ANIMAL REVIEW : “రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

ANIMAL REVIEW : “రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రణబీర్ కపూర్. మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా యానిమల్. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : యానిమల్
  • నటీనటులు : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్.
  • నిర్మాత : భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురద్ ఖేతాని, కృష్ణ కుమార్
  • దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
  • సంగీతం : జామ్8, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయస్ పురాణిక్, జానీ, ఆషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిందర్ సీగల్
  • విడుదల తేదీ : డిసెంబర్ 1, 2023

స్టోరీ :

రణవిజయ్ సింగ్ (రణబీర్ కపూర్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒక పెద్ద వ్యాపారవేత్త. తనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా రణవిజయ్ కి తండ్రి ప్రేమ ఎప్పుడూ దక్కలేదు. తన తండ్రి తన గురించి గొప్పగా మాట్లాడాలి అనే ఆత్రుతతో, ఆయన నుండి కాస్త ప్రేమ అయినా దొరుకుతుంది అనే ఆశతో ఆయనకి నచ్చిన పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. రణవిజయ్ తన ఫ్రెండ్ కార్తీక్ స్నేహితురాలు అయిన గీతాంజలి (రష్మిక మందన్న) ని ఇష్టపడతాడు.

కానీ గీతాంజలికి కూడా రణవిజయ్ కి తన తండ్రి మీద ఉన్న ప్రేమతో రణవిజయ్ చేసే పనుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న కొన్ని సంవత్సరాల తర్వాత బల్బీర్ సింగ్ ఒక దాడికి గురి అవుతాడు. అసలు బల్బీర్ సింగ్ మీద దాడి చేసింది ఎవరు? అప్పుడు రణవిజయ్ ఏం చేశాడు? వారి మీద పగ ఎలా తీర్చుకున్నాడు? రణవిజయ్ తండ్రికి అర్జున్ ప్రేమ అర్థం అయ్యిందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా కథ ట్రైలర్ లోనే చాలా వరకు అర్థం అయిపోతుంది. కానీ దాన్ని తెర మీదకి ఎలా తీసుకెళ్లారు అనేది ముఖ్యం. చాలా సినిమాలు రొటీన్ స్టోరీ తోనే వస్తాయి. కానీ టేకింగ్ బాగుంటే ఆ సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అర్జున్ రెడ్డి సినిమా కథ మామూలుగానే ఉంటుంది. కానీ బాగా కోపం ఉన్న ఒక అబ్బాయి ఎదుర్కొనే సమస్యలు, ప్రేమలో ఉండే కష్టాలు ఇవన్నీ కూడా రియలిస్టిక్ గా చూపించారు.

animal

అప్పటి వరకు చాలా డ్రామాటిక్ గా చూపించిన ఈ విషయాలని ఇలా చూపించినందుకు సందీప్ రెడ్డికి చాలా మంచి మార్కులు పడ్డాయి. అందులోనూ హీరో మంచివాడు కాదు అని, అతను కూడా తప్పులు చేస్తాడు అని ఆ సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి దూరం అయితే వాళ్లు ఎలా అవుతారు అనే అంశాన్ని చూపించారు. కానీ దానికి యాక్షన్ కూడా యాడ్ చేశారు. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ ని డీల్ చేయడం అనేది చిన్న విషయం కాదు.

issue shown in animal trailer

ఇందులో చాలా వరకు సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ ఒక చోట అర్జున్ రెడ్డి గుర్తుకు వస్తాడు. కానీ ఈ సినిమాలో హీరోకి అగ్రేషన్ కంటే ఎక్కువ బాధలు ఉంటాయి. తన తండ్రి మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకి ఇబ్బంది కలిగించిన వారి మీద పగ తీర్చుకోవడానికి హీరో అలా మారతాడు తప్ప అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ఇందులో హీరోకి యాంగర్ ఇష్యూస్ ఏమీ ఉండవు.

issue shown in animal trailer

సాధారణంగా చాలా ఇళ్లల్లో, అది కూడా ముఖ్యంగా మన దేశంలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ దక్కదు. తల్లిదండ్రులకి వారి ఇబ్బందుల వల్ల పిల్లలతో సరిగ్గా సమయం గడపలేక పోతారు. ఒకవేళ పిల్లలు దగ్గరికి వెళితే, ఆ సమయంలో తల్లిదండ్రులు చిరాకులో ఉంటే ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తారు. పిల్లలకి అవసరమైనవి మాత్రమే ఇవ్వడం కాదు ప్రేమ అంటే. వారితో కొంత సమయం మంచిగా మాట్లాడితే ఆ పిల్లలు చాలా ఆనందపడతారు. కానీ ఇలా చాలా చోట్ల జరగదు.

తమ తల్లిదండ్రులు ఏం చేసినా కరెక్ట్, ఎందుకంటే తమకంటే తమని పెంచిన వారికే లోకం బాగా తెలుసు అని అనుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని చాలా మంది పిల్లలు తప్పుగా చూడరు. తమ తల్లిదండ్రులే వాళ్లకి హీరోలు. వాళ్లు ఎన్ని తప్పులు చేసినా కూడా. ఇవన్నీ చిన్నప్పుడు ఎదుర్కొన్న పిల్లలు పెద్దయ్యాక తమ పిల్లలతో కూడా ఇలాగే ప్రవర్తించడం, లేకపోతే ఇంకొకరకంగా వీరి మీద ఇది ప్రభావం పడుతుంది. ఇలా అనుకునే ఒక అబ్బాయి జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు.

issue shown in animal trailer

మనకి టీజర్ లోనే హీరోయిన్ తన తండ్రి గురించి మాట్లాడితే హీరో ఎలా సమర్థిస్తాడు అనేది చూసాం. సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి. చిన్నప్పటి నుండి హీరోని పట్టించుకోని, హీరో చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దగా చూసి. అతనిని బాధపెట్టిన తండ్రి. పెద్దయ్యాక తన పెంపకంలో లోపాలు ఉన్నాయి అని ఒప్పుకుంటాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారిపోయి హీరో మారిపోతాడు. ఇంత సెన్సిటివ్ విషయాన్ని తెర మీద చూపించడం అనేది చాలా అభినందించాల్సిన దగ్గర విషయం.

Animal movie review

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. హీరో రణబీర్ కపూర్ లో అయితే మరొక కొత్త కోణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు రణబీర్ కపూర్ సినిమాలు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వివిధ పాత్రలు ఉన్న సినిమాలు అయినా కూడా ఇలాంటి పాత్ర ఉన్న సినిమా అయితే రణబీర్ ఇప్పటి వరకు చేయలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే రణబీర్ కపూర్ ని చూస్తే సినిమా చూస్తున్న ప్రేక్షకులకి బాధగా అనిపిస్తుంది.

Animal movie review

గీతాంజలి పాత్రలో రష్మిక తన పాత్రకి తగ్గట్టుగా చేశారు. వ్యాపారాలను చూసుకుంటూ, తనని అంతగా ప్రేమించే కొడుకుని పట్టించుకోని తండ్రిగా అనిల్ కపూర్ కూడా బాగా నటించారు. సినిమాకి మరొక ముఖ్య హైలైట్ అయిన పాత్ర బాబీ డియోల్ పాత్ర. దాదాపు హీరోకి సమానంగా ఈ పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్స్ లాగా కాకుండా, హీరోకి కూడా అంత మందిని కొట్టినప్పుడు దెబ్బలు తగులుతాయి అని చూపించారు.

Animal movie review

పాటలు కూడా బాగున్నాయి. సినిమా డబ్బింగ్ వర్షన్ చూస్తున్నట్టు అయితే, సినిమా డబ్బింగ్ సినిమాలాగా అనిపించకుండా చాలా మంచిగా జాగ్రత్తలు తీసుకున్నారు. డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ అయితే సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకు వెళ్ళింది. కానీ సినిమాకి ఒకే ఒక మైనస్ పాయింట్. నిడివి. సినిమా చాలా పెద్దగా ఉంది. ఇది ముందు తెలిసిన విషయమే. కానీ కొన్ని సీన్స్ మాత్రం ఎడిట్ చేసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • రణబీర్ కపూర్
  • డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సినిమా నిడివి
  • సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, సినిమా నిడివి ఎంత ఉన్నా కూడా సమస్య లేదు అని అనుకుంటే ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనని తాను నిరూపించుకున్న సందీప్ రెడ్డి, ఈ సినిమాతో మరొక మెట్టు ఎక్కారు. రణబీర్ కపూర్ లోని ఒక కొత్త కోణాన్ని చూద్దాం అనుకునే వారికి, అసలు సందీప్ రెడ్డి ఇలాంటి సమస్యని ఎలా హ్యాండిల్ చేశారు అని తెలుసుకుందాం అనుకునే వారికి యానిమల్ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

watch trailer :

ALSO READ : యానిమల్ ట్రైలర్‌లో చూపించిన ఈ విషయం నిజమే కదా..? దీన్ని ఎందుకు పట్టించుకోలేదు..?


End of Article

You may also like