Ads
ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇండియాలోని కేరళ లోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు… ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో వారిని కేరళలో కాసర్ గోడ్ జిల్లా కన్హంగాడ్‌లో చికిత్స నందిస్తున్నారు. అయితే వీరి గురించి ఓ మంచి వార్త మనముందుకు వచ్చింది.
Video Advertisement
ఆ ముగ్గురు ఇప్పుడు కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ కూడా చేసారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేరళ ఆరోగ్యమంత్రి థామస్ ఐజక్ ట్విటర్లో ‘‘నిపా కేసులో మాదిరిగానే, కరోనా వైరస్‌పై పోరాటంలో కేరళ విజయం సాధించింది. కరోనా బారిన పడిన ముగ్గురూ పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారు. క్వారంటైన్ పరిశీలనలో వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆరోగ్య శాఖకు అభినందనలు..’’ అని ట్వీట్ చేసారు.
వారిలో త్రిశూర్‌కు చెందిన ఓ విద్యార్థిని రక్త నమూనాలను తాజాగా అలెప్పీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా.. వైరస్ జాడ కనిపించలేదని సీనియర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. దీంతో విద్యార్ధిని డిశ్చార్జ్ చేసినట్లు కాసర్ గోడ్ జిల్లా వైద్య అధికారి ఇన్‌ఛార్జ్ డాక్టర్ రామ్‌దాస్ తెలిపారు. 18రోజుల చికిత్స అనంతరం విద్యార్ధిని డిశ్చార్జ్ అయ్యారు. మరో పదిరోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని రామ్ దాస్ చెప్పారు.
End of Article