ప్రపంచంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉంటారు. వారిని దత్తత తీసుకోవాలని, చదువు చెప్పించాలని, వాళ్లు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ ఎవరైనా దత్తత తీసుకోవాలి అనుకుంటే ఒకరు లేదా ఇద్దరు లేదంటే ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటారు.

ఇంకా మంచి మనసు ఉండి ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్న వాళ్లు అయితే ఆశ్రమాలు కట్టించి అందులో ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్ని సదుపాయాలు అందిస్తారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా 470 మంది ఆడ పిల్లలను దత్తత తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.

గుజరాత్ లోని భావనగర్ కి చెందిన మహేష్ సవాని ఒక వజ్రాల వ్యాపారి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తుంటాడు. ముందు నుండి కూడా మహేష్ కి తను సంపాదించిన దాంట్లో నుండి పేదలకు తన వంతు సహాయం చేయడం అలవాటు. అదే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.

మహేష్ కి ఒక అన్నయ్య ఉండేవారు. ఆయనకి పిల్లలు కూడా ఉన్నారు. మహేష్ వాళ్ళ అన్నయ్య తన పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడే మరణించారు. అప్పటినుండి తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకున్నాడు మహేష్.తన అన్నయ్య కూతురు పెళ్లి చేసినప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టమో మహేష్ కి అర్థమైంది.

2008లో  మహేష్ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి తన కూతురు పెళ్లికి పది రోజుల ముందు మరణించారు. అప్పుడే మహేష్ కి ఈ ఆలోచన వచ్చింది. తన గ్రామంలో ఉన్న తండ్రి లేని ఆడపిల్లలు అందరిని దత్తత తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అదే విషయం గ్రామం అంతటా ప్రకటించాడు.

కుల మత బేధం లేకుండా తన గ్రామంలో ఉన్న ఆడ పిల్లల్ని దత్తత తీసుకొని అన్ని ఖర్చులు తానే భరించి వారికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసి పెళ్లిళ్లు జరిపించాడు మహేష్. 2014లో ఒక్క పెళ్ళికి 4 లక్షల చొప్పున 111 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించాడు.

పెళ్లికి కావలసిన ఆభరణాలే కాకుండా తర్వాత వాళ్లు ఉండబోయే ఇంట్లో కి కావలసిన సామాన్లు కూడా కొన్నాడు. అలా ఇప్పటివరకు 470 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించాడు మహేష్. ప్రతిఫలం లేకుండా ఏ పని చెయ్యని ఈ రోజుల్లో తిరిగి ఏం ఆశించకుండా బాధ్యతలు తీసుకునే మహేష్ లాంటి వ్యక్తి ఉండడం ఎంతో అరుదు.