మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి తాజాగా జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై సంచలన కామెంట్లు చేశారు.
జనసేన పార్టీని టార్గెట్ చేసే విధంగా ఈ కామెంట్లు ఉన్నాయి.చంద్రయాన్-1 సమయంలో జనసేన పార్టీని తీసుకువచ్చారని, ఇప్పుడు చంద్రయాన్-3 తో మనం చంద్రుడి మీదికి చేరిన కూడా జనసేన పార్టీలో మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉందని ఎద్దేవా చేశారు.
జనసేన ఎదగలేక పోవడానికి గల కారణం నాదెండ్ల మనోహర్ అని అన్నారు. నాదెండ్ల వల్లే జనసేన పార్టీ భవిష్యత్తును నాశనం అవుతుందని, ఇప్పుడు ఆయనకి టిడిపి వారు తోడవడంతో జనసేన పార్టీని పాతాళంలోకి నెట్టేస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ ని కలవకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుపడతారని.. అధినేతతో మాట్లాడకుండా తనపై పవన్ కళ్యాణ్ కి లేనిపోని మాటలు చెప్పి దూరం పెట్టారని అన్నారు. జనసేనలో ఉంటే తన ఆత్మాభిమానం చంపుకుని బతకాల్సి వస్తుందని అందుకనే వైసీపీలో చేరినట్లుగా ప్రకటించారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీలో చేరిన తాను చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ అక్రమాలపై తాను తీవ్రంగా పోరాడానని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ పొత్తులో భాగంగా నారాయణ కోసం పనిచేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారని అన్నారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యే అవ్వాలని పనిచేయలేదని కేవలం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని పనిచేశానని చెప్పుకొచ్చారు.
2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా నిరాశ చెందకుండా పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని పవన్ అన్న ప్రజా బాట పేరుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా తిరిగి జనసేనని బలపరిచేందుకు కృషి చేశానని అన్నారు. తన కష్టాన్ని ఎవరు గుర్తించలేదని తెలిపారు.అప్పట్లో పవన్ కళ్యాణ్ టిడిపిని తిట్టి ఇప్పుడు మళ్లీ వారితోనే జట్టు కట్టడం తాను జీర్ణించుకోలేక, జనసేనలో అవమానాలు భరించలేక బయటకు వచ్చాను అని అన్నారు. తాను వైసీపీలో చేరాక ఎందరో జనసేన నాయకులు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు తెలియజేసారు.