Ads
శ్రావణ మాసం లో ఎంతో ముఖ్యమైన రోజు శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం చేస్తే అష్టలలక్ష్ములకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందట. వరలక్ష్మీ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు తెలియజేశారు అని పురాణాలు చెబుతున్నాయి.
Video Advertisement
ఒక రోజు పార్వతీదేవి పరమశివుని తో ” దేవా! లోకంలో ఉన్న స్త్రీలు సర్వసౌఖ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధితో, సకల సౌభాగ్యాలతో ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి? అటువంటి వ్రతాన్ని తెలియజేయండి ” అని అడిగారు. అందుకు శివుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సర్వసౌఖ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలియజేశారు.
చారుమతి అనే మహిళ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహం తో సకల సౌభాగ్యాలను పొందింది అనే కథ వరలక్ష్మి వ్రత విధానం లో చాలా సార్లు వినే ఉంటారు. అలా ఎన్నో సంవత్సరాల నుండి మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు.
శ్రావణ శుక్రవారం నాడు ఉపవాసాన్ని పాటిస్తూ, అమ్మవారి ప్రతిమను తయారు చేసి, అలంకరించి, ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి, పూజ చేస్తారు. శుక్రవారం నాడు కలశాన్ని కదిలించరు.
వ్రతం చేసిన తర్వాత మరుసటి రోజు అంటే శనివారం నాడు కలశాన్ని జరిపి నిర్మాల్యాన్ని తొలగించి కొత్త పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. దీపం కొండెక్కిన తర్వాత కలశాన్ని కదిలిస్తారు. కలశాన్ని కదిలించిన తర్వాత కొబ్బరికాయను, కలశం కింద ఉంచిన బియ్యాన్ని ఇప్పుడు చెప్పే విధంగా ఉపయోగించవచ్చు.
చాలామంది కొబ్బరికాయను, కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. కానీ కొంతమంది వరలక్ష్మిగా పూజించిన కొబ్బరి కాయను దానం చేస్తే లక్ష్మి దేవి ఇంట్లో నుండి వెళ్లి పోతుంది అని అనుకుంటారు.
అలాంటప్పుడు ఆ కొబ్బరి కాయతో ఏదైనా తీపి పదార్థం తయారు చేసి నైవేద్యంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయతో పచ్చడి లాంటివి చేయకూడదట, కేవలం తీపి పదార్థం అంటే కొబ్బరి సున్ని లేదా కొబ్బరి ఉండలు తయారుచేసే ప్రసాదంగా స్వీకరించాలట.
కానీ కొబ్బరికాయ తో తయారుచేసిన ప్రసాదాన్ని ఎంత తొందరగా స్వీకరిస్తే అంత మంచిదట ఎందుకంటే వెంటనే ప్రసాదం తయారు చేయకపోతే కొబ్బరికాయ కుళ్లిపోయే అవకాశాలున్నాయట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయ ప్రసాదాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్వీకరించాలి.
అలాగే కలశం కింద పెట్టిన బియ్యంతో కూడా పరవాన్నం లాంటి తీపి పదార్థం తయారుచేసి ఇంట్లో ఉన్న సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలట. కలశం లో ఉన్న నీళ్లను ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ వాళ్ళ మీద చల్లుకొని మిగిలిన నీళ్ళని మామిడి ఆకులతో సహా మొక్క మొదళ్లలో పోయాలట.
కలశం పై పెట్టిన బ్లౌజ్ పీస్ ని బ్లౌజ్ గా కుట్టించుకోవచ్చట, కలశం లో వేసిన నాణాన్ని దేవుడి మందిరంలో గానీ లేదా బీరువాలో భద్రపరుచుకోవాలట. ఇలా నియమనిష్టలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం తో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలను పొందుతారట.
End of Article