Ads
బాహుబలి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ లేదు. అయినా కానీ ప్రభాస్ సినిమాలకి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇవాళ ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కేజీఎఫ్ లాంటి హిట్ సినిమాని అందించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : సలార్ – పార్ట్ -1 : సీజ్ ఫైర్
- నటీనటులు : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్.
- నిర్మాత : విజయ్ కిరగందూర్
- దర్శకత్వం : ప్రశాంత్ నీల్
- సంగీతం : రవి బస్రూర్
- విడుదల తేదీ : డిసెంబర్ 22, 2023
స్టోరీ :
2017 లో ఆద్య (శృతి హాసన్) తన తండ్రి కృష్ణకాంత్ కి తెలియకుండా ఇండియాకి వస్తుంది. అయితే ఆద్యకి ఖాన్సార్ నుండి ముప్పు ఉంటుంది. అక్కడే ఉండే రాధా రామ (శ్రియ రెడ్డి) ఆద్యని కిడ్నాప్ చేయాలి అనుకుంటారు. అయితే ఆద్యకి ముప్పు ఉండడంతో, ఆద్యని రక్షించడం కోసం బిలాల్ (మైమ్ గోపి) కి కృష్ణకాంత్ ఫోన్ చేస్తాడు. ఆద్య అస్సాంకి చేరుకుంటుంది. అక్కడ దేవవ్రత అలియాస్ దేవా (ప్రభాస్) ఆద్యకి రక్షణగా ఉంటాడు. దేవా బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటాడు. దేవా తల్లి అక్కడే ఉన్న స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉంటుంది.
మరొక పక్క రాధా రామ తండ్రి రాజమన్నార్ (జగపతి బాబు) ఖాన్సార్ పట్టణానికి రాజు. రాధా సోదరుడు, రాజమన్నార్ రెండవ భార్య కొడుకు, వరద రాజమన్నార్ అలియాస్ వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) దేవాకి చిన్నప్పటి నుండి మంచి స్నేహితుడు. కానీ కొన్ని కారణాల వల్ల దేవా, అతని తల్లి ఆ ఊరిని వదిలేసి పాతికేళ్లుగా అస్సాంలోని టిన్సుకియాలోనే ఉంటూ పని చేసుకుంటూ ఉంటారు. అసలు దేవా ఎవరు? దేవా తల్లికి గొడవలు అంటే ఎందుకు భయం? ఏడేళ్ల క్రితం ఏం జరిగింది? దేవా మళ్లీ ఖాన్సార్ కి ఎందుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడుకునే సినిమా రాలేదు అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చేశారు. అది బాగానే ఉన్నా కూడా తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్రయోగాత్మక సినిమాలు అవ్వడంతో, అందులోనూ ప్రభాస్ కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో, ప్రేక్షకులకు అవి ప్రభాస్ రేంజ్ సినిమాల లాగా అనిపించలేదు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ లోని యాక్షన్ యాంగిల్ ని వాడుకోవడంలో సఫలం అయ్యారు. సినిమా మొత్తం యాక్షన్ మీదే నడుస్తుంది. సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి అని దర్శకుడు చెప్పారు. కానీ చాలా వరకు ఆ ఎమోషన్స్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వవు. ప్రభాస్ ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా నయం. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకుడికి సంతృప్తికరంగానే అనిపిస్తుంది.
కానీ ప్రభాస్ ముందు సినిమాలతో పోల్చకుండా చూస్తే మాత్రం ఈ సినిమాలో కథ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ అంత గొప్పగా చెప్పుకునే లాగా ఏమీ లేదు. టేకింగ్ బాగుంది. సినిమా మొత్తం ఒక 5 యాక్షన్ సీన్స్ ఉంటాయి.. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తుంది.
ఒక రకంగా చెప్పాలి అంటే యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంది. కానీ యాక్షన్ డిజైన్ చేసిన అన్బరివు మాస్టర్స్ ని మెచ్చుకోకుండా ఉండలేము. వారి పని వారు 100% చేశారు. సినిమాటోగ్రఫీ అందించిన భువన్ గౌడ పనితనం కూడా బాగుంది. రవి బస్రూర్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బానే ఉంది. కానీ గొప్పగా అయితే లేదు. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం మాత్రం బాగా కనిపిస్తోంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వారందరికీ ఎక్కువ స్క్రీన్ టైం అయితే లేదు. ఎవరికి ఉన్న టైంలో వాళ్లు బానే చేశారు. సినిమా మొత్తాన్ని ప్రభాస్ తన భుజాలపై మోసారు. డైలాగ్ డెలివరీ గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా మెరుగుపడింది. అలాగే ప్రభాస్ చూడడానికి కూడా బాగున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కూడా హీరో పాత్రకి సమానంగానే ఉంటుంది. నటన పరంగా కూడా ప్రభాస్ తో పోలిస్తే పృథ్వీరాజ్ కి ఎక్కువ స్కోప్ ఉంది. ప్రభాస్ పాత్ర యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటే, పృథ్వీరాజ్ పాత్ర ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న పాత్రగా ఉంది. అందుకే పృథ్వీరాజ్ ఎమోషన్స్ చాలా బాగా పలికించారు. సినిమా మొత్తం ఎలివేషన్స్… ఎలివేషన్స్… ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫేమస్ అయింది కూడా దానికే. కాబట్టి ఈ సినిమాలో అవి కాస్త ఎక్కువగానే ఉంటాయి.
సినిమా ఆల్రెడీ ఉగ్రం సినిమా ఆధారంగా తీశారు అని చెప్పారు. కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం కొంచెం మార్చారు. సినిమా నెక్స్ట్ పార్ట్ శౌర్యాంగ పర్వం అని ప్రకటించారు. సినిమాలో మహాభారత ఆధారంగా తీసిన కొంత కథ కూడా ఉంది. అంతా బాగానే అనిపిస్తుంది కానీ, సినిమా అయిపోయిన తర్వాత యాక్షన్ సీన్స్ తప్ప పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ కనిపించదు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. కానీ సినిమా కథపరంగా, లేకపోతే ఎమోషన్స్ పరంగా ఏమీ అనిపించదు.
ఎమోషన్స్ గురించి ఇంతగా మాట్లాడటానికి కారణం, సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో, “ఈ సినిమా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమా. యాక్షన్ సినిమా కాదు” అని దర్శకుడు చెప్పారు. కానీ సినిమా చూస్తే అసలు అందుకు రివర్స్ అనిపిస్తుంది. ఎమోషన్స్ కంటే యాక్షన్స్ ఎక్కువగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో ఖాన్సార్ ఎపిసోడ్స్ కూడా సాగదీసినట్టుగా ఉన్నాయి. ఎక్కువగా కనెక్ట్ కూడా అవ్వవు. అంతే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండడం అనేది అందరికీ నచ్చే అంశం కూడా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త నిరాశ పడే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్ :
- ప్రభాస్
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
- ఫైట్స్ డిజైన్ చేసిన విధానం
మైనస్ పాయింట్స్:
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
- తెలిసిన కథ
- మోతాదుకి మించిన యాక్షన్
- సాగదీసినట్టుగా ఉన్న సెకండ్ హాఫ్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్. కన్నడ ఉగ్రం సినిమాని కేజిఎఫ్ స్టైల్ లో తీసినట్టు అనిపిస్తుంది. కథపరంగా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఎమోషన్స్ పరంగా కూడా కనెక్ట్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఎలివేషన్స్ ఇష్టపడే వారికి, ప్రభాస్ అభిమానులకి ఈ సినిమా నచ్చి తీరుతుంది. కొన్ని మంచి యాక్షన్ సీన్స్, గొప్ప నిర్మాణ విలువలతో సలార్ – పార్ట్ 1:సీజ్ ఫైర్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా అంటే ఇదే ఏమో..? ఈ సినిమా చూశారా..?
End of Article