కన్నడ అగ్ర హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ పాత్రల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈగ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత బహుబలి ది బిగినింగ్ సినిమాలో కూడా మెరిసారు.
అయితే.. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ‘విక్రాంత్ రోణ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కన్నడలో చిత్రీకరణ జరుపుకుంటున్నా తెలుగులో సైతం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. కన్నడ, తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోనూ ఈ సినిమాను జులై 28వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
”అది ఒక మర్మమైన ఊరు .. ఆ ఊరు ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరుగానీ .. భయాన్ని దాచలేరు” అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ నడిచింది. ఆ ఊరిలోని రహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ కనిపిస్తున్నాడు. అయితే ఈ ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.