ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అందరికి తెలిసిందే. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు మన ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేసారు. అయినప్పటికీ కొందరు బయటకి వస్తూనే ఉన్నారు. వారిని నియంత్రించడం కోసం పోలీసులు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో లంగర్ హౌస్ లో ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Video Advertisement

వివరాల లోకి వెళ్తే.. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ లేదు హెల్మెట్ లేదు అని అడిగినందుకు తాను ఓ పోలీస్ అధికారి కొడుకునంటూ పోలీసులపైనే తిరగబడ్డాడు. మీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అసభ్య పదజాలం ఉపయోగించాడు. సహనం నశించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో అతను ఎవరా అని ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి పేరు లోకేశ్.. కొద్దిరోజుల క్రితమే మద్యం దొరక్క ఎర్రగడ్డలోని డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయినట్లుగా తెలుస్తోంది.

సంవత్సరం క్రితం భార్య చనిపోవడంతో ఆయన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో అతనికి మతి స్థిమితం సరిగా లేదని తేలింది. అనంతరం పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి లోకేశ్‌ను అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇతను గత రెండు రోజులుగా చనిపోయిన తన భార్య గుర్తొచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.