కాలం మారింది. కాలంతో పాటు మనుషులు కూడా మారారు. కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుడితే అంగీకరించే మనస్తత్వం మాత్రం రాలేదు. ఇటీవల విశాఖలో అటువంటి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, విశాఖలోని కంచుగుమ్మల శివారు భోగాపురం సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో ముళ్లపొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు.

చీమలు కుట్టి ఏడుస్తున్న ఆ పాప ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్సై నాగ కార్తీక్ హుటాహుటిన ఆ ప్రదేశానికి వచ్చి ఆ పాపని తానే స్వయంగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ పాప మహిళా శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంది. ఎస్సై నాగ కార్తీక్ చేసిన పనిని చూసి స్థానికులు అందరూ అభినందించారు.