Ads
ఎక్కడి నుండో వచ్చిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం, తర్వాత ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా సినిమా విడుదల అయ్యే ఒక రోజు తో భవిష్యత్తు మారిపోయే సినిమా ఇండస్ట్రీలో అయితే ఇంకా కష్టం.
Video Advertisement
పైకి నవ్వుతూ, స్టైల్ గా, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండే స్టార్లు, వాళ్ళు ఇవాళ ఉన్న ఆ స్థానానికి రావడం వెనకాల ఎన్నో త్యాగాలు, కష్టాలు, గొడవలు, హార్ట్ బ్రేక్స్, నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఉంటాయి.
అలా అన్ని తట్టుకుని నిలబడితేనే సినీ చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ సంపాదించగలుగుతారు. అలా ఎన్నో కష్టాలను భరించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నటి నయనతార. నయనతార జీవితం పైకి కనిపించినంత సాఫీగా సాగలేదు. డయానా నుండి నయనతార వరకు ఎదిగిన లేడీ సూపర్ స్టార్ జర్నీ ఇప్పుడు చూద్దాం.
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఒక మలయాళ కుటుంబంలో జన్మించింది డయానా. డయానా తండ్రి ఎయిర్ ఫోర్స్ అధికారి కావడంతో తన విద్య మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో జరిగింది. పార్ట్ టైం గా మోడలింగ్ మొదలు పెట్టింది డయానా.
తర్వాత ఒక మలయాళ ఛానల్లో యాంకర్ గా చేరింది. కొద్దిరోజులకే ఒక మలయాళం వీక్లీ లో నయనతార మోడలింగ్ చేసిన జెవెలరీ అడ్వటైజ్మెంట్ చూసిన మలయాళ దర్శకుడు సత్యన్ అంతికాడ్ డయానా ని సినిమాలో చేయమని అడిగారు. మొదట వద్దు అనుకున్నా కూడా ఒక్క సినిమా చేసి చూద్దాం అనే ఉద్దేశంతో సరేనని చెప్పింది డయానా.
కానీ అప్పటికి డయానా అనే ఒక అడల్ట్ ఫిలిం వచ్చింది. అందుకే సత్యన్ అంతికాడ్ డయానా పేరు మార్చాలి అనుకున్నారు. సత్యన్ తో కలిసి ఆ సినిమాలో నటిస్తున్న నటులు షీలా, జయరామ్ నయనతార పేరుని ఫైనల్ చేశారు. ఈ పేరు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వర్క్ అవుతుంది అనుకున్నారట. అలా మనసిక్కరే సినిమాతో నయనతార గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమా పెద్ద హిట్. దాంతో నయనతార కి వరుసగా సినిమా ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి. అలా మూడు మలయాళ సినిమాలు చేసిన తర్వాత అయ్యా సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చంద్రముఖి సినిమాలో నటించింది. ఆ సినిమాతో తెలుగు వాళ్లకి కూడా తెలియడంతో డైరెక్ట్ తెలుగు సినిమా లక్ష్మి తో తెలుగు ఇండస్ట్రీ ని కూడా పలకరించింది.
తర్వాత చాలా సినిమాలు చేసింది. దాదాపు అన్ని హిట్ సినిమాలే. కానీ టర్నింగ్ పాయింట్ అనే సినిమా రాలేదు. గ్లామరస్ పాత్రలు చేసినా సరే నటన పరంగా కూడా ప్రతి పాత్రకు తన వంతు న్యాయం చేసింది.
అయినా ఏది చెప్పుకో దగ్గ చిత్రం అనిపించడంలేదు. మధ్యలో వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చాయి. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా, ఒకవేళ పట్టించుకున్నా కూడా ఏవి బయటికి కనిపించకుండా సీరియస్ గా కెరీర్ మీద దృష్టి పెట్టింది.
హీరోయిన్లని ఏ డైరెక్టర్ అయినా గుర్తిస్తారు. కానీ నటులని గుర్తించిన వారే గొప్ప డైరెక్టర్లు అవుతారు. అలా తనలోని నటిని గుర్తించిన డైరెక్టర్ బాపుగారు. బాపు సినిమా అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉండరు, ఒకవేళ ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే వద్దనుకునే నటులు కూడా ఉండరు.
ఇంగ్లీష్ లో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అంటారు. అంటే జీవితంలో ఒకటేసారి వచ్చే అవకాశం అని అర్థం. బాపు గారితో కలిసి పని చేయడం కూడా అలాంటి అవకాశమే. అందుకే నయనతార కూడా బాపు గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావించి ఒప్పుకున్నారు.
బాపు గారి సినిమా అది కూడా శ్రీరామరాజ్యం లాంటి సినిమా అందులో సీతమ్మ పాత్ర. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన వెంటనే అసలు నయనతార ఏంటి? తను ఏం చేయగలుగుతుంది? అన్న వాళ్లు ఎంతో మంది. కానీ నయనతార అవేమీ పట్టించుకోకుండా తన పాత్ర మీద దృష్టి పెట్టారు.
ఇంకొక విషయం ఏంటంటే అప్పటికే నయనతార ఒక ప్రముఖ వ్యక్తి తో ప్రేమ లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకొని ఇంక సినిమాలు ఆపేద్దామని నయనతార నిర్ణయించుకున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత తనకు అంత మంచి పాత్ర ఇచ్చినందుకు బాపు గారికి థాంక్స్ చెప్పి ఏడ్చేశారు. అంతేకాకుండా సినిమాకి పనిచేసిన బృందం మొత్తానికి వాచ్ లు బహుమతిగా ఇచ్చారు.
అప్పుడే అనుకోకుండా తను ప్రేమించిన వ్యక్తితో విడిపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా అధిగమించిన నయనతార ఈ సమస్యను తట్టుకోలేకపోయారు. దాంతో దాదాపు పదకొండు నెలల వరకు మీడియా ముందుకు రాలేదు.
సినిమాల నుండి కూడా బ్రేక్ తీసుకున్నారు. అంతలోపు శ్రీరామరాజ్యం విడుదల అయింది. సినిమాని తెలుగులో తీసినా కూడా తమిళం, మలయాళం భాషల్లో అనువాదం అయ్యింది.
నయనతార ఎంత మంచి నటో ఒక్క తెలుగు భాష లోనే కాకుండా మిగిలిన భాషలలో కూడా తెలిసింది. అంత గొప్ప పాత్ర లో ఆమె ఎలా నటిస్తుంది? అని కామెంట్ చేసిన వారే అంత గొప్ప పాత్రలో ఎంత బాగా నటించింది అని ప్రశంసించారు.
నయనతార సినిమాలని వద్దనుకుంది. కానీ సినిమాలు నయనతారను వద్దు అనుకోలేదు. తెలుగులో టర్నింగ్ పాయింట్ ఈ సినిమాతో వచ్చింది. ఇప్పుడు తమిళ్ సినిమాలో కూడా తను మంచి నటి అని నిరూపించుకోవాలి. అప్పుడు వచ్చిన అవకాశమే రాజా రాణి. కొత్త దర్శకుడు. సినిమాలో స్టార్లు కూడా లేరు.
పాటలు బాగుండడంతో ఏదో మంచి ఫీల్ గుడ్ సినిమా ఏమో అనుకొని జనాలు థియేటర్ లోకి వెళ్లారు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎంతో మంది ఈ సినిమా లో పాత్రలకి కనెక్ట్ అయ్యారు. అప్పుడు వచ్చింది నయనతారకి చెప్పుకోదగ్గ సినిమా. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
అప్పటివరకు పెద్ద బ్యానర్లు, లేదా పెద్ద హీరోలు, ఉన్న సినిమాలు చేసి ఎప్పుడూ అంత పెద్దగా రిస్క్ తీసుకోని నయనతార రాజా రాణి సినిమా తర్వాత నుండి కథని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పాత్రలు ఎంచుకోవడం మొదలుపెట్టారు. హీరోయిన్ నయనతార అనే ఇమేజ్ నుండి బయటికి వచ్చి నటి నయనతార అని నిరూపించే సినిమాలు ఎన్నో చేశారు.
అప్పటివరకు గ్లామరస్ హీరోయిన్ అనే దృష్టితో సినిమాలు చూసిన ప్రేక్షకులు కూడా అప్పటి నుండి నయనతారని గౌరవించడం మొదలుపెట్టారు. మీరు ఒక్కసారి మొదటి నుండి చదివితే ముందు ది తో తన జర్నీ గురించి చెప్పడం మొదలుపెట్టి ఇప్పుడు రు కి వచ్చాం. దాని అర్థం కాలక్రమేణా మనకి నయనతార మీద పెరిగిన గౌరవాన్ని చూపించడానికి మాత్రమే.
పాత్రకి పాత్రకి సంబంధం లేకుండా, కొత్త దర్శకులా పాత దర్శకులా అన్న తేడా లేకుండా ఏది మంచి పాత్ర అనిపిస్తే ఆ సినిమాను ఒప్పుకుంటున్నారు. అలా అని కమర్షియల్ చిత్రాల ను పూర్తిగా వదిలేయకుండా అప్పుడప్పుడు బిగిల్, దర్బార్ వంటి సినిమాలు కూడా చేస్తున్నారు.
గజిని సినిమా చేసిన నయనతార, సింహ సినిమా చేసిన నయనతార ఒకరే. బిల్లా (తమిళ్), యోగి వంటి గ్లామరస్ పాత్రలో నటించిన నయనతార యారడీ నీ మోహిని (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తమిళ్ రీమేక్) సినిమాలో సాధారణంగా, ఐరా సినిమాలో డి గ్లామర్ పాత్రలో కూడా నటించారు. అప్పుడు ఇప్పుడు నయనతార ఒక్కరే. కానీ మారిందల్లా ప్రేక్షకులు తనను చూసే విధానం.
పదిహేడేళ్ల సినీ కెరీర్. ఎన్నో కాంట్రవర్సీలు, మీడియాలో ఎన్నోసార్లు తన పేరు వచ్చింది, ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి అయినా సరే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క పుకారు కి కూడా పెద్దగా స్పందించలేదు. ఏ ఒక్క సోషల్ మీడియాలోనూ తనకి ఎకౌంట్ లేదు. అంతకుముందు సినిమా ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడేవారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కి కూడా రాను అని సినిమా సైన్ చేసేటప్పుడే చెప్పేస్తున్నారు.
అయినా సరే దర్శకులు ఆమెతో పని చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం కేవలం పనిమీద తనకి ఉన్న శ్రద్ధ మాత్రమే. మీరు ఒకసారి గమనిస్తే మన తెలుగులో నయనతార చేసిన సినిమాలు తమిళం తో పోలిస్తే తక్కువే. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో నయనతార కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. కానీ కేవలం మన పని మాత్రమే మాట్లాడాలి అనే నటులు మాత్రం తక్కువ మంది ఉంటారు. వాళ్లే ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కన్సిస్టెంట్ గా సినిమాలు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటారు. వాళ్లలో నయనతార ఒకరు.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు, మధ్యలో కాంట్రవర్సీలు వచ్చాయి కానీ సినిమా ఆఫర్లు మాత్రం వాటి వల్ల వచ్చినవి కావు.డయానా నుండి నయనతార గా మారడం అంటే కేవలం పేరు మార్చుకోవడం మాత్రమే కాదు. ఆ పేరు వెనకాల ఉన్న 17 ఏళ్ల కష్టం. ఆ కష్టాలను అధిగమించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్ళిన ధైర్యం.
భవిష్యత్తులో కూడా నయనతార ఇలాగే మంచి సినిమాలు చేస్తూ గొప్ప నటి అని నిరూపించుకోవాలి కాదు కాదు గొప్ప నటి అన్న పేరును నిలబెట్టుకోవాలి అని ఆశిద్దాం.
End of Article