ఆమె పేరు ఆడపిల్లలకు పెట్టాలంటేనే తల్లిదండ్రులు భయపడి పోయే వారు. కోడళ్ళు ఆమె పేరు వింటేనే హడలెత్తి పోయేవారు. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆమె ఎవరో.
సినిమాల్లో గయ్యాళి అత్తగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన నటి సూర్యకాంతం. అక్టోబర్ 28,1924 లో సూర్యకాంతం గారు జన్మించారు.
ఆరేళ్ల వయసులోనే పాడటం, నాట్యం చేయటం నేర్చుకుంది. సినిమాల్లో నటించాలనే కోరిక తో చెన్నై చేరుకుంది. మొదట డాన్సర్ గా నటించిన సూర్యకాంతం అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరచి 75 రూ. అడిగిమరీ తీసుకుంది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది.
తర్వాత సౌదామిని చిత్రంలో హీరోయిన్ పాత్ర వచ్చింది కానీ, కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. సంసారం సినిమా లో మొట్టమొదటి సారిగా గయ్యాలి అత్త పాత్ర వేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. బి.నాగిరెడ్డి,చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసే వారు కాదు.
ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి- సూర్యకాంతం, రమణారెడ్డి- సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు- సూర్యకాంతం జంటలను వాళ్ళు నటించిన సినిమాలను గుర్తుకు తెచ్చుకొని ఇప్పటికి కూడా హాయిగా నవ్వుకుంటారు. ప్రేక్షకులు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమా వస్తే అందులో సూర్యకాంతం వుందా అని ఎదురు చూసేవారు. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.