పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్ లెవల్ కోర్సులు.. 100 శాతం జాబ్ గ్యారెంటీతో తెలంగాణ ఏటీసీలో ఇప్పుడు ఉచితంగా నేర్చుకోవచ్చు.. దరఖాస్తులకు ఈనెల 28 లాస్ట్ డేట్ !

పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్ లెవల్ కోర్సులు.. 100 శాతం జాబ్ గ్యారెంటీతో తెలంగాణ ఏటీసీలో ఇప్పుడు ఉచితంగా నేర్చుకోవచ్చు.. దరఖాస్తులకు ఈనెల 28 లాస్ట్ డేట్ !

by Sainath Gopi

Ads

 

పదో తరగతి పాస్ అయ్యారా? ఏం చేయాలో తోచట్లేదా ? ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువులను మధ్యలోనే ఆపేసారా? తెలంగాణ ప్రభుత్వం మీకో సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.

Video Advertisement

పదో తరగతి క్వాలిఫికేషన్‌తో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగ భరోసాతో పాటు మీలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్ సహకారంతో 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించింది. ఇందుకోసం టాటా గ్రూప్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

ప్రస్తుత తరం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. టాటా గ్రూప్‌తో కలిసి 6 అత్యాధునిక ప్రపంచ స్థాయి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. విద్యార్థులకు 100 శాతం ఉద్యోగ హామీతో పాటు ప్రముఖ కంపెనీల్లో నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పదో తరగతి క్వాలిఫికేషన్‌తోనే మీరు ఈ కోర్సుల్లో చేరొచ్చు. సుశిక్షితులైన టాటా గ్రూప్ ట్రైనర్లతో పాటు ప్రభుత్వ ఐటీఐ ట్రెయినింగ్ ఆఫీసర్లు ఈ కోర్సుల్లో చేరే వారికి ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. అత్యాధునిక మెషినరీపై ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సులో భాగంగా ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో ప్రముఖ కంపెనీలు స్టై ఫండ్ కూడా ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అప్రెంటీషిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి.

రెండేళ్ల కోర్సులు..

1) అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్ టెక్నీషియన్

ఈ కోర్సు ద్వారా విద్యార్థులు CNC మెషిన్ల ఆపరేటర్, ప్రోగ్రామర్‌లుగా తయారవుతారు. మాస్టర్ క్యామ్ సాఫ్ట్‌వేర్, FANUC, SIEMENS, HASS వంటి అంతర్జాతీయ CNC కంట్రోలర్లపై శిక్షణ పొందుతారు. టర్నింగ్, మిల్లింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వరకు ప్రతి దశలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే ప్రముఖ కంపెనీల్లో నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

2) మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్

భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ రెండు సంవత్సరాల కోర్సులో మీరు స్కూటర్లు, ఆటోల నుంచి కార్ల వరకు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల గురించి పూర్తిగా నేర్చుకుంటారు. EVలు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని, వాటి భాగాలను అర్థం చేసుకొని, ప్రతి సిస్టమ్‌కి ట్రబుల్ షూటింగ్, రిపేర్లు ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి టాప్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి.

3) బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫయర్

ఏ పరిశ్రమలోనైనా ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి ముందు రా మెటీరియల్ ఖర్చు తగ్గించడంలో నైపుణ్యాన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. రెండేండ్ల కోర్సులో భాగంగా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిజైనింగ్ నేర్పిస్తారు. ఆ తర్వాత ANSYS సాఫ్ట్‌వేర్ నేర్పిస్తారు. దీనిలో భాగంగా ఒక ప్రొడక్ట్ ఎన్ని సంవత్సరాలు సస్టెన్ అవుతుంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ఏడెడ్ ఇంజనీరింగ్ (CAE) ద్వారా జ్యామెట్రికల్ డిజైనింగ్, మోడలింగ్ నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఏరోస్పేస్ తో పాటు ఏ పరిశ్రమలోనైనా ప్రొడక్ట్ తయారు చేయాలంటే.. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే ముందుగా డిజైన్ చేయాలి. అన్ని పరిశ్రమల్లోనూ ఉద్యోగ అవకాశాలున్నాయి. బీటెక్ లెవల్‌లో ఉండే కోర్సు ఇది. దీన్ని మొదటిసారి ఏటీసీలో ఇంట్రడ్యూస్ చేశారు.

ఏడాది కోర్సులు

1) ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్

ఏడాది కోర్సులో భాగంగా 3D ప్రింటర్ (ప్లాస్టిక్), CARVECO సాఫ్ట్‌వేర్, CNC టూల్‌రూమ్ లేథ్, వెర్టికల్ మెషినింగ్ సెంటర్, లేజర్ కట్టర్, పెయింటింగ్ స్ప్రే బూత్ మరియు ఇండస్ట్రియల్ వర్క్‌స్టేషన్ గురించి నేర్చుకోవచ్చు. 3D ప్రింటింగ్ ద్వారా ఉత్పత్తులు తయారు చేసే నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. ఆర్టిస్టిక్ CAD/CAM టెక్నీషియన్, స్పెషలిస్ట్, CNC రౌటర్, స్కల్ప్టర్, మోడలర్ లాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్, లైటింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమ, పేపర్ పరిశ్రమ, శానిటరీ వంటి అనేక రంగాలతో పాటు ఎయిరోస్పేస్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది.

2) ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్

పరిశ్రమల్లో అత్యంత వేగంగా పనులు పూర్తి కావడానికి ఈ కోర్సు దోహదపడుతుంది. ఇది రోబోటిక్‌ ఆధారితమైనది. ఈ కోర్సులో మీరు ఇండస్ట్రియల్ రోబోటిక్స్ మరియు డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలపై శిక్షణ పొందుతారు. రోబోటిక్ మెషిన్లను ప్రోగ్రామ్ చేయడం, విడి భాగాలకు ఆటోమేటిక్ వెల్డింగ్ చేయడం, అసెంబుల్ లైన్‌ను ఆటోమేట్ చేయడం వంటి అంశాల్లో నైపుణ్యం పొందుతారు. ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ కోర్సులో నైపుణ్యం పొందిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

3) మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ & ఆటోమేషన్

ఏ పరిశ్రమ అయినా మెషిన్ ఆధారిత కంట్రోల్ రూమ్‌లు ఉండటం ఇప్పడు సాధారణం. అలాంటి ఆధునిక పరిజ్ఞానం నేర్చుకోవడానికే… ఈ ‘మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్’ కోర్సు రూపొందించబడింది. ఈ కోర్సులో HMI, PLC, SCADA అనే మూడు కీలక ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లు నేర్పిస్తారు. అలాగే హార్డ్‌వేర్‌ని కూడా ప్రాక్టికల్‌గా చెప్పడమే కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఎలా లింక్ చేయాలి అనేది వివరంగా నేర్పిస్తారు. ప్రొడక్ట్ తయారీని పూర్తిగా ఆటోమేట్ చేయడం ఎలా అనే స్పష్టత ఈ కోర్సులో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన Global Axis, YASKAWA వంటి కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఆహార పరిశ్రమలతో పాటు అన్ని రకాల ప్యాకింగ్ పరిశ్రమల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

అప్లై చేయడం ఎలా..

ముందుగా https://iti.telangana.gov.in/ దరఖాస్తు చేసుకుని.. మీకు దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీకి వెళ్లి ఆ అప్లికేషన్ ఇస్తే నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 28. మరిన్ని వివరాలకు 08069434343 నంబర్‌ను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా వివరాల కోసం 970 333 1914 నంబర్‌ను సంప్రదించవచ్చు.

అవసరమైన పత్రాలు:

పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, బోనోఫైడ్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవపత్రం


End of Article

You may also like