Ads
లాక్ డౌన్ లో కూడా సోషల్ మీడియా ద్వారా మనల్ని అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా తన ఎలా ఉంటారో, లాక్ డౌన్ సమయం ఎలా గడుపుతున్నారో అనే విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ ల రూపంలో మనందరికీ చెప్తూ ఉంటారు. గత నెల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఆచార్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Video Advertisement
ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ అయితే, ఇంకొకటి అజిత్ హీరోగా నటించిన వేదాళం రీమేక్. లూసిఫర్ రీమేక్ ని తెలుగులో ముందు సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు అని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి సుజిత్ తప్పుకున్నారు అని, మరొక డైరెక్టర్ లూసిఫర్ రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని ఇలా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంక వేదాళం రీమేక్ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాని తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ట్విట్టర్ ద్వారా మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే, దానికి పవన్ కళ్యాణ్ థ్యాంక్యూ చెప్పి, ” చిరంజీవి గారితో చేయబోయే సినిమాకి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
దాంతో మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అనే వార్త రూమర్ కాదని దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ ఆ సినిమా వేదాళం రీమేకా? లేదా ఇంకేదైనా సినిమానా? అనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎప్పుడు కొత్త లుక్ తో ఎక్స్పరిమెంట్ చేసే చిరు నిన్న సోషల్ మీడియాలో గుండు తో ఉన్న తన న్యూ లుక్ ని పోస్ట్ చేశారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
అయితే, అసలు ఈ కొత్త గెటప్ ఏదైనా సినిమా కోసమా? ఒకవేళ సినిమా కోసం అయితే ఏ సినిమా కోసం? అనే డౌట్ అందరిలో మొదలైంది. వేదాళం సినిమాలో హీరో అజిత్ బాగా ట్రిమ్ చేసిన హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. కాబట్టి మెగాస్టార్ కూడా ఇప్పుడు వేదాళం రీమేక్ లుక్ టెస్ట్ కోసం ఈ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా డిసెంబర్ వరకు సినిమాల షూటింగ్ పూర్తిగా మొదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు.
కాబట్టి ఈ సమయంలో తన రాబోయే సినిమా కోసం మెగాస్టార్ ఈ లుక్ ట్రై చేస్తున్నారేమో అని అంటున్నారు నెటిజన్లు. కొంతమంది ఇది ఒరిజినల్ లుక్ అని అంటుంటే, ఇంకొంతమంది ఆ లుక్ బహుశా ప్రోస్థెటిక్ మేకప్ సహాయంతో చేశారేమో అని అంటున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో మెగా స్టార్ కొత్త లుక్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అభిమానులతో పాటు, సెలబ్రిటీలు కూడా మెగా స్టార్ కొత్త లుక్ బాగుందంటూ కామెంట్స్ ద్వారా చెప్తున్నారు.
End of Article