గుమ్మడి కాయను భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కాయగా భావిస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బూడిద గుమ్మడికాయ, రెండోది గుమ్మడికాయ. గుమ్మడికాయకు పూర్వ కాలం నుంచే ఎంతో ఆదరణ ఉంది. గుమ్మడి కాయను కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడమే కాకుండా అనేక శుభ కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.. ముఖ్యంగా ఇంటి గుమ్మాల ముందు బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతారు.. కారణం ఏమిటి.. ఓ సారి చూద్దాం..?
ముఖ్యంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టేది నరదృష్టి, నరఘోష మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడతారు. ఇందులో ముఖ్యంగా బూడిదగుమ్మడి కాయలు మాత్రమే గుమ్మానికి కట్టాలి. మరోరకం గుమ్మడికాయను మాత్రం శుభ కార్యక్రమాల్లో పగలకొడతారు. అలాగే దాన్ని సాంబార్ లో కూడా ఉపయోగిస్తారు.
ఈ గుమ్మడి కాయలను మంగళవారం లేదా శనివారం రోజున సాయంత్రం సమయంలో లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి, బొట్లు పెట్టి, హారతి ఇచ్చి అప్పుడు దాన్ని కడితే చాలా మంచిది. అది కూడా ఇంటి ముందు ప్రత్యేకమైన స్థలంలో మాత్రమే కట్టాలి. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి గుమ్మడికాయ కనబడాలి.
ఆ విధంగా మెయిన్ గుమ్మాలకు కట్టాలి. ఇలా ముందు కట్టడంవల్ల మన ఇంట్లోకి వచ్చే వారి చూపు ముందు గుమ్మడికాయ మీద పడుతుంది. దీనివల్ల వారి చెడు దృష్టి అనేది ఆ కాయ లాక్కుంటుంది. ఇందులో కొంత మంది కట్టిన వారం, పది రోజులకే గుమ్మడికాయ పాడవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువగా ఉంటే మాత్రమే గుమ్మడికాయ త్వరగా పాడవుతుంది. అలా గుమ్మడికాయ పాడైన వెంటనే దాన్ని తీసివేసి కొత్తది కట్టేయాలి.