Ads
వెస్ట్ గోదావరి జిల్లాలో మొగల్తూరు అనే ఒక ఊరు. ఆ ఊరిలో 65 ఏళ్ల క్రితం పుట్టారు శివశంకర వరప్రసాద్. తండ్రి కానిస్టేబుల్ గా పని చేసేవారు. శివశంకర వరప్రసాద్ నర్సాపూర్ లో కామర్స్ లో డిగ్రీ చేసిన తర్వాత 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరుదామని చెన్నైకి బయల్దేరారు.
Video Advertisement
వరప్రసాద్ కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. అందుకే వరప్రసాద్ తల్లి అతని స్క్రీన్ నేమ్ ని చిరంజీవిగా మార్చుకోమని సలహా ఇచ్చారు. దాంతో 1978లో ప్రాణం ఖరీదు సినిమా తో చిరంజీవి గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శివ శంకర వరప్రసాద్.
రెండవ సినిమా గా బాపుగారి డైరెక్షన్ లో మన ఊరి పాండవులు సినిమా చేశారు చిరంజీవి. అసలు చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు. కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. మన ఊరి పాండవులు సినిమా చిరంజీవికి గుర్తింపు తీసుకువచ్చింది.
ఆ తర్వాత ఐ లవ్ యు, ఇది కథ కాదు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించారు. తర్వాత మోసగాడు, రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, ఇలా వరుసగా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు చిరంజీవి.
1982 లో కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో హీరోగా నటించారు చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తర్వాత కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ సినిమాలో హీరోగా నటించారు చిరంజీవి. ఈ సినిమాకి ఉత్తమ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
సోలో హీరోగానే కాకుండా పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా వంటి మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించారు చిరంజీవి. 1984 లో వచ్చిన ఖైదీ చిరంజీవికి స్టార్ డం తీసుకువచ్చింది.ఆ తర్వాత చిరంజీవికి ఇంక వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు.
మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గుండా, ఛాలెంజ్, హీరో, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు, స్వయంకృషి ఇలా వరుసగా హీరోగా సినిమాలు చేశారు.
పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ సినిమాలతో హిట్లను అందుకున్నారు. అలాగే మధ్యలో రుద్రవీణ వంటి ప్రయోగాత్మకమైన అవార్డ్ విన్నింగ్ చిత్రాలను కూడా చేశారు. తర్వాత వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిరంజీవి కెరీర్ లో ఇంకొక మైలురాయి గా నిలిచింది. అప్పటికే స్టార్ హీరో గా ఉన్న చిరంజీవిని ఈ సినిమా ఇంకొక మెట్టు పైకి ఎక్కించింది.
1990 మధ్యలో చిరంజీవి కెరియర్ లో వరుసగా కొన్ని ఫ్లాప్ లు వచ్చాయి. మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో అప్పటివరకు వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన చిరంజీవి 1996 లో దాదాపు ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకొని కేవలం కథలు మాత్రమే విన్నారు.
అప్పుడు మళ్ళీ 1997 లో హిట్లర్ సినిమా తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో చిరంజీవి మరొక ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత మాస్టర్, బావగారు బాగున్నారా?, చూడాలని ఉంది, స్నేహం కోసం సినిమాలతో హిట్ జర్నీ కొనసాగించారు.
మైథలాజికల్ సినిమా శ్రీ మంజునాథ లో శివుడి పాత్రలో నటించారు. తర్వాత వచ్చిన ఇంద్ర ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఠాగూర్ కూడా హిట్ గా నిలిచింది.
2004 లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమా కి అనుకున్న ఫలితం రాకపోయినా కూడా టెక్నికల్ యాస్పెక్ట్స్ లో ఉన్నత స్థాయిలో ఉండడంతో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు, జై చిరంజీవ, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు వచ్చాయి.
ఇందులో కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ అన్ని సినిమాల్లోనూ చిరంజీవి నటన, డాన్స్ ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశ పరచలేదు. తర్వాత మళ్ళీ దాదాపు పది సంవత్సరాల విరామం.
మధ్యలో మగధీర, జగద్గురు ఆది శంకర, బ్రూస్ లీ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించినా, వరుడు, రుద్రమదేవి సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చినా అభిమానులు మాత్రం చిరంజీవిని మళ్లీ తెరపై మూడు గంటల పాటు ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూశారు. ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ మళ్లీ 2017 లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.
ఖైదీ నెంబర్ 150, తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే చిరంజీవి ప్రేక్షకులని మళ్లీ ఎప్పటిలాగానే, అంతే ఉత్సాహంతో అలరిస్తారు అని, ప్రజలు కూడా ఎప్పటికీ చిరంజీవిని అంతే అభిమానిస్తారు అని రుజువు చేశాయి. భవిష్యత్తులో రాబోయే మెగాస్టార్ సినిమాలు కూడా ఖచ్చితంగా ఇదే మాటని రుజువు చేస్తాయి.
End of Article