ఆంచల్ గాంగ్వాల్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ బ్రాంచ్ లో ట్రైనింగ్ లో చేరి రెండేళ్లు అయింది. అయితే ఏముంది? ఎంతోమంది చేరుతారు. ఈమె పేరు ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అని అనుకోకండి. ఆ సంవత్సరం ఎయిర్ ఫోర్స్ పరీక్షలు క్లియర్ చేసిన ఏకైక అభ్యర్థి ఆంచల్.

సరే ఏముంది కష్టపడి చదివి ఉంటుంది. మంచి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని ఉంటుంది అందుకే క్లియర్ చేయగలిగింది. అని అనుకుంటే అది కూడా తప్పే. ఒకసారి ఆమె కథ వింటే ఇలా ప్రత్యేకంగా ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో మీకే అర్థమవుతుంది.

ఆంచల్ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని నీమచ్ జిల్లా. తన తండ్రి సురేష్ గంగ్వాల్ అక్కడే ఒక టీ కొట్టు నడుపుతారు. ఆంచల్ తన ఊరిలోని గవర్నమెంట్ కాలేజీ లో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసింది. తనకి చిన్నప్పటినుంచే డిఫెన్స్ లో చేరాలి అని కల. అందుకే చిన్నప్పటి నుంచి తనకి డిఫెన్స్ లో ఉద్యోగం వస్తుందా రాదా తన కల నెరవేరుతుందా లేదా అన్న ఆలోచనలు పక్కన పెట్టి ఎంతో కష్టపడి చదివేది.

twitter/ANI

వెంటనే ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్లడం కష్టం అని భావించిన ఆంచల్ మధ్యప్రదేశ్ లో పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరింది. అక్కడ కొన్నాళ్ళు పని చేసిన తర్వాత మధ్యప్రదేశ్ పోలీసు శాఖ వాళ్లు ఆంచల్ ను లేబర్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా నియమించారు. అలా ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్ లో చేరాలంటే రాయాల్సిన AFCAT పరీక్ష రాసింది. ఆరవ అటెంప్ట్ లో ఆంచల్ పరీక్ష పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. తన తల్లిదండ్రులు తను ఎయిర్ఫోర్స్లో చేరుతానంటే మొదట కొంచెం భయపడ్డారు. కానీ తనని ఆపలేదు. తర్వాత తన పట్టుదల చూసి వాళ్లే ఆంచల్ ని ప్రోత్సహించారు.

twitter/ANI

జూన్ 20 2020 రోజు అంటే మొన్న శనివారం ఆంచల్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యింది. హైదరాబాద్ లోని దిండిగల్ లో జరిగిన పెరేడ్ లో పాల్గొంది. ప్రెసిడెంట్ చేతుల మీదగా తన షీల్డ్ ను  అందుకుంది.

కానీ ఈ సమయంలో లో ప్రజలు ఒక చోటునుండి ఒక చోటికి కదలడానికి వీలు లేదు కాబట్టి ఆంచల్ తల్లిదండ్రులు తన గ్రాడ్యుయేషన్ సెర్మనీ చూడడానికి రాలేక పోయారు. కానీ టీవీలో తమ కూతురు ప్రెసిడెంట్ చేతులమీదుగా  షీల్డ్ అందుకోవడం చూసి ఎంతో సంతోషించారు.

twitter/ANI

ఆంచల్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏమై ఉంటుందో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. పెద్ద కలలు కనడానికి మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం అనేది ముఖ్యం కాదు మనం ఆ కలని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాం అనేదే ముఖ్యం అని ఆంచల్ మళ్లీ రుజువు చేసింది.

 

 

Follow Us on FB:


Sharing is Caring: