Ads
సైబర్ క్రైమ్ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఎంతసేపైనా మాట్లాడొచ్చు. అంత ఎక్కువగా జనాలు మోసం చేస్తున్నారు అంతకంటే ఎక్కువగా అమాయకులు మోసపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన అసలు సైబర్ క్రైమ్ అనేది ఎంత దూరం పాకుతుందో తెలియజేస్తుంది.
Video Advertisement
ఒకరోజు తొమ్మిదో తరగతి చదువుతున్న రమ్య అనే అమ్మాయికి ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఫేస్బుక్ ప్రొఫైల్ స్నేహ పేరుతో ఉంది. వివరాలు చూస్తే తను కూడా అంతకు ముందు రమ్య చదివిన స్కూల్ లోనే చదివినట్లు ఉంది. ఒకటే స్కూల్ అన్న ధైర్యంతో రమ్య స్నేహ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది.
మెల్లగా ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదట ఎక్కడ ఉంటారు అమ్మనాన్నలు ఏం చేస్తూ ఉంటారు అనే వివరాలు షేర్ చేసుకున్నారు. తర్వాత స్నేహ ఒక రోజు తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కడికి వెళ్ళింది లాంటి వివరాలు కూడా చెప్పేది. అలా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.
ఒకరోజు స్నేహ తన ఫోటో పంపించి ఈ రమ్య ని కూడా ఒక సెల్ఫీ పంపించమని అడిగింది. ఎలాగో అంతకుముందు సేమ్ స్కూల్ లోనే చదువుకున్నారు ఇంకా ఇద్దరికీ చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అన్న ధైర్యంతో రమ్య కూడా తన ఫోటోలు పంపించింది.
వాళ్ళిద్దరి మధ్య స్నేహం వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు పంపించుకునే అంత దూరం వెళ్ళింది. ఒకరోజు రమ్య కి వేరే ప్రొఫైల్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరో ఏంటో వివరాలు తెలియకపోవడంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. కొంచం సేపటి తరువాత ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ చేసింది అంతకు ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వ్యక్తి.
ఆ మెసేజ్ చూసి షాక్ అయింది రమ్య. ఆ మెసేజ్ లో తను స్నేహ కి పంపించిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయి. “ఈ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి?” అని అడిగింది రమ్య. దానికి అవతల వ్యక్తి “ఈ ఫోటోలు ఇంటర్నెట్లో సేల్ లో ఉన్నాయి. నా ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పటినుంచో లవ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఆ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టిన వాళ్ల దగ్గరికి వెళ్లి గొడవపడ్డాడు. వాళ్లు నా ఫ్రెండ్ ని కొట్టారు” అని చెప్పి ఒక చేతి మీద దెబ్బలు ఉన్న ఫోటోలు పంపించాడు.
ఇదంతా చూసిన రమ్య తనని ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కొని అతనికి మెసేజ్ చేసింది. ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఒకరోజు అతను సడన్ గా రమ్య తో 20000 ఇవ్వమని అడిగాడు ఒకవేళ ఇవ్వకపోతే తన ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతాను అని బెదిరించాడు. దాంతో రమ్యకు ఏం చేయాలో అర్థం కాక అతనిని తన ఫోటోలు లీక్ చేయొద్దు అని బతిమిలాడింది. దానికి అతను సరే అని కానీ అందుకు బదులుగా రమ్య స్నేహితుల వ్యక్తిగత ఫోటోలను పంపించమని అడిగాడు.
ధైర్యం చేసుకుని ఈ విషయాన్ని అంతా తన తల్లితో చెప్పేసింది రమ్య. భయపడుతున్న కూతురుని ఓదార్చి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పింది రమ్య వాళ్ళ తల్లి. ఇద్దరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు.
కొద్ది రోజులకి రమ్యను, వాళ్ళ తల్లి ని పోలీస్ స్టేషన్ కి పిలిచి అసలు ఏమైందో చెప్పారు. విషయం ఏంటంటే స్నేహ, తర్వాత రమ్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వ్యక్తి, ఆ తర్వాత రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఒకరే. బాగా చదువుకున్న, టెక్నాలజీ తెలిసిన ఒక అబ్బాయి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి రమ్య ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు.
రమ్య ఫేస్ బుక్ ప్రొఫైల్లో తను అంతకు ముందు ఏ స్కూల్లో చదివిందో చూశాడు. స్నేహ పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి, తను కూడా అంతకు ముందు అదే స్కూల్ అని వివరాల్లో పెట్టాడు. దాంతో రమ్య యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత రమ్య ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా అలాగే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ లో రమ్య పేరు చూసి వాళ్లు కూడా అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు.
ఇంకొక రెండు ప్రొఫైల్స్ క్రియేట్ చేసి. ఒకదానితో రమ్యకి ఫోటోలు పంపించాడు. ఇంకొక దానితో రమ్య ని ప్రేమిస్తున్నట్లు మాట్లాడాడు. రమ్య తోనే కాకుండా ఇంకా ఎంతో మందితో ఇలాగే మాట్లాడి బెదిరించి బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. కొంతమందితో ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతాను అని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు.
ఇతను బెదిరించిన అమ్మాయిల వివరాలు చూస్తే దాదాపు అందరూ టీనేజ్ వాళ్లే. టీనేజ్ లో చాలామందికి లోకం గురించి అంతగా తెలీదు. కాబట్టి వాళ్ల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి టీనేజ్ అయినా పెద్దవాళ్లు అయినా సరే ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ కి దూరంగా ఉండండి.
ఒకవేళ పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినా కూడా ఎక్కువగా మాట్లాడి మీ వ్యక్తిగత విషయాలను మాత్రం చెప్పకండి. ఇంక ఫోటోలు అడిగితే అక్కడితోనే మాట్లాడడం ఆపేసి వెంటనే సైబర్ క్రైమ్ కు ఇన్ఫార్మ్ చేయండి. పైన చెప్పిన కథ మీకు అర్థం కావడానికి కల్పించిన పేర్లతో చెప్పినది. కానీ అలాంటి సంఘటనలు మాత్రం నిజజీవితంలో జరుగుతూనే ఉన్నాయి.
End of Article