ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన సభలో కలకలం రేగింది. ఓ యువతి అకస్మాత్తుగా మైక్ తీసుకుని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే మహిళ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’అని నినాదాలు చేయడం ప్రారంభించింది.

Video Advertisement

సభావేదికపై ఉన్న అసదుద్దీన్ ఒవైసీ పరుగున వచ్చి ఆ యువతి వద్ద నుంచి మైక్ గుంజుకునే యత్నం చేశారు. అయితే మైక్ ఇచ్చేందుకు నిరాకరించిన యువతి పాక్ అనుకూల నినాదాలు చేస్తూ పోయింది. చివరకు వేదికపై ఉన్న ఎంఐఎం కార్యకర్తలు ఆ యువతి వద్ద నుంచి మైక్ గుంజుకుని ఆమెను కిందకు దించేశారు.

ఈ ఘటనపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కార్యక్రమ నిర్వాహకులు సైతం ఆమెను ఆహ్వానించలేదని, భారత్‌ కోసమే ఉంటామని అన్నారు. పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మొత్తానికి వేదికపైకి దూసుకొచ్చిన ఆ యువతి కలకలం సృష్టించింది. సదరు యువతిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 కింద కేసు నమోదు చేశారు.