హిందువుల పండుగకు ఉండే ప్రాముఖ్యత వేరు. ప్రతి మాసానికి ఓ పండుగ ఆ పండక్కి ఒక విశేషం ఉంటుంది. ప్రతి పండగ వెనకాల కొన్ని ఆచారాలు పద్ధతులు నిగూఢంగా ఉంటాయి.
ముఖ్యంగా హిందూ స్త్రీలు జరుపుకునే పండుగ అట్లతద్ది. తదియనే తద్దే అని అంటారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది అనేవి అలా వచ్చినవే. అశ్వయుజ బహుళ తదియనాడు దీన్ని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండగ అని అంటారు. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటార? దీని వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటి? పూర్తి వివరాలు మీకోసం…
అట్లతద్ది ఆంధ్ర ఆడపడుచులకు చాలా ముఖ్యమైనది. అట్లతద్ది ముందు రోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుజామున లేచి ఉట్టి కింద కూర్చుని చద్ది అన్నం తింటారు. ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాల ఊగుతారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకుని అట్లు దానమిచ్చి ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకు పెట్టుకోవడం చాలా కీలకం.
గోరింటా అంటే గోరు+అంటూ . సంస్కృతంలో దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని సరసాలు ఆడుతారు. మూడు సందర్భాల్లో గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీష్మ ఋతువులో ఆషాడ మాసంలోను, వర్ష ఋతువులో భాద్రపద మాసంలోనూ, శరద్ ఋతువు లో అశ్వయుజ మాసంలోనూ గోరింట పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ధి. తెల్లవారుజాము నుంచి ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు పొందుపరిచారు. ఇళ్లల్లో నీళ్ల తావుల్లో తిరిగే ఆడవాళ్లకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట కూడా ఉంది.
త్రిలోకసంచారి అయిన నారదముని ప్రతిఫలంతో గౌరీదేవి శివున్ని ప్రతిగా పొందగోరి మొదటిసారి చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీల సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది. చంద్రధారణ వల్ల చంద్రకళలో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుందని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో అంతరార్థం దాగి ఉంది.నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజ దోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్ముతారు. రుతు చక్రం సరిగ్గా ఉండేలా కాపాడుతాడు.
అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగి పోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి. అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడం వల్ల ఆరోగ్యాన్ని శక్తుని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లి అయిన వారు చేస్తే మంచి సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
Also Read:భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. అవేంటంటే..?