నవమాసాలు మోసి ఇక తెల్లారితే ఒక బిడ్డకు జన్మనివ్వాల్సిన గర్భిణీ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కడుపులో ఉన్న బిడ్డ తో సహా ఆమె ఊపిరి వదిలేసింది. ఇంతకీ ఆమె అర్థంతరంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమిటంటే..? మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది ఏమో అన్న భయం. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ సంఘటన మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్ లో చోటు చేసుకుంది.

Video Advertisement

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్ కి చెందిన పోలిశెట్టి గంగన్న, శ్యామల రెండవ కుమార్తె రమ్యని 2017 లో ఆనంద్ కి ఇచ్చి వివాహం చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం వాళ్ళకి ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమె 9 నెలల గర్భిణీ. అయితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది ఏమో అన్న భయంతో ఆమె ఇంత ఘోరానికి పాల్పడింది.

మళ్లీ ఆడపిల్ల పుడితే ఎలా అంటూ పదేపదే అత్తవారు ప్రశ్నించేవారు. ఇక డెలివరీ కి ఒక్క రోజు ముందు ఆమె ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బంది తప్పదని ఆమె బుధవారం రాత్రి ఎవరూ లేని సమయం చూసుకుని ఉరేసుకుని చనిపోయింది. దీనంతటికీ కారణం అత్తింటి తరపు ఒక బంధువు. అతను వైద్యుడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారం వల్లనే ఇలా జరిగింది.

అతను ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అత్తింటివారి వేధింపులు రమ్యకి మొదలయ్యాయి. కొద్ది గంటల్లో బిడ్డకు జన్మనిచ్చి హాయిగా ఉండాల్సిన తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం బాధాకరం. ఎంత పని చేసావు అంటూ బంధువులు, గ్రామస్తులు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆమె ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతి చెందిన తర్వాత శిశువుని వైద్యులు వెతికి తీశారు. తీరా చూస్తే అది మగశిశువు. గర్భంలో మగ బిడ్డ ఉంది కానీ ఆమె ఆడబిడ్డ పుడుతుందని ఏమో అనుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.