Ads
ఆ రోజు “శ్రీరామ నవమి”. ఎలాగో బీటెక్ అయిపోయి సంవత్సరం నుండి కాలిగా ఉన్న నాకు కొత్తగా హాలిడే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నవాడికి సెలవు ఉంటుంది కానీ ఉద్యోగం కోసం ప్రయత్నించేవాడికి ప్రతి రోజు సెలవే కదా..! ఒకప్పుడు అంటే వంటిల్లే ప్రపంచంగా, వాకిలే వైకుంఠంగా బతుకుతున్నాం అని చెప్పేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు వంటిల్లు వాకిలు కాకుండా “వాట్సాప్” ప్రపంచంగా, “ఫేస్బుక్” వైకుంఠంగా బతుకుతున్నాం. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో “శ్రీరామ నవమి శుభాకాంక్షలు” అనే మెసేజ్ ని అందరికి ఫార్వర్డ్ చేస్తునా. ఇంతలో నా ఫ్రెండ్ ఒకడు నాకు ఫోన్ చేసాడు.
Video Advertisement
ఆకలేస్తుంది బయటకి వెళ్లి ఏదైనా తినేసి వద్దాము అన్నాడు. ఎండాకాలం లో ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఎందుకు, సింపుల్ గా వెళ్లి జ్యూస్ తాగుదాము అన్నా . సరే అని చెప్పిన అయిదు నిమిషాలకే వాడు మా ఇంటికి వస్తే అతనితో కలిసి జ్యూస్ షాప్ కి వెళ్ళా..!
జ్యూస్ షాప్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము. షాప్ వాడు కొంచెం టైమ్ పడుతుంది అన్నాడు. ఇంతలో నా ఫ్రెండ్ “నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ప్లాన్ లో ఉన్నా. బీ. టెక్ లో ఉన్నప్పుడు నువ్వు కొన్ని స్టోరీస్ చెప్పేవాడివి కదా!.. ఇప్పుడు “షార్ట్ ఫిల్మ్” కి మంచి “లవ్ స్టోరీ” ఉంటే చెప్పు” అన్నాడు. ఒక స్టోరీ అయితే ఉంది, మంచిదో కాదో నువ్వే విని చెప్పాలి అన్నా. ఎలాగో జ్యూస్ రావడానికి టైమ్ పడుతుంది కదా. ఈ లోపు స్టార్టింగ్ సీన్ చెప్పు అన్నాడు. సరే! అని నేను కథ మొదలుపెట్టా.
ఒక 22 ఏళ్ల యువకుడు “శ్రీరామ నవమి” ఉత్సవాలు జరుగుతున్న ఒక గుడిలో ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉండటంతో స్టార్ట్ అవుతుంది. ఎంత సేపు వెతికినా అమ్మాయి కనపడదు. అక్కడే ఉందని అతని మనసుకి తెలుసు కానీ అతని కనులకు ఎదురుగా మాత్రం కనిపించట్లేదు. ప్రేమ చదరంగంలో తన ప్రేయసి ఆడుతున్న దాగుడుమూతలులాగా అనిపిస్తుంది అతనికి. ఎంతో సేపు వేచి చూసినా అమ్మాయి కనిపించకపోయేసరికి నిరాశతో తిరుగు ప్రయాణం అవుతాడు. తన బైక్ మీద వెళుతుంటే అతని ఆలోచనలలో మొత్తం క్రిందటి సంవత్సరం ఆ అమ్మాయిని అదే గుడిలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో కళ్యాణం కోసం ప్రత్యేకంగా నిర్మించిన వెధికపై సీతారాముల దర్శనం చేసుకుంటూ ఉండగా అతని కనులకు దర్శనం ఇచ్చింది గుర్తుకువస్తుంది.
దేవుని దర్శనం చేసుకుంటున్న తన దేవిని దర్శించుకొన్న అతనికి ఆ అమ్మాయి చిరునవ్వులు మండుటెండలో వెన్నెల ను పంచాయి. ఆ అమ్మాయి పారాణి పాదాలతో తన గుండెలగుడిలో రాణీగా అడుగుపెట్టే రోజు ఎప్పుడో అని ఆలోచిస్తూ ఉంటాడు. సీతారాముల కళ్యాణం అయితే ప్రతిసంవత్సరం జరుగుతూనే ఉంది. కానీ నా ప్రేమకు మాత్రం పునాధి పడట్లేదు అనే నిరాశ నిస్పృహాలతో వెళుతుంటాడు.
ఇలా నేను కథ చెపుతుండగా.. షాప్ వాడు మాకు జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. ఇది స్టోరీ స్టార్టింగ్ అని నా ఫ్రెండ్ కి చెప్పా. ఇంతకీ క్యారక్టర్ పేర్లు చెప్పలేదు అని అడిగాడు.
అబ్బాయి క్యారక్టర్ కి ఏదో ఒక పేరు పెట్టేయి. కానీ అమ్మాయి క్యారక్టర్ కి మాత్రం “చైత్ర” అనే పేరు పెట్టు అని అన్నా. అయితే అబ్బాయి క్యారక్టర్కి నీ పేరే “గోపి” అని పెడతా అన్నాడు నా ఫ్రెండ్. సరే అని చెప్పి కథలో రెండు క్యారెక్టర్స్, ఒకరికోసమే ఒకరు పుట్టినట్టు అనిపించే ప్రేమికులు. ప్రేమ అనే రెండు అక్షరాలకు నిర్వచనం ఇచ్చి మూడుముళ్ళ బంధంగా మార్చి నాలుగు కాలాలు, పంచ బూతాలు, ఆరు ఋతువుల సాక్షిగా ఏడడుగులు ఎలా వేశారు అనేదే ఈ కథ.
క్యారక్టర్ నేమ్స్ ఇంత బాగా స్పెసిఫై చేస్తునవ్. అబ్బాయి క్యారక్టర్ నీ పేరు పెట్టినా పర్లేదు అంటున్నావు అంటే. ఈ కథ నీ రియల్ స్టోరీ అన్నట్టుగా నేరెట్ చెయ్యి అన్నాడు నా ఫ్రెండ్. అన్నట్టుగా ఎందుకు, అది నా నిజం స్టోరీనే అని చెప్పా నా ఫ్రెండ్ కి. “అవునా!..” అని వాడు షాక్ అయ్యి, అసలు ఎవరు ఆ అమ్మాయి. ఎప్పుడు పరిచయం అయ్యింది అంటాడు నా ఫ్రెండ్ ఆశ్చర్య ఆనందాలతో!
అప్పుడు నేను బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. కాలేజ్ బస్ ఎక్కడానికి ఉదయం బస్ స్టాప్ కి అసలే లేట్ అయిపోయిందనే హడావిడిగా వెళుతున్నా. బస్ స్టాప్ ఎదురుగా ఉంది. రోడ్ దాటుతూ ఉండగా బస్ స్టాప్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో నుండి ఒక అమ్మాయి “డైరీ మిల్క్ సిల్క్” తింటూ అందానికి అద్దం పట్టినట్టుగా కనిపించింది నా కళ్ళకి. ఇన్విటేషన్ ఇవ్వకుండానే నన్ను ప్రేమ అనే ప్రపంచంలోకి లాగేసింది. పర్మిషన్ నాది అడగకుండానే నా డ్రీమ్స్ లోకి వచ్చేసింది.
ఇంతలో నాకు ఇంటి నుండి “అమ్మ” ఫోన్ చేసి “త్వరగా ఇంటికి రా, ఇంట్లో పనుంది” అన్నారు. సరే అమ్మాయి పేరు, కథ టైటల్ చెప్పేసి వెళ్ళు.. మిగిలిన కథ నెక్స్ట్ టైమ్ కలిసినప్పుడు చెప్పు అన్నాడు నా ఫ్రెండ్. ఆ అమ్మాయి పేరు “చైత్ర”. ఏదో చిత్రం చేసి నా ఎదకే ప్రేమనే చైత్రం పరిచయం చేసింది.. కానీ నా ప్రేమను ఇంకా అంగీకరించలేదు కాబట్టి ఈ కథ కి “చైత్రామ చేరుమా” అనే టైటల్ పెడదాము. ఆ అమ్మాయి ఎలా పరిచయం అయ్యింది. ప్రేమను వ్యక్తం చేశానా లేదా? అమ్మాయి అంగీకరించిందా లేదా? అనేది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే!
End of Article