నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జయంత్ అండ్ ద జింగో పెన్’. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ‘మన శంకర వర ప్రసాద్’ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను ఏ మేరకు గెలుచుకుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
కథాంశం
జయంత్ (జయంత్ బొలిశెట్టి)కి మ్యాథ్స్ అన్నా, ఆ సబ్జెక్ట్ క్లాస్ అన్నా చిన్నపాటి భయం ఉంటుంది. మరోవైపు లెక్కల మాస్టారు హర్ష (సత్యం రాజేష్) ఎప్పుడూ స్టూడెంట్స్‌ని హడలెత్తిస్తూ పాఠాలు బోధిస్తుంటాడు. స్కూల్లో జయంత్ చేసే అల్లర్ల కారణంగా అందరూ అతన్ని చూసి నవ్వుతుంటారు. జయంత్, అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎప్పుడూ ఆలస్యంగా బడికి వెళ్లడం, మార్కులలో చివర్లో నిలవడం పరిపాటి. జయంత్ ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు (ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్) నలుగురిలోనూ అంతులేని ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమయంలో జయంత్‌కి ఒక వింతైన ‘జింగో పెన్’ దొరుకుతుంది. ఆ పెన్ దొరికక అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆ పెన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ ప్రయాణంలో తాతయ్య (తనికెళ్ల భరణి), ప్రిన్సిపాల్ (కాశీ విశ్వనాథ్), అశోక్ కుమార్ పాత్రల ప్రాముఖ్యత ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ
బాలల నేపథ్యంలో సాగే కథలు ఎప్పుడూ మనసును హత్తుకునేలా ఉంటాయి. చిన్నారులు బయటికి వ్యక్తపరచలేని మానసిక సంఘర్షణను తెరపై ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు దర్శకుడు నవీన్. గురువులు మరియు తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ఎదుగుదలపై ఎలాంటి ముద్ర వేస్తుందనే కోణాన్ని చక్కటి సందేశంతో చూపించారు. ఈ చిత్రానికి చక్కటి సాహిత్యం ఉన్న పాటలు, ఆలోచింపజేసే సంభాషణలు ప్రధాన బలమయ్యాయి. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరూ తప్పక వీక్షించాల్సిన చిత్రమిది.
చిత్ర ప్రథమార్థం ఎంతో సరదాగా, ఉల్లాసభరితంగా సాగుతుంది. జయంత్ అల్లరి చేష్టలు, బడిలో మిత్రబృందం చేసే సందడి ప్రేక్షకులను నవ్విస్తాయి. అమ్మనాన్నలతో జయంత్ మాట్లాడే తీరు, దేవుడి గురించి వేసే అమాయకపు ప్రశ్నలు ఆలోచన రేకెత్తిస్తాయి. ‘పేర్లు వేరైనా టేస్ట్ ఒకటే.. పేర్లు వేరైనా దేవుడు ఒకటే’ అని చెప్పే సందర్భం, అక్కడి డైలాగ్స్ మనసుకు తాకుతాయి. బేబీ ఊహ, జయంత్ మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. లెక్కల మాస్టారుని పోలీస్ స్టేషన్ వద్ద ఇరికించడం, ఆ కిమిడీని ఊహ పసిగట్టడం వంటి సరదా సన్నివేశాలతో ప్రథమార్థం ముగుస్తుంది.
ద్వితీయార్థంలో కథలోకి జింగో పెన్ ప్రవేశించాక, దాని సహాయంతో జయంత్ లెక్కలు సులువుగా చేస్తూ క్లాస్‌లో హీరోగా మారడం పిల్లలను విశేషంగా అలరిస్తుంది. ఆ పెన్ సూచనల మేరకు జయంత్ నడుచుకోవడం, తోటివారికి అతను చెప్పే చిట్కాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఆ తర్వాత వచ్చే స్కూల్ బస్ ప్రమాదం, ఆసుపత్రిలో ఊహ ఉండటం వంటి సంఘటనలు భావోద్వేగాలను పంచుతాయి. ఓటమిని కూడా ఒక వేడుకలా స్వీకరించాలని లెక్కల మాస్టర్ చెప్పే సీన్ ఆలోచనాత్మకంగా సాగుతుంది. తాత-మనవడి అనుబంధాన్ని తెలిపే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.
క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆఖరిలో తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ, జయంత్‌లో వచ్చే మార్పు అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్నారులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారిని ఎలా ప్రోత్సహించాలి అనే మంచి సందేశంతో సినిమాను ముగించారు. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా, ఒక ఆహ్లాదకరమైన క్లీన్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల ప్రతిభ
నటీనటుల విషయానికి వస్తే.. మాస్టర్ జయంత్ తన తొలి చిత్రంతోనే అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. నవ్వించడం, భావోద్వేగాలను పండించడం వంటి ప్రతి విభాగంలోనూ అవలీలగా నటించి మెప్పించాడు. తండ్రి పాత్రలో ఆశిష్ గాంధీ సహజంగా కనిపిస్తే, తల్లిగా మానస తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్ తమ అనుభవంతో పాత్రలకు నిండుదనం తెచ్చారు. సత్యం రాజేష్‌కు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. బేబీ ఊహ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. మిగిలిన బాల నటీనటులు అందరూ చక్కగా నటించారు.
సాంకేతిక విభాగం
సాంకేతిక పరంగా సినిమా అత్యున్నత ప్రమాైకలతో తెరకెక్కింది. కెమెరా పనితనం విజువల్స్‌ని ఎంతో సహజంగా చూపించింది. ప్రవీణ్ బొలిశెట్టి అందించిన మ్యూజిక్, పాటలు కథా గమనానికి సరిగ్గా సరిపోయాయి. మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్ విభాగాలు తమ పనితీరుతో ఆకట్టుకున్నాయి. కొత్త నిర్మాత అయినప్పటికీ దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఎక్కడా రాజీపడకుండా ఈ విలువైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడంలో పూర్తిగా సఫలమయ్యారు.
రేటింగ్: 3 / 5
