Ads
లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీ వద్ద భారత్, చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత నుండి “మేడ్ ఇన్ చైనా” ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలు అంటున్నారు. ట్విట్టర్ లో #బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ (#boycottchinaproducts) అనే ట్రెండ్ తో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ కేవలం ఉత్పత్తి బార్‌కోడ్ ద్వారా చైనీస్ మరియు భారతీయ ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించొచ్చు అని చెబుతోంది.
Video Advertisement
పోస్ట్ ప్రకారం, “690 నుండి 699 సంఖ్యతో ప్రారంభమయ్యే బార్‌కోడ్ చైనా దేశం ప్రోడక్ట్ కోడ్” మరియు “890 సంఖ్యతో ప్రారంభమయ్యే బార్‌కోడ్ భారత దేశం ప్రోడక్ట్ కోడ్”. ఇది ఫేస్‌బుక్‌లో “#boycottchinaproducts” అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) ఈ పోస్ట్ ని ఫేక్ పోస్ట్ అని గుర్తించింది. “బార్‌కోడ్ సంఖ్య యొక్క మొదటి మూడు అంకెలు ఉత్పత్తి చేసిన దేశాన్ని సూచించవు. 690 నుండి 699 వరకు ఉన్న ప్రిఫిక్స్ లను చైనాకు కేటాయించారన్నది నిజం, కానీ ఆ ప్రిఫిక్స్ లతో మొదలైన ఉత్పత్తులు అన్నీ చైనాలో తయారయ్యాయని కాదు” అని వెల్లడించారు.
అసలు బార్ కోడ్ ఎలా పని చేస్తుంది ?
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ఉత్పత్తులపై కవర్ చివరన నల్లటి గీతలతో కనిపించేదాన్ని బార్ కోడ్ అంటారు. అవి మెషీన్ రీడబుల్ ఫార్మెట్ లో ఉంటాయి. బార్ కోడ్ కింద ఉన్న సంఖ్య ప్రోడక్ట్ నెంబర్ ను సూచిస్తుంది. ఆ నంబర్ ను గ్లోబల్ ట్రేడ్ ఐటమ్ నంబర్ (GTIN) అంటారు.
ఏ ఒక్క వస్తువుకి జిటిఐఎన్ ఒకే లాగ పోలి ఉండదు. అన్నిటికీ వేరువేరుగా ఉంటుంది. దాంతో బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వస్తువు యొక్క వివరాలు తెలుస్తాయి.మీరు ఈ ప్రక్రియని సూపర్ మార్కెట్ లో చూసే ఉంటారు.జిఎస్ 1 అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ జిటిఐఎన్ ను తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చర్ లతో కలిసి స్వచ్ఛందంగా పనిచేస్తోంది.
బార్ కోడ్ లో ముందున్న సంఖ్యలు ఏం సూచిస్తాయి ?
బార్‌కోడ్ సంఖ్యలోని మొదటి మూడు అంకెలు ముఖ్యమైనవి. ఉత్పత్తి ఏ దేశంలో తయారైందో అవి సూచించవు, కానీ కంపెనీ ఏ దేశానికి చెందినదో సూచిస్తాయి.ఒక మ్యానుఫ్యాక్చర్ సంస్థ GS1 లో ప్రిఫిక్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, వాళ్ళకి తమ ఉత్పత్తి ఏ దేశం నుండి మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ దేశాన్ని ఎంచుకునే స్వతంత్రం ఉంటుంది. దీన్నిబట్టి ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఒక దేశంలో ఉండొచ్చు అది తయారు అయ్యే దేశం పేరు మరొకటి ఉండొచ్చు.
GS1 వెబ్‌సైట్ ప్రకారం “GS1 ఇచ్చే బార్ కోడ్ ప్రకారం ఆ వస్తువు అదే దేశంలో తయారు అయ్యింది అని ఖచ్చితంగా చెప్పలేము. ప్రపంచంలో ఎక్కడనుండైనా ఆ వస్తువు ఉత్పత్తి అయి ఉండొచ్చు. ఆదేశం కోడ్ ల ఆధారంగా జిఎస్ 1 వాళ్లకి ప్రిఫిక్స్ లను కేటాయిస్తుంది” అని అన్నారు.
ఉదాహరణకు , ఒక భారతీయ కంపెనీ చైనా నుండి ఒక ఉత్పత్తిని దిగుమతి చేసుకుని, దానిని తిరిగి ప్యాకేజీ చేసి బంగ్లాదేశ్‌కు పంపితే, ఆ ఉత్పత్తికి భారతదేశం యొక్క బార్‌కోడ్ ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ లో ఆ వస్తువు కొన్న వాళ్లకి అది ఎక్కడ నుండి ఉత్పత్తి అయిందో తెలియదు.
దీంతో వస్తువుల యొక్క బార్ కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలు ఆ వస్తువు ఉత్పత్తి అయిన దేశాలు సూచించవు అని తేలింది. కాబట్టి బార్ కోడ్ తో చైనా వస్తువులను బహిష్కరించడం అంత సులభం కాదు. ఒకవేళ అలా నంబర్ల ని చూసి వస్తువును బహిష్కరిస్తే అసలు ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
End of Article