Ads
తమిళ్ నుండి తెలుగుకి డబ్ అయిన సినిమాలతో ఫేమస్ అయిన హీరో జయం రవి. స్వతహాగా తెలుగు వాడు అయిన జయం రవి, తమిళ్ లో సినిమాలు చేసి అక్కడ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు జయం రవి హీరోగా నటించిన ఇరైవన్ సినిమా తెలుగులో గాడ్ పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : గాడ్
- నటీనటులు : జయం రవి, నయనతార, నరైన్.
- నిర్మాత : సుధన్ సుందరం, జయరామ్ .జి
- దర్శకత్వం : I. అహ్మద్
- సంగీతం : యువన్ శంకర్ రాజా
- విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023
స్టోరీ :
అర్జున్ (జయం రవి) ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. దేనికి భయపడడు. అర్జున్ కి సొంత కుటుంబం అంటూ లేదు. అందుకే తనతో పాటు పని చేసే తన స్నేహితుడు అయిన ఆండ్రూ (నరైన్) కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తూ ఉంటాడు. అర్జున్ ఆండ్రూ సోదరి అయిన ప్రియ (నయనతార) తో ప్రేమలో పడతాడు. కానీ తన వ్యక్తిత్వం వల్ల తాను ఎప్పుడు చనిపోతానో తెలియదు అనే ఉద్దేశంతో ప్రియకి తన ప్రేమను వ్యక్త పరచకుండా దూరంగా ఉంటూ ఉంటాడు. ఒక సమయంలో స్మైలీ కి-ల్ల-ర్ బ్రహ్మ (రాహుల్ బోస్) కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది.
ఇతన్ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ తన ప్రాణాలని కోల్పోతాడు. ఆండ్రూ లేకపోవడంతో అక్కడ పని చేయను అని చెప్పి అర్జున్ కూడా తన జాబ్ వదిలేసి ఒక కాఫీ షాప్ పెట్టుకుంటాడు. అరెస్ట్ అయిన బ్రహ్మ జైలు నుండి తప్పించుకుంటాడు. అంతే కాకుండా అర్జున్ కి సన్నిహితులు అయిన అమ్మాయిలని ఈ సారి టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు అర్జున్ ఏం చేశాడు? ఆ అమ్మాయిలని ఎలా కాపాడాడు? అసలు బ్రహ్మ ఇలా ఎందుకు చేస్తున్నాడు? తాను ప్రేమించిన ప్రియని అర్జున్ కలిశాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అనేది ఒక స్పెషల్ కేటగిరి. సాధారణంగా ప్రతి సినిమాకి తమ బుర్రని అంత పెద్దగా పదును పెట్టని ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకి మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలివిగా ఆలోచిస్తూ సినిమా చూస్తారు. కాబట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నారు అంటే ఒక రకంగా రిస్క్ చేస్తున్నట్టే అర్థం. ఎందుకంటే కాస్త అటు ఇటు అయినా కూడా లాజిక్ మిస్ అయ్యి ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. దాంతో సినిమాని ట్రోల్ కూడా చేస్తారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా అలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లోనే వచ్చింది. తమిళ్ లో ఈ సినిమా చంద్రముఖి 2 తో పాటు రిలీజ్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ మీద తమిళ్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఒక సినిమా. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా కాన్సెప్ట్ తెలిసిన కాన్సెప్ట్. ధైర్యంగా ఉండే ఒక హీరో. కానీ కొంత మంది మనుషులతో ఎమోషనల్ కనెక్షన్ ఉండడం. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లే దూరం అవ్వడం.
అప్పుడు హీరో అలా దూరం చేసిన వారిని పట్టుకోవడం. ఇదంతా మనం ఎప్పటి నుండో చూస్తున్న కాన్సెప్ట్. కాకపోతే ఈ సినిమా టేకింగ్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండేలాగా చూసుకున్నారు. జయం రవి పాయింట్ అఫ్ వ్యూ నుండి ఈ సినిమా మనకు చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జయం రవి పోలీస్ పాత్రలో బాగా నటించారు. కానీ సినిమాకి హైలైట్ అయ్యింది మాత్రం విలన్ పాత్రలో నటించిన రాహుల్ బోస్ నటన. అంతే కాకుండా మరొక విలన్ పాత్రలో నటించిన ఆ నటుడు కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు.
నయనతార పాత్ర గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా సినిమాల్లో ఉండే ఒక మామూలు హీరోయిన్ పాత్ర ఇది. తన పాత్ర పరిధి మేరకు నయనతార నటించారు. ముఖ్య పాత్రలో నటించిన నరైన్ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. పాటలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.
హరి కే వేదాంత్ అందించిన సినిమాటోగ్రఫీ డార్క్ థీమ్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ వచ్చేలా చేసింది. సినిమా డబ్బింగ్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. దర్శకుడు ఎంత సేపు అమ్మాయిలు చనిపోయారు అనే విషయాన్ని చూపించాడు కానీ, అసలు ఆ కేసులన్నిటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనే విషయాన్ని ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
అంతే కాకుండా విలన్ బ్యాక్ స్టోరీ కూడా ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉండాల్సింది. అతను అసలు ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇంకా బలంగా చూపించాల్సింది. సెకండ్ హాఫ్ లో సినిమా కంటెంట్ మీద చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇదే ఫస్ట్ హాఫ్ లో కూడా తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- టేకింగ్ లో కొత్తదనం
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- డబ్బింగ్
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- ఎడిటింగ్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారు, మరీ ఎక్కువగా ఆశించకుండా, అసలు కాన్సెప్ట్ ఏంటి? సినిమా టేకింగ్ ఎలా ఉంది? ఇవన్నీ చూద్దాం అనుకునేవారు అయితే, లాజిక్స్ కరెక్ట్ గా లేకపోయినా పర్వాలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే చాలు అని అనుకునే వారికి గాడ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “అరవింద సమేత” సినిమా ఎన్నో సార్లు చూసి ఉంటారు..! కానీ ఈ విషయం గమనించారా..?
End of Article