చదువులో టాపర్…నటన కోసం చదువు మానేసి…చివరికి ఇలా ? సుశాంత్ లైఫ్ స్పెషల్ స్టోరీ

చదువులో టాపర్…నటన కోసం చదువు మానేసి…చివరికి ఇలా ? సుశాంత్ లైఫ్ స్పెషల్ స్టోరీ

by Mohana Priya

Ads

2020 సినీ ప్రపంచానికి ఎందరో కళాకారులని దూరం చేస్తోంది. ముందు ఇర్ఫాన్ ఖాన్, తన మరణం నుండి తేరుకోక ముందే రిషి కపూర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్. పోయిన ఆదివారం చిరంజీవి సర్జా. ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ముందు ఉన్న వాళ్లందరిది సహజ మరణాలు. సుశాంత్ ది బలవన్మరణం. ఇవాళ పొద్దున్న తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.

Video Advertisement

బాలీవుడ్లోని టాప్ 7 యంగ్ స్టార్స్ లో ఒకళ్ళు సుశాంత్. తను చేసిన ప్రతి సినిమా దేనికదే భిన్నంగా ఉంటుంది. అన్ని సినిమాలు ప్రజాదరణ పొందాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ హిట్ అవ్వకపోయినా ప్రేక్షకులు మాత్రం సుశాంత్ నటనకు ఏ వంక పెట్టలేదు. పెట్టలేరు కూడా. అంత గొప్ప నటుడు.అలాంటిది తన వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల డిప్రెషన్ కు గురయ్యాడు. ఆరు నెలల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇవాళ హఠాత్తుగా తన జీవితాన్ని ముగించాడు. నటుడిగానే కాదు చిన్నప్పటినుంచి ఎప్పుడు సుశాంత్ అన్ని విషయాల్లో బెస్ట్ గానే ఉండేవాడు.

సుశాంత్ కి డిసిఈ ఎంట్రన్స్ పరీక్షలో ఏడవ ర్యాంకు వచ్చింది. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. 2002 సంవత్సరంలో సుశాంత్ తల్లి మరణించారు. తన తల్లి మరణం సుశాంత్ ని  ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధ నుండి బయటికి రాలేక పోయాడు. బహుశా మొదటి సారి సుశాంత్ డిప్రెషన్ కి గురి అయింది అప్పుడే కావచ్చు.సుశాంత్ ని గమనించిన అతని సోదరి ఇంకా తండ్రి వాళ్ల సొంత ఊరైన పాట్నాలో ఉండటం మంచిది కాదేమో అని భావించి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఉండగా సుశాంత్ చదువు ఆపేసాడు. సుశాంత్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు షైమక్ ధావర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. అక్కడే సుశాంత్ కి నటన వైపు దృష్టి మళ్ళింది. అందుకే చదువు మధ్యలో ఆపేసి నటుడు అవుదామని నిర్ణయించుకున్నాడు.

ముందు థియేటర్ ఆర్టిస్ట్ అయిన సుశాంత్ తర్వాత ఏక్తాకపూర్ నిర్మించిన పవిత్ర రిష్తా సీరియల్ తో లీడ్ క్యారెక్టర్ గా తన నటన ప్రయాణం మొదలుపెట్టాడు. అందులోని మానవ్ పాత్ర అప్పుడు ఒక సెన్సేషన్ సృష్టించింది. ముందునుండి తను బాగా నటించడం వల్ల జనాలకి తొందరగానే చేరువయ్యాడు. పవిత్ర రిష్తా తనలోని నటుడిని బయటికి తీస్తే, ఝలక్  దిఖ్లాజా రియాలిటీ షో తనలోని డాన్సర్ ని ప్రజలకు పరిచయం చేసింది.

చేతన్ భగత్ రాసిన త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ నవల ఆధారంగా రూపొందించిన సినిమా కై పో ఛే సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒక హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటికీ సుశాంత్ ప్రజలకు కొత్తేమీ కాకపోవడంతో మొదటి సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది. మొదటి నుండి ప్రజలు సుశాంత్ ప్రతిభను చూశారు కాబట్టి కచ్చితంగా అతను పెద్ద స్టార్ అవుతాడని నమ్మారు. అందరూ అనుకున్నట్టే ప్రతి సినిమాతో సుశాంత్ ఒక మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు.

తర్వాత శుద్ద్ దేశి రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి సినిమాల్లో నటించాడు. మొదటి రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి అనుకున్నంతగా ఆడకపోయినా సినీ విమర్శకులు సుశాంత్ నటన ను ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత వచ్చింది ఎం ఎస్ ధోని ది అంటోల్డ్ స్టోరీ. ఒక రకంగా చెప్పాలంటే బయోపిక్ ల ట్రెండ్ మళ్లీ మొదలైందే ఈ సినిమా తోటి. హెయిర్ స్టైల్ నుండి, చేయి తిప్పడం, ఎక్స్ప్రెషన్స్, నడక ఒక్కటి కాదు అన్ని ధోని లాగే అచ్చుగుద్దినట్టు దింపేసాడు.

ధోని కి ఒక కవల ఉంటే ఇలానే ఉండేవాడేమో అనిపించేంత మారిపోయాడు సుశాంత్. నెపోటిజం అనే పరంపర నడుస్తున్న బాలీవుడ్లో ఈ సినిమాతో తనదైన ముద్ర వేసుకున్నాడు. అప్పటివరకు మంచి నటుడు అన్న పేరు ఉన్న సుశాంత్ కి ఈ సినిమా తర్వాత స్టార్ జాబితాలో చోటు దక్కింది. ఎంఎస్ ధోని సినిమా తర్వాత ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ జరిగింది. ఆ సంవత్సరం జరిగిన అన్ని అవార్డ్ ఫంక్షన్ లలో సుశాంత్ అద్భుతమైన నటన గురించి ఒక్కసారైనా ప్రస్తావించారు.

తర్వాత వచ్చిన రాబ్తా, కేదార్నాథ్, చిచోరే, డ్రైవ్ సినిమాల్లో రాబ్తా, డ్రైవ్ ఫ్లాప్ అయినా, కేదార్నాథ్, చిచోరే సినిమాలు హిట్ అయ్యాయి. ఇందులో చిచోరే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో ఆత్మహత్య అనేది తప్పు అని మెసేజ్ ఇచ్చారు. స్వయంగా సుశాంత్ పాత్ర తన కొడుకు పాత్ర చేసిన అతను ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అది తప్పు అని ఓడిపోయినా పర్లేదు మళ్ళీ ప్రయత్నించాలి అని చెప్తాడు.

సొంచీరియా అనే సినిమా ఒక రౌడీ పాత్రని పోషించాడు సుశాంత్. 1975 ప్రాంతంలో చంబల్ లోయల నేపథ్యంలో జరిగే ఈ సినిమా నటుడిగా సుశాంత్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.అతని తదుపరి చిత్రం దిల్ బేచారా మేలో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు హాట్ స్టార్ లో విడుదల అవుతుంది.

సుశాంత్ కి చంద్రుడి మీద కొంత స్థలం తన పేరు మీద ఉంది. వందమంది ఆస్ట్రోనాట్ లను స్పేస్ కి పంపడానికి సహాయం చేశాడు. ఇరవై ఐదు లక్షల విలువచేసే BMW K1300R బైక్ ఉంది. కోటికి పైగా విలువ చేసే క్వాట్రోపోర్టో కారు కూడా ఉంది. 250 రూపాయల జీతంతో తన కెరీర్ ప్రారంభించిన సుశాంత్ తర్వాత ప్రతి సినిమా కి 5 నుండి 7 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు.

ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా చేసిన సుశాంత్ నటుడు అయిన తర్వాత అదే ఫంక్షన్ లో సెలబ్రిటీ హోదా లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. మాధురి దీక్షిత్ ని చూస్తూ పెరిగిన సుశాంత్, స్వయంగా మాధురి దీక్షిత్ ఏ అతని డాన్స్ కి ఫిదా అయ్యేంతలా పేరు తెచ్చుకున్నాడు. ఝలక్ దిఖ్లాజా చూసిన ప్రతి ఒక్కరు అందులో సుశాంత్  ఓ రే పియా పాటకి చేసిన డాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

విచిత్రమేంటంటే పవిత్ర రిష్తా సీరియల్ లో సుశాంత్ నటించిన మానవ్ పాత్ర చనిపోతాడు. సుశాంత్ నటించిన మొదటి చిత్రంలో అతని పాత్ర చనిపోతుంది. తన ఆఖరి చిత్రం దిల్ బేచారా ఇంగ్లీష్ నవల, ఇంకా సినిమా ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఆధారంగా రూపొందింది. అందులో హీరో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. డిప్రెషన్ సెంటర్ లో హీరోయిన్ ని కలుస్తాడు. ఆఖరికి హీరో చనిపోతాడు. ఈ సినిమా రీమేక్ కావడంతో హిందీలోనూ అదే కథ ఉండొచ్చు.దీన్నిబట్టి తన ఆఖరి సినిమాలో కూడా సుశాంత్ పాత్ర చనిపోతుంది.

ఏదేమైనా పాత్ర ఏదైనా సుశాంత్ మాత్రం ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. జీవితం అంటే డబ్బు హోదా ఒకటే కాదు సంతోషం, మానసిక శాంతి కూడా ముఖ్యం. మనం ఎంత సంపాదించినా ఎంత పేరు తెచ్చుకున్న కూడా చివరికి మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మనం ఆనందంగా ఉన్నామా? లేదా? ఒకవేళ దీనికి సమాధానం లేదు అంటే పైన చెప్పిన డబ్బు హోదా అనేది ఎందుకు పనికిరావు. సుశాంత్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.


End of Article

You may also like