2020 వచ్చి అప్పుడే ఆరు నెలలు అయిపోయింది. మనకి తెలియకుండానే సగం సంవత్సరం గడిచిపోయింది. ఎవరు ఊహించని విధంగా ప్రపంచం మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు కరోనా, తర్వాత తుఫాన్ వీటి నుండి కోలుకొనే లోపే ఇప్పుడు మరొకటి. కానీ ఈ సారి మిడతలు రంగంలోకి దిగాయి. గాలి కూడా దూరడానికి వీలు లేనంతగా మిడతలు అన్ని గుంపుగా చేరి పంటల పై దాడి చేస్తున్నాయి. మామూలుగా పంటలపై కీటకాల దాడి జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ మిడతల దాడి ఆ కోవలోకి చెందదు.

Video Advertisement

ఒక్కొక్క గుంపులో దాదాపు ఎనిమిది కోట్ల మిడతలు ఉంటాయి. ఒక్కరోజులో 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. ఈ గుంపు భారత దేశం కి ఇప్పుడు వచ్చింది కానీ మిడతల దాడి మొదలై దాదాపు సంవత్సరం అయ్యింది. ఆసియా, మనుషులకి తిండి కూడా దొరకడానికి కష్టంగా ఉండే ఆఫ్రికా లోని 23 దేశాల్లో పంటల్ని ఈ మిడతల గుంపు నాశనం చేసింది. ఈ మిడతల గుంపు దాదాపు 30 వేల మంది తినే ఆహారాన్ని తినగలవు. పదిహేనేళ్ళ క్రితం దాదాపు మూడు కోట్ల ఎకరాల పంట పై దాడి చేశాయి. మళ్లీ అదే ఘటన ఇప్పుడు పునరావృతం అవుతోంది కానీ ఈ సారి ఇతర దేశాల కే కాకుండా భారత దేశం పై కూడా ప్రమాదం పొంచి ఉంది.

ఇప్పటికే రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ పంజాబ్ హర్యానా పై ఈ మిడతల దాడి జరిగింది. ఎన్నో లక్షల ఎకరాల భూమి నాశనం అయింది. తర్వాత ముప్పు పొంచి ఉన్న ప్రదేశాలు మన తెలుగు రాష్ట్రాలే. తెలంగాణకు పక్కనే ఉన్న విదర్భ లో ఇప్పటికే ఈ దాడి వల్ల ఎంతో పంట నష్టం జరిగింది. ఇంకా తర్వాత తెలంగాణ వైపు ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వైపు ఈ మిడతల గుంపు దాడిచేసి సూచనలు కనిపిస్తున్నాయి.

అందుకే రెండు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిపైరిఫోస్ అనే రసాయనిక పదార్థాన్ని ఆ కీటకాలకు వచ్చినప్పుడు పిచికారి చేయడానికి సిద్ధం చేశారు. మరికొన్ని చోట్ల వినూత్నంగా పెద్ద స్పీకర్ లలో పాటలు పెట్టి ఆ శబ్దానికి మిడతలు భయపడి పారి పోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.