మణికంఠుడు, హరిహర పుత్రుడని భక్తులు విశ్వసించే అయ్యప్పస్వామి ప్రధాన ఆలయం శబరిమలలో ఉంది. రాష్ట్రాలను దాటుకుని వెళ్లలేని భక్తులకోసం రాజమండ్రిలోనే అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. రాజమండ్రి గోదావరి తీరాన కొలువైన మణికంఠుడు ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. రాజమండ్రి సిటీకే కాదు.. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ అయ్యప్పగుడి ఎంతో పాపులర్. ఈ ఆలయానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. సహజంగా అయ్యప్ప మాల ధరించే భక్తులు శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో రాజమండ్రి అయ్యప్ప గుడి కూడా ఒకటి. శబరిమలో మాదిరే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు.

శబరిలో అయ్యప్ప ఆలయం ఎలా ఉంటుందో ఇక్కడ అదే విధంగా అయ్యప్ప ఆలయాన్ని రాజమండ్రిలోని గౌతమి ఘాట్లో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పాటు ఇతర దాతలు సహకారంతో నిర్మించామని ఆయన కుమారుడు జక్కంపూడి రాజా చెబుతున్నారు. చాలా మంది శబరిమల వెళ్లాలంటే వ్యయప్రయాసలతో కూడుకుని ఉంది. అక్కడకు వెళ్లలేని వారికి దగ్గరలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేయటం జరిగింది. ఇక్కడ ఆలయానికి కోటప్పకొండ నుంచి శిలను తీసుకువచ్చి నిర్మించటం జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాముల కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయని ఇక్కడకు వచ్చే స్వాములు చెబుతున్నారు.

పంచలోహాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేయించి అయ్యప్ప స్వామిని ప్రతిష్టించామని ట్రస్టీలు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రతి రోజు అయ్యప్ప ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుందన్నారు. సీజన్ విజయదశమి నుంచి ప్రారంభమై.. జ్యోతి దర్శనం జరిగేంత వరకు నిత్యం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది.

ఇక్కడ అయ్యప్పస్వామి ఆలయంతోపాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షిర్డిసాయి బాబా ఆలయం, లక్ష్మీహయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ ఇలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో నిత్యం ధూపదీప కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తర శబరిగా ఉన్న ఈ ఆలయంలో స్వామిని దర్శించిన వారికి ఆయన కృపాకటాక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.









