కరోనా వైరస్ నివారణకు తాము తయారు చేసిన స్వీట్ పని చేస్తుంది అని ఇటీవల కోయంబత్తూర్ లోని ఒక స్వీట్ షాప్ ప్రచారం చేసింది. ఆ స్వీట్ పేరు ఫోటాన్ స్పీడ్ కరోనా క్యూర్ మైసూర్పా. 45 ఏళ్ల శ్రీరామ్ కు కోయంబత్తూర్ ప్రాంతం లో నెల్లై లాలా స్వీట్స్ 8 స్వీట్ షాపులు ఉన్నాయి.

Video Advertisement

ఇప్పుడు తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో తాను తయారు చేసిన ఈ ఆయుర్వేద స్వీట్ కరోనా నయం చేయడానికి పనిచేస్తుంది అని చెప్పారు. దీంతో ఈ విషయం అంతా సోషల్ మీడియాలో పాకి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆ స్వీట్ షాప్ పేరును తెలిసేలా చేసింది.

శ్రీరామ్ ఇంకా అతని స్నేహితులు కలిసి ఈ విషయాన్ని పాంప్లెట్ల రూపంలో ప్రచారం చేశారు. ఆయుర్వేద మూలికల తో తయారుచేసిన ఈ స్వీట్ తయారు చేసే విధానం సిద్ధ నిపుణులైన శ్రీరామ్ పూర్వీకుల నుండి వచ్చిందట. ఆ పాంప్లెట్ లో     “కోవిడ్ 19 ఒక్క రోజులో నయమవుతుంది. ఇది ఒక అద్భుతం. చిన్నియంపాలయం మరియు వెల్లలూర్‌లో ఈ మైసూర్ పాక్ తిన్న వాళ్ళకి ఆ అద్భుతం జరిగింది” అని రాశారు.

అలాగే హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ మోదీ అడిగితే ఈ స్వీట్ ఎలా తయారు చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారట. దీనిపై శ్రీరామ్ మాట్లాడుతూ ” మా తాత సిద్ధ నిపుణులు. ఆయన ఒకరి నుండి ఒకరికి సోకె జ్వరాల కోసం లేహ్యం తయారు చేసేవారు. అది చాలా ఘాటుగా ఉండటంతో శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వాళ్ళు బాధ పడేవారు.

అందుకే ఘాటు తగ్గించడానికి మేము స్వీట్ రూపంలో ఆ ఔషధాన్ని జనాల్లోకి అందుబాటులోకి తేవాలని అనుకున్నాం. దీని వల్ల డయాబెటిక్ రోగులకు కూడా ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. నేను నా బృందం కలిసి గత మూడు నెలలుగా కరోనా లక్షణాలు కనిపించిన వాళ్ళకి ఈ స్వీట్ ఇస్తున్నాం. వాళ్లకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అవ్వలేదు.

మేము దీన్ని మోదీ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా విన్నపం ఏంటి అంటే ఈ స్వీట్ ని ఇతర దేశాల్లో కూడా అమ్మాలి. అప్పుడు ఫారిన్ వాళ్లు కూడా మన దేశ వస్తువులని కొనుక్కుంటారు. అప్పుడు మన దేశం అబ్దుల్ కలాం గారు కలగన్నట్టు మిగిలిన దేశాలకు ధీటుగా ఉంటుంది.

ఒకవేళ ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు అన్ని వెహికల్స్ ఆగినా కూడా అంబులెన్స్ కు మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అంత ముఖ్యం. కాబట్టి నేను కూడా నా ప్రచారం లీగలా ఇల్లీగలా అని ఆలోచించలేదు. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నేను కూడా నా మెడిసిన్ కి అంతే ప్రాముఖ్యత ఇచ్చాను” అని చెప్పారు.

ఈ ప్రచారం అంతా చూసిన కోయంబత్తూర్ ప్రభుత్వం ఆ స్వీట్ షాప్ ని సీజ్ చేసింది. దీనిపై జిల్లా సిద్ధ మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ ” మేము స్వాధీనం చేసుకున్న నమూనాలను చెన్నై లోని ప్రభుత్వ టెస్టింగ్ కేంద్రాలకు పంపుతాం. ఈ విషయం గురించి మా జిల్లా కలెక్టర్ కి రిపోర్ట్ ఇచ్చాం. శ్రీరామ్ మీద ఎటువంటి చర్య తీసుకోవాలి అనేది ఆయనే నిర్ణయిస్తారు” అని చెప్పారు.