫ్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. సినిమా సినిమాకి పాత్ర కోసం తనని తాను మార్చుకుంటూ ఉంటారు. ఈ సినిమా కోసం కూడా ఒక యంగ్ గా కనిపించే వ్యక్తిగా, ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు గా కనిపించడానికి రవితేజ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది.
హీరోయిన్స్ కి పెద్ద గొప్ప పాత్రలు ఏమీ దొరకలేదు. అలా అని బాగాలేదు అని కూడా చెప్పలేము. ఉన్నారు అంతే. వారి పాత్రల వరకు వారు చేశారు. రేణు దేశాయ్ పాత్ర బాగానే ఉన్నా కూడా సినిమా నిడివి కారణంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మిగిలిన వారి పాత్రలు కూడా అంతే. పాటలు గొప్పగా ఏమీ లేవు. అలా వెళ్ళిపోతాయి. తర్వాత గుర్తు కూడా ఉండవు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది. కానీ తర్వాత తర్వాత మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది.
ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. 80 కాలాన్ని చూపించాలి అని వాడిన సెట్టింగ్స్, మది సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ తెర మీద చూపించినప్పుడు మాత్రం సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఒక పాయింట్ తర్వాత ఇది ఒక మాస్టర్ మైండ్ దొంగ సినిమా అని మర్చిపోయి ఒక కమర్షియల్ సినిమా అని అనుకుంటాం. సినిమా అలా షిఫ్ట్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- రవితేజ
- స్టోరీ పాయింట్
- కొన్ని యాక్షన్ సీన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సినిమా నిడివి
- అనవసరమైన లవ్ ట్రాక్
- సెకండ్ హాఫ్
- బోరింగ్ గా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా రవితేజ కోసం సినిమా చూద్దాం అనుకుంటే, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “ఓంకార్” దర్శకత్వంలో మరొక కొత్త కాన్సెప్ట్..! ఎలా ఉందంటే..?
End of Article