ఒక చిన్న అగ్గిపుల్ల ఒక పెద్ద అడివిని దగ్దం చేయగలదు అదే విధంగా మనం చిన్న పిల్లల మనసుల్లో నాటే కొన్ని ఆలోచనలు వాళ్ల జీవితాలనే చిన్నాభిన్నం చేసే ప్రమాదాలున్నాయి అనడానికి ఈ కథే ఉదాహరణ . ఇది కథకాదు నిజంగా జరిగినది.ఈ సమస్య తీవ్రత తెలియాలంటే ఈ కథ చదివితీరాల్సిందే.
ఇది కథ కాదు…నాలుగేళ్ళ కింద మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను, అటు నుండి ఏడుపు..ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను.
బిడ్డకు జ్వరం వచ్చింది ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది
వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళింట్లోనే ఉంటూ పొలం పనులకు వెళ్లి బిడ్డను చదివించుకునేది..
పాప 5th క్లాస్ అయ్యాక 6th క్లాస్ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది..
ఫోన్ లో ఆమె మాటలు విన్నాక వెంటనే కరీంనగర్ హాస్పిటల్ తీసుకు రమ్మన్నాను.. రెండు గంటల్లో వాళ్ళు కరీంనగర్ వచ్చి కాల్ చేశారు. అప్పటికే నేను హాస్పిటల్లో మాట్లాడి పెట్టాను.. పాప చాలా నీరసంగా విపరీతమైన జ్వరం తో బాధ పడుతుంది హాస్పిటల్ వచ్చాక రెండు సార్లు ఫీట్స్ వచ్చాయి .డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు MRI తో సహా అన్ని రిపోర్టులు నార్మల్..పాపను ICU లో లో అడ్మిట్ చేసి observation పెట్టారు. మూడు రోజుల్లో గంటకి ఒకసారి ఫిట్స్ వచ్చాయి. మూడు రోజుల తరువాత పాప కళ్ళు ఆల్మోస్ట్ కోమ లోకి వెళ్ళింది..
డాక్టర్ పిలిచి పాప ను హైదరాబాద్ తీసుకెళ్లడం బెటర్ అన్నారు.. కానీ ఎలా వాళ్ళ దగ్గర ఆ మూడు రోజుల బిల్లు కట్టడానికే డబ్బులు లేవు ఆలస్యం చేస్తే పాప బతకడం కష్టం అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా నిర్ణయం మీద డిపెండ్ అయి ఉన్నారు.ఏదైతే అధైయింది పాప ను ఎలా అయినా బతికించాలి అని వెంటనే మా సునీతక్క వాళ్ళ అన్నదమ్ముళ్లతో మాట్లాడాను. మీరు ఏం చేస్తారో ఎవరి కాళ్ళు పట్టుకుంటారో తెలీదు. మీకు ఉన్నది ఒక్క కోడలు బతికించడం మీ చేతుల్లోనే ఉంది ఎలా అయినా డబ్బులు అరెంజ్ చేయమని చెప్పాను..
మా సొంత బావ కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పిన ఆయన వెంటనే 60 వేల వరకు సర్దాడు. మా సునితక్క వాళ్ళ తమ్ముళ్లు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు . వాళ్లు ఎవరికి ఫోన్ చేసిన రూపాయి దొరకలేదు .
ఇక వాళ్ళ భార్యలు ముందుకు వచ్చి మెడలో ఉన్న పుస్తెలు కొదవ బెట్టి ఇస్తాం. పాప ను హాస్పిటల్ తీసుకుని వేళ్ళు అన్న అన్నారు.. చాలా బాదేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ లో అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకు వెళ్ళాను .
నాతో పాప అమ్మ ,వాళ్ళ చిన్న మేనత్త కొడుకు వచ్చారు. అంకుర హాస్పిటల్ లో 12 రోజులు ఉన్నాం. ఎన్ని టెస్టులు చేసిన అసలు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక డాక్టర్లు తల పట్టుకున్నారు.
అంకుర హాస్పిటల్ వెళ్ళాక నాలుగవ రోజు పాప కి స్పృహ వచ్చింది. కానీ ఫీట్స్ మాత్రం ఆగలేదు. ఎం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ కి ఒక డాక్టర్ వచ్చి బంజారా హిల్స్ లో ఉన్న సిటీ న్యూరో సెంటర్ కి సెకండ్ ఒపీనియన్ కోసం రిఫర్ చేశారు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసాడు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఆయన పాప తో మాట్లాడాలి, మీ అందరు బయటే ఉండమని, పాపను ఆయన క్యాబిన్ లోకి తీసుకు వెళ్లి అరగంట తరువాత నన్ను లోపలికి రమ్మన్నాడు .
నేను వెళ్లి సార్ పాప కి ఏమైంది అన్నాను. ఆయన ఏమి మాట్లాడకుండా పాప నానమ్మ ఎవరు ఇక్కడికి వచ్చిందా? అని అడిగాడు .లేదు సార్ అన్నాను .మంచిది వస్తే మాత్రం నా చేతుల్లో సచ్చేది అన్నాడు .ఎందుకు సార్ ఏమైంది? అని అడిగితే అప్పుడు చెప్పాడు పాపకి ఏం జరిగింది అని..జరిగిన విషయం ఏంటంటే పాప ఆడుకోవడానికి రోజు బయటకు వెళ్తే వాళ్ళ నానమ్మ పాప ను దగ్గర తీసుకుని నువ్ ఆడుకోవడానికి బయటకు వెళ్తే నిను కామన భూతం ఎత్తుక పోతాది. బయట భూతాలు ఉన్నయ్ అని రోజు దెయ్యం కథలు చెప్పెదట .
దానికి తోడు పాప హాస్టల్ లో ఉన్న స్నేహితురాలు రోజు దెయ్యాల గురించి మాట్లాడుతుంటే, పాప నిజంగానే దెయ్యాలు ఉన్నట్టు భ్రమలోకి వెళ్ళిపోయింది. పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ముసలామెకు మంత్రాలు వస్తాయి అని పాప ముందే అందరూ మాట్లాడుకోవడం విని ఆ ముసలామేనే దెయ్యం లా ఉహించుకుం.ది ఆ ముసలామేనే రోజు ఆమె మీదకు వచ్చినట్టు ఉహించుకునేది..అలా ఉహించుకున్న ప్రతి సారి ఫీట్స్ లాగ వచ్చి స్పృహ కోల్పోయేది.. ఆమెకు ఒంట్లో ఏ సమస్య లేదు ఉన్న సమస్య అల్లా ఆమె మనసులో పాతుకు పోయిన భయం. ఆ భయమే ఆమె ప్రాణం మీదకు తెచ్చింది అని డాక్టర్ పాప కు జరిగింది మొత్తం వివరించాడు..
మరి సొల్యూషన్ ఏంటి సార్ అన్నాను. సొల్యూషన్ ఏమి లేదు పాప ను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి పాప లోని భయాన్ని తీసేస్తే చాలన్నాడు. నేను సరే అని పాప ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకు వచ్చి, తిరిగి పాప ను ఒక హోటల్ కి తీసుకెళ్లాను. అక్కడ పాప, నేను ఇద్దరమే ఉన్నాం. పాప సైలెంట్ గా కిందకు చూస్తూ కూర్చుంది. నేను మెల్లగా పాపతో మాట కలిపి ఏమైంది మమ్మి డల్ గా ఉన్నావ్ అని అడిగా పాప నుండి సమాదానం లేదు.
మళ్ళీ అడిగా నో రెస్పాన్స్. భుజం మీద చేయి వేసి ఏమైంది రా ఆకలిగా ఉందా ఏమైనా తింటావా అని అడిగా లేదు అన్నట్టు తల ఊపింది పోనీ ఏమైనా తాగుతావా అని అడిగా పాప సైలెంట్ మళ్ళీ అడిగా నువ్వేం కావలి అన్నా తెస్తా ఏం తాగుతావ్ మమ్మి అని అడిగా పాప సైలెంట్.
నాకు అనుమానం వచ్చి నవ్వుతూ కామెడీగా గా పోనీ రక్తం తాగుతావా అన్నాను. పాప చూపు మారింది. నా అనుమానం బలపడింది నేను మళ్ళీ నవ్వుతూ ఏ రక్తం కావాలిరా కోడి రక్తమా? మేక రక్తమా? అని అడిగా. పాప ఉహు అని తల ఊపింది మరేం కావాలి రా అని అడిగితే పాప మెల్లగా సిగ్గు పడుతూ విచిత్రమైన చూపులు చూస్తూ బాబాయి బాబాయి మరి మల్ల అమ్మకు చెప్పకు నాకు నాకు మనిషి రక్తం తాగాలని ఉంది అని గొణుగుతూ చెప్పింది .అది విని నా రోమాలు నిక్క బొడిచినయ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే నాకు కింద తడిసిపోయింది..నేను అయినా కూడా భయం చూపించకుండా సరే మమ్మి ఇంటికి పోయాక తెచ్చి ఇస్తా ముందు టిఫిన్ తిను అని చెప్పి పాప తో ఇక మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టాను. పాపకు ఏం జరిగిందో పాప కె మొత్తం వివరించి చెప్పిన నీ సిచ్యువేషన్ ఇది ఇందువల్ల నువ్ ఇలా అయ్యావ్ అని చెప్పిన పాప అమాయకంగా మరి బాబాయి నాకేమైన ఆయితదా అని అడిగింది
నేను ఏమి అవదురా, అమ్మ నీ కోసమే బతుకుతుంది. నువ్ బాగుంటే అమ్మ బాగుంటుంది. దెయ్యాలు భూతాలు ఏమి లేవు అని కొన్ని ఉదాహరణలు చెప్పి పాప లోని భయాన్ని తీసేయడానికి ట్రై చేసాను..
నేను తిరుపతి లో కొన్న దండ నా మెడలో నుండి తీసి పాప మెడలో వేసి ఇది ఉంటే ని దగ్గరకు ఏ దయ్యం రాదు ఒకవేళ వచ్చినట్టు నీకు అనిపిస్తే మనసు లోనే ఒక మాట అనుకో ఓ దెయ్యం నువ్ నా దగ్గరకు రాకు చల్ దొబ్బేయ్ అని మనసులోనే తరిమేయ్ అని పాప ను మెల్లగా ట్యూన్ చేసానుపాప నేను చెప్పింది చెప్పినట్టు చేస్తా తల ఊపింది ఆ క్షణం నుండి ఇప్పటి వరకు పాపకు మళ్ళీ ఫీట్స్ రాలేదు ఎప్పటి లాగే నార్మల్ అయింది..కానీ ఆ 12 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖతం..దెయ్యాలు భూతాలు మంత్రాలు అని పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతదో ఆ రోజు అర్థం అయింది. చివరికి పాప సేఫ్.
ఇది శ్రీనివాస్ సర్ల అనే వ్యక్తి తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ లో శేర్ చేసుకున్నారు . ఇప్పుడు అర్దమైంది కదా మనం ఆషామాషిగా చేసే చిన్న చిన్నపొరపాట్లు జీవితకాలం పాటు సరిదిద్దుకోలేని నష్టాన్ని మిగులుస్తాయి . పిల్లల మెదడులో తెలివిని , ధైర్యాన్ని నింపే కథలు చెప్పాలి కాని భయపెట్టేవి కావు. మారుతున్న సమాజంతో పాటు సమాజానికి అనుగుణంగా పిల్లల్ని మానసికంగా , శారీరకంగా సిద్దం చేయాలి తప్ప మొక్కను చెట్టుగ మలచడానికి చూడాలి కాని మోడు వారేలా చేయకూడదు.