“టిక్ టాక్” ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా యాప్ ఎదుర్కొన్నన్ని విమర్శలు మరే యాప్ ఎదుర్కొని ఉండదు . టిక్ టాక్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఈ మధ్య కలవరపరిచాయి . చిన్నా పెద్దా తేడా లేకుండా టిక్ టాక్ ని ఎడా పెడా వాడేస్తున్నారు.  టిక్ టాక్ ని బ్యాన్ చేయాలనేంతగా విమర్శించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోండి. ఆల్రెడీ గతంలో ఒకసారి టిక్ టాక్ ని ఆపేసారనుకుంటా , మళ్లీ కోర్టు ఉత్తర్వులతో అందుబాటులోకి వచ్చినట్టుంది . అయితే మొట్టమొదటి సారి  టిక్ టాక్ వలన తండ్రి కొడుకులు కలుసుకున్న సంఘటన అందరిని సంతోష పెడుతుంది . అసలింతకి ఆ తండ్రీకొడుకులు ఎలా విడిపోయారు ? వారిని కలపడంలో టిక్ టాక్ ఎలా సాయపడింది చదవండి.

Video Advertisement

కర్నూలు జిల్లా నంద్యాలలోని హరిజనపేటకు చెందిన నరసింహులు క కూడా అందరిలానే టిక్ టాక్లు చేసేవాడు .  సంతోషం వచ్చినా, బాధకలిగిన టిక్‌టాక్‌ చేసి  ఆ వీడియోని అప్లోడ్ చేసేవాడు. నరసింహులుకి పెళ్లైంది , పిల్లలు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నప్పటికి ఒక వెలితి ఉండేది . తన తండ్రి కనిపించకుండా పోయి ఆరేళ్లయింది. తండ్రి కోసం అంతా వెతికారు. ఎంత వెతికినా తండ్రి ఆచూకి దొరకకపోవడంతో చనిపోయాడని నిర్దారించుకుని , ప్రతిఏడాది చనిపోయిన వారికి చేసే కార్యక్రమాలన్ని తమ్ముడితో కలిసి చేస్తూ వచ్చాడు.

కానీ ఒకరోజు నరసింహులుకు ఒక ఆలోచన వచ్చింది .అదేంటంటే , కనిపించకుండా పోయిన తన తండ్రి గురించి వీడియో చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వీడియో చేసి అప్లోడ్ చేశాడు . సంపాదించలేని టైమ్‌లో తండ్రి దగ్గర ఉన్నాడని ఇప్పుడు సంపాదించే టైంలో తండ్రి దూరమవ్వడం బాధగా ఉందని తండ్రిని గుర్తు చేసుకుంటూ చేసిన ఆ వీడియో  సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇంకేం ఆ వీడియో చూసిన చాలామంది దాన్ని శేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి తండ్రి వరకు చేరింది. సరదాగా చేసిన వీడియో తన తండ్రిని కలుపుతుందని కలలో కూడా ఊహించి ఉండడు.

చనిపోయాడని భావించిన అనుపురి పుల్లయ్య గుజరాత్‌లోని గాంధీ ధామ్‌టౌన్‌లోని ఓ బట్టల షాపులు పనిచేస్తున్నాడని తెలిసింది. తండ్రిని కలవడానికి కొడుకులు గుజరాత్ వెళ్లారు.  తండ్రిని కలుసుకున్నారు. చనిపోయాడనుకున్న తండ్రి ఆచూకి దొరకడంతో పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు నరసింహులు. టిక్ టాక్ తండ్రికొడుకులను కలిపిందని అందరూ సంతోషిస్తున్నారు. పుల్లయ్య కోసం కుటుంబసభ్యులే కాదు , స్థానికులు కూడా ఎదురుచూస్తున్నారు.