Ads
సంవత్సరానికి ఒక సినిమాతో, కమర్షియల్ సక్సెస్ సాధిస్తూ, హిట్ మీద హిట్ కొడుతున్న హీరో బాలకృష్ణ. చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా, ప్రతి సినిమా హిట్ అవ్వడంతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : భగవంత్ కేసరి
- నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్.
- నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
- దర్శకత్వం : అనిల్ రావిపూడి
- సంగీతం : ఎస్ తమన్
- విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
స్టోరీ :
భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన ఒక వ్యక్తి. అతను జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రిజనర్ కూతురు అయిన విజ్జి (శ్రీ లీల) ని పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల విజ్జి బాధ్యతలు భగవంత్ కేసరి తీసుకోవాల్సి వస్తుంది. కాత్యాయని (కాజల్ అగర్వాల్) ఒక మానసిక వైద్యురాలు. మరొక పక్క ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు అయిన సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ఒక పెద్ద వ్యాపారవేత్త. ప్రపంచంలోనే తాను అందరికంటే గొప్ప వ్యక్తి అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు.
పెరిగి పెద్దది అయిన విజ్జిని ఆర్మీలోకి పంపించి ధైర్యవంతురాలుగా తయారు చేయాలి అని భగవంత్ కేసరి అనుకుంటూ ఉంటాడు. తనకి తెలియకుండానే సంఘ్వీకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి మధ్య అయిన ఒక సంఘటనలో విజ్జి ఇరుక్కుంటుంది. ఇందులో నుండి విజ్జి ఎలా బయటపడింది? భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరికి, సంఘ్వీకి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ తర్వాత విజ్జి, భగవంత్ కేసరి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సీనియర్ హీరో అయినా కూడా, ఇప్పటికీ ప్రతి సినిమాకి కష్టపడుతూ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అని తపిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. కానీ బాలకృష్ణ గత కొంత కాలం నుండి కేవలం కమర్షియల్ సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. అఖండ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి కూడా కలెక్షన్లు వచ్చినా కూడా సినిమా మీద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి.
రొటీన్ సినిమా అని, బాలకృష్ణ అలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో డ్యూయెట్ పాడడం, ఇంకా యంగ్ గా కనిపించాలి అని చూపించడంలాంటివి చేసినా కూడా ఆయన సీనియర్ హీరో అని తెలిసిపోతుంది అని అన్నారు. ఈ సినిమాతో ఒక కొత్త బాలకృష్ణ కనిపిస్తారు. తన వయసుకు తగ్గ పాత్ర ఇందులో బాలకృష్ణ చేశారు. సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమా కథ విషయానికి వస్తే అంత పెద్ద గొప్ప కథ ఏమీ కాదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఉండే కథ.
ఒక హీరో, ఒక అమ్మాయిని పెంచుకోవడం, ఆ అమ్మాయి ఒక సంఘటనలో ఇరుక్కోవడం, అక్కడ ఉన్న విలన్ కి, హీరో కి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉండడం, అప్పుడు హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇప్పుడు చాలా సాధారణంగా బతుకుతున్న వ్యక్తి, అప్పుడు ఎంత పవర్ ఫుల్ గా ఉండేవాడు అని చూపించడం, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో కూడా అదే చూస్తాం. కానీ ప్రజెంటేషన్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడిని మెచ్చుకోవాల్సిందే. బాలకృష్ణని కొత్తగా చూపించడంతో పాటు, తన ఫార్ములా అయిన కామెడీని కూడా కాస్త ట్రాక్ మార్చారు.
సెకండ్ హాఫ్ లో అయితే బాలకృష్ణతో ఒక మెసేజ్ చెప్పించడానికి ప్రయత్నం చేశారు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలో ఒక మెసేజ్ ఉంటే అది ప్రేక్షకులకు ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఈ సినిమాలో కూడా అలా సమాజంలో ఎదుర్కొనే ఒక సంఘటన గురించి చెప్పడానికి ప్రయత్నించారు. అది చాలా బాగుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇలా హీరోలు తమ వయసుకి తగ్గ పాత్రలు చేయడం ఇటీవల తమిళ్ ఇండస్ట్రీలో బాగా నడుస్తోంది. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి పాత్రలు చేస్తున్నారు. ఈ మార్పు ఇంకా వస్తే బాగుంటుంది.
మన సీనియర్ హీరోలని మరొక కోణంలో చూసే అవకాశం దొరుకుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణని చూపించిన విధానం, బాలకృష్ణ స్టైల్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సినిమాలో బాలకృష్ణ తర్వాత హైలైట్ అయిన మరొక పాత్ర శ్రీలీల పాత్ర. శ్రీలీల అంతకుముందు చేసిన సినిమాలు అన్నీ కూడా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు ఉన్న సినిమాలు ఏవి కాదు. ఈ సినిమాలో అలా కాకుండా నటించడానికి బాగా స్కోప్ దొరికింది. శ్రీలీల తన పాత్రలో చాలా బాగా నటించారు.
ముఖ్యంగా శ్రీలీలకి, బాలకృష్ణకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు. కాజల్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. అర్జున్ రాంపాల్ కూడా అంతే. అసలు కాజల్, బాలకృష్ణ ట్రాక్ లేకపోయినా సినిమా బాగానే ఉండేది. అర్జున్ రాంపాల్ పాత్ర కూడా ఒక కమర్షియల్ సినిమాల్లో చూసే విలన్ పాత్ర లాగానే ఉంది. అంత మంచి నటుడికి ఇంకా మంచి పాత్ర ఇచ్చి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొంత మంది యాక్టర్స్ పాత్రలు ఏదో ఆ సీన్ కోసం రాసుకున్నట్టు ఉంది. ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
తమన్ పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కానీ కొత్తగా అయితే లేదు. చాలా సినిమాలకి తమన్ ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని గొప్పగా ఎలివేట్ చేసేలా లేకపోయినా కూడా సినిమాకి సూట్ అయ్యేలాగా ఉన్నాయి. కానీ స్టోరీ లైన్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- బాలకృష్ణని చూపించిన విధానం
- సెకండ్ హాఫ్ లో ఇచ్చిన మెసేజ్
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- విమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- అనవసరమైన లవ్ ట్రాక్
- కొన్ని కామెడీ సీన్స్
- ఫస్ట్ హాఫ్ లో సాగదీసినట్టు ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో హీరోగా నటించిన బాలకృష్ణ, సినిమాకి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి, వాళ్ళ రెగ్యులర్ ఫార్ములాని కాస్త పక్కన పెట్టి కొత్తగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మరీ కొత్తగా లేకపోయినా కూడా ఈ కాంబినేషన్ వల్ల కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. కాబట్టి, కమర్షియల్ సినిమా అయినా కూడా, రొటీన్ స్టోరీ ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకుంటే, బాలకృష్ణ కోసం సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన ఒక డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటిగా భగవంత్ కేసరి సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : మరింత దీన స్థితిలో పావలా శ్యామల..! “చచ్చిపోవడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు..!” అంటూ..?
End of Article