ఆ 14 రోజులు నా కూతురు నుండి దూరంగా పరిగెత్తాల్సి వచ్చింది…కానీ వాళ్ళ కుటుంబాలే ముఖ్యమనిపించింది.!

ఆ 14 రోజులు నా కూతురు నుండి దూరంగా పరిగెత్తాల్సి వచ్చింది…కానీ వాళ్ళ కుటుంబాలే ముఖ్యమనిపించింది.!

by Mohana Priya

Ads

లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ప్రయాణం చాలా కష్టమైపోయింది. బస్సులు తిరగలేదు. ట్రైన్లు కదలలేదు. విమానాలు ఎగరలేదు. ఇప్పుడంటే రూల్స్ కొంచం సడలించారు. కానీ లాక్ డౌన్ మొదలైన కొత్తలో ప్రజలు ఎక్కడికి కదలలేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం వేరే ప్రదేశాల్లో ఉండే వాళ్లకైతే అటు హాస్టల్లోను ఉండలేక ఇటు ఇంటికి రాలేక చాలా ఇబ్బందులు పడ్డారు.

Video Advertisement

twitter/HardeepSPuri

ఒకటే దేశంలో ఉన్న వాళ్లకి ఇలాంటి పరిస్థితి ఉంటే అదే వేరే దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఏ రకంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. వైద్య సేవలు అందించలేక ఇటలీ ప్రభుత్వం ఎవరి దేశాలకు వెళ్లి పోవాలి అంటూ నోటీసు జారీ చేసింది. ఇటలీలో ఉన్న 263 మంది భారతీయులకు తమ దేశానికి ఎలా రావాలో తెలియలేదు.

ఆ సమయంలో ఫ్లైట్లు కూడా లేకపోవడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఎయిర్ ఇండియా సంస్థ బోయింగ్777 అనే భారీ విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానానికి సారధ్యం వహించింది స్వాతి రావల్ అనే ఒక మహిళా పైలట్. రెస్క్యూ ఫ్లైట్ కు సారథ్యం వహించిన తొలి మహిళా పైలెట్ గా ఘనత సాధించారు స్వాతి.

స్వాతి మాట్లాడుతూ ” మా ఉన్నతాధికారి నుండి మార్చి 20వ తేదీ న నాకు కాల్ వచ్చింది. మరుసటి రోజు ఢిల్లీ నుండి రోమ్ కు విమానం బయలుదేరుతుందని దానికి నేనే సారథ్యం వహించాలి అని ఆ కాల్ యొక్క సారాంశం. నా 5 ఏళ్ల కుమారుడు 18 నెలల కూతురు ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాను. ఇంక ఆ సమయంలో నా కూతురు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. కాబట్టి వెళ్లాలా వద్దా అని సంకోచించాను.

కానీ నా దగ్గర ఆలోచించడానికి సమయం కేవలం ఐదు సెకన్లు మాత్రమే ఉంది. ఇటలీ లో చిక్కుకుపోయిన వాళ్ళందరికీ వాళ్ల కుటుంబాల దగ్గరికి వెళ్లడం ముఖ్యం అనిపించింది. ఇలాంటి కష్ట సమయాల్లో వారికి వారి కుటుంబాలు అవసరం. కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాను. మరుసటి రోజు నా పిల్లలిద్దరికీ జాగ్రత్తలు చెప్పి. నా బాధ్యత నిర్వర్తించడానికి బయలుదేరాను” అని చెప్పారు.

“నాకు ప్రయాణికులు ఎవరూ లేని విమానాన్ని నడపడం అదే మొదటిసారి. కాబట్టి మొదట్లో కొంచెం కొత్తగా అనిపించింది. ఇటలీ కి చేరుకున్న తర్వాత 263 ప్రయాణికులు ఎక్కడంతో మళ్లీ మామూలు ప్లేన్ ని నడుపుతున్నట్టు అనిపించింది. అసలు కరోనా ఉంది అన్న విషయం మర్చిపోయాను.

ఢిల్లీ లో విమానం ల్యాండ్ అయిన తర్వాత వారందరూ మొహాల్లో సంతోషం చూస్తే నాకు కూడా ఆనందంగా అనిపించింది. ఒకతను వచ్చి తను అసలు భారతదేశానికి తిరిగి వస్తాను అనుకోలేదు అని, ఇంత సురక్షితంగా ఏ ఇబ్బంది రాకుండా భారతదేశానికి తనని చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు” అని అన్నారు స్వాతి.

తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. స్వాతి ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ “ఇంటికి వచ్చిన 14 రోజులు క్వారంటైన్ పీరియడ్ లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నా పిల్లలు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారు. మా పాప అయితే నా రూమ్ లోకి వచ్చేసేది. నేను తన నుండి దూరంగా పరుగెత్తాల్సి వచ్చేది. తనకి ఇదంతా ఒక గేమ్ లాగా అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ 14 రోజులు చాలా కష్టంగా అనిపించింది.

తరువాత డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది అని చెప్పారు. అప్పుడు వెళ్ళి నా పిల్లలిద్దర్నీ గట్టిగా హత్తుకున్నా. ఒక్కసారిగా నాకు ఫ్లైట్లో ప్రయాణికులందరూ గుర్తొచ్చారు. బహుశా ఇప్పుడు వాళ్లు కూడా వాళ్ళ కుటుంబాలతో ప్రశాంతం గా సమయం గడుపుతూ ఉంటారు అనుకున్నా. అందుకే ఏ సమస్య వచ్చినా నా వంతు సహాయంగా ప్రజలను రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే” అని చెప్పారు.


End of Article

You may also like