Ads
మనదేశంలో గురువుని దేవుడి తో పోలుస్తారు. మనకి విద్య నేర్పించే వాళ్లకి ఎంతో గౌరవం ఇస్తారు. కానీ ఇలాంటి దేశంలోనే గురువుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడే మనుషులు కూడా ఉంటారు. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన ఈ సంఘటన.
Video Advertisement
లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థలు తెరవడం లేదు కాబట్టి ఆన్లైన్లో తరగతులు చెబుతున్నారు. పిల్లలకి పాఠాలు మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఎంతో మంది టీచర్లు తాము ఎప్పుడూ వాడని పద్ధతులను ఉపయోగించి ఆన్లైన్లో పాఠాలు చెప్పడం రాకపోయినా సరే నేర్చుకొని మరీ చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి కొత్త కొత్త పద్ధతుల తో పాఠాలు చెబుతున్నారు.
కొంతమందికి ఇంటర్నెట్, మంచి క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్ లాంటి సదుపాయాలు ఉండదు. అయినా సరే విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏదో ఒక రకంగా వాళ్ళ కష్టాలు వాళ్లు పడి చివరికి పాఠాలు అయితే స్కూల్లో చెప్పిన విధంగానే చెబుతున్నారు.
ఇదేవిధంగా ఒక 55 ఏళ్ల వయసున్న టీచర్ తమ ప్రిన్సిపాల్ చెప్పారు అని ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి సరే అన్నారు. ఆయన ఎప్పుడూ ఆన్లైన్లో క్లాసులు చెప్పలేదు. అసలు ఆండ్రాయిడ్ ఫోన్ లో వీడియో కాల్ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. తన కూతురు ని అడిగి జూమ్ లో పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు.
పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఖర్చు ఎక్కువైనా కూడా మార్కెట్ కి వెళ్లి వైట్ బోర్డ్ కొనుక్కొచ్చారు. అంత కష్టపడి ఆయన ఆన్లైన్లో క్లాసులు చెబుతున్నప్పుడు ఒక పేరు లేని జూమ్ ఎకౌంటు నుండి ఎవరో ఒక విద్యార్థి వాడకూడని తిట్లు మెసేజ్ లో పెట్టారు. దాంతో ఆ మెసేజ్ ని చూసిన టీచర్ కి కోపం వచ్చి విద్యార్థులపై అరిచారు.
అంత కష్టపడినందుకు గురువుని గౌరవించే పద్ధతి ఇదా అని ఆ టీచర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏడుస్తున్న తన తండ్రి గొంతు విని కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. అన్ని సంవత్సరాలలో తన తండ్రి ఇలా ఏడవడం ఇదే మొదటిసారి. దాంతో కూతురు కూడా కోపం వచ్చింది కానీ అలా మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరో తెలియక పోవడంతో ఏం చేయలేకపోయారు.
మనకి క్లాసులు బోర్ కొట్టడం మామూలే. దాదాపు చాలా మంది విద్యార్థులు తమ టీచర్ల ని సరదాగా ఆట పట్టించి ఉంటారు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆటపట్టించడం వేరు ఇలా బూతులు ఉపయోగించడం వేరు. మన సబ్జెక్ట్ లో ఉన్న ప్రతి పాఠం మన టీచర్ కి ముందే వచ్చి ఉండదు.
వాళ్లు కూడా మనకి పాఠం ఎటువంటి తప్పులు లేకుండా సరిగ్గా చెప్పాలి అని ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ మేనేజ్ చేసుకుంటూ మనకి పాఠం లోతుగా చెప్పడానికి వాళ్లు కూడా మనం చదివిన దాని కంటే ఎక్కువగానే చదువుతారు. వీలైతే వాళ్ళు చెప్పేది విందాం. లేదా సైలెంట్ గా మన పని మనం చూసుకుందాం. అంతేకానీ కానీ ఇలాంటి మాటలు వాడడం తప్పు. అసలు తప్పు అనేది చిన్న పదం. నేరం.
కష్టపడే ప్రతి వ్యక్తి కోరుకునేది గౌరవం. వీలుంటే గౌరవిద్దాం. ఒక్కసారి మీరే ఆలోచించండి? మీరే ఎంతో కష్టపడి ఒక పని చేశారు. మీకంటే వయసులోనూ అనుభవంలోనూ చాలా చిన్న అయిన ఒక వ్యక్తి ఆట పట్టించడం పేరుతో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కానీ వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఎలా అనిపిస్తుంది?
కాబట్టి ఇంకెప్పుడూ ఎవరిని ముఖ్యంగా మనకు విద్య నేర్పే వారిని ఏమైనా అనేముందు ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి.విద్య కే కాదు విద్య చెప్పే వాళ్ళకి కూడా విలువనివ్వాలి అన్న విషయం మర్చిపోకండి.
End of Article