Ads
యావత్ మానవాళి తలవంచుకునే ఘటన కేరళలో చోటుచేసుకుంది.. టపాకాయలు కూరిన ఫైనాపిల్ తిన్న గర్భస్థ ఏనుగు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన ఘటన కలవరపెడుతోంది..కేరళలోని మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..ఈ నేపధ్యంలో ఏనుగు పోస్టు మార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Video Advertisement
పేలుడు పదార్ధాలు కూరిన ఫైనాపిల్ తినడం వలన ఏనుగు నోటిలో పెద్ద మొత్తంలో పేలుడు సంభవించిందనీ, దాని కారణంగా తీవ్రమైన గాయాలయ్యాయని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయింది. ఆ గాయాల వలన శరీరంలో ఇన్ఫెక్షన్ సోకిందని, దాని మూలంగా విపరీతమైన నొప్పి, ఒత్తిడికి గురైందని రిపోర్ట్ లో తేలింది. నొప్పి వలన ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని , అలా దాదాపు రెండు వారాల పాటు నీరు, తిండి లేకుండా గడిపిందని పోస్టుమార్టం రిపోర్టులో నిరూపితమైంది.
రెండువారాల పాటు ఆహారం లేకపోవడంతో తీవ్ర నీరసానికి గురైన ఏనుగు నీళ్లలో మునిగిపోయిందని, ఆ తర్వాత పెద్దమొత్తంలో నీరు శరీరంలోకి చేరడంతో ఊపిరితిత్తులు పాడై మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. గర్భంతో ఉన్న ఏనుగు వయసు సుమారు 15 సంవత్సరాలు ఉంటుందని, దాని శరీరంలో బుల్లెట్, ఇతర లోహాల అవశేషాలు కనిపించలేదని డాక్టర్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఏనుగు పట్ల కర్కశంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..ఈ కేసులో ముగ్గురు అనుమానితులను గుర్తించామని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు.వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం..నలభై ఏళ్ల వయసున్న నిందితుడు పేలుడు పదార్ధాలు అమ్మే వ్యక్తిగా గుర్తించారు..మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
End of Article