Ads
చెన్నేకొత్తపల్లి మండలం లోని ఎన్ ఎస్ గేట్ నుండి ధర్మవరం వెళ్లే రహదారి పక్కన ప్యాదెండి ఆంజనేయస్వామి గుడి దగ్గర శిధిలావస్థలో ఉన్న ఒక భవనం ఉంది. అందులో 85 ఏళ్ల వయసున్న నంజమ్మ అనే వృద్ధురాలు ఉంటోంది. ఆర్థిక సహాయం లేక, తన పని తను చేసుకోవడానికి ఓపిక లేక నంజమ్మ పడుతున్న కష్టాన్ని చూస్తుంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది.
Video Advertisement
నంజమ్మ భర్త ఆలయ అర్చకులు. ఆయన మూడేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుండి నంజమ్మ ఆ శిధిలమైన భవనంలోనే ఉంటోంది. కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్లు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్తారు. తనకి ఓపిక ఉంటే అడుక్కుంటానని, ఒకవేళ ఓపిక లేకపోతే అలాగే ఆకలితో ఆ భవనం లోపలే ఉంటాను అని చెప్పింది నంజమ్మ.
ఎంతోమందికి పెట్టిన చెయ్యి ఇప్పుడు ఆహారం కోసం యాచిస్తోంది. దయచేసి కాస్త అన్నం పెట్టండి మీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా అర్ధిస్తోంది. నంజమ్మకు ఓపిక లేకపోయినా, చూపు మందగించినా కూడా తను కూర్చునే చోటు దగ్గర నుండి వాహనం వెళ్తున్నట్టు అనిపిస్తే తనకి ఆకలిగా ఉందని తినడానికి ఏమైనా పెట్టండి అని సైగ చేస్తుంది. లేచి నిలబడడం నడవడం కష్టంగా ఉన్నా కూడా తన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆప్యాయంగా పలకరిస్తుంది.
ఎదుటి వాళ్లు కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడితే తన బాధను చెప్పుకొని కన్నీటి పర్యంతం అవుతుంది. నంజమ్మ కే కాదు తన బాధ విన్న మనకి కూడా కన్నీళ్లు ఆగవు. ఒక మనిషికి అది కూడా వృద్ధాప్యంలో ఉన్న మనిషికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం చాలా బాధాకరం.
వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి చివరి రోజుల్లో ప్రశాంతంగా బతకాలి అని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ నంజమ్మ చివరి దశలో కూడా ఇలా కష్టపడుతోంది. నంజమ్మ లాంటి వాళ్లు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్లకి మనకు చేతనయినంత సహాయం చేద్దాం. అలాగే నంజమ్మ కి కూడా పరిస్థితి చేయి జారకముందే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సహాయం అందాలని ఆశిద్దాం.
End of Article