ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వెంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే ఈ ఆలయానికి పూర్వం పల్లవులు, చోళులు, కాడవరాయలు, తెలుగు చోళులు,తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
అంతేకాకుండా ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్లదొరలు, నవాబులు, అధికారులు తిరుమలేశున్ని సేవించి తరిస్తూ ఆ కాలంలో ఆలయ పరిపాలన లో తమ వంతు సేవలను, సౌకర్యాలను కల్పించారు. మరి బ్రిటిషు వారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల ఎలా ఉండేది? వారు చేసిన సేవలు ఏంటనేది?ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్న పురాతన రికార్డుల ఆధారంగా బ్రిటిష్ వారు తిరుపతి కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలుస్తోంది. బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో 1801నుండి 1843 వరకు దాదాపు 43 ఏళ్లు పాటు తిరుమల ఆలయ పాలన కొనసాగింది. ఆ సమయంలో ఆలయం లో అంతర్గత కలహాలు ఉండగా బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు ఏర్పాటు చేశారు.
అయితే 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాస్ ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఆ తర్వాత ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా బ్రుస్ నియమితులయ్యారు. అప్పుడు టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు రూపొందించారు.
ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రిటిష్ వారు అమలుచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. 1933లో టిటిడి ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. అయితే మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్దార్ హుక్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్ రోడ్డుకు రూపకల్పన చేశారు.
1944 ఏప్రిల్ 10న మొదటగా ఈ ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు తర్వాత చిన్న బస్సులు ఈ మొదటి ఘాట్ రోడ్ లోనే తిరుమల తిరుపతికి రాకపోకలు జరిగాయి. దీంతో భక్తుల సంఖ్య రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇలా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారిలో కొందరు అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని సేవలను చేశారని పురాతన రికార్డుల ఆధారంగా తెలియజేస్తున్నారు.