బరువు అంటే మనకి భౌతికంగా కనిపించేది మాత్రమే కాదు. మన మానసికంగా కూడా మనకు తెలియకుండా ఎంతో బరువును మోస్తూ ఉంటాం. ఒకసారి ఈ కథ చదివితే అసలు విషయం ఏమిటో మీకే అర్థమవుతుంది.ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఎక్కడికో ప్రయాణిస్తున్నారు. దారి మధ్యలో వాళ్లు ఒక నదిని దాటాల్సి ఉంది. ఆ ఇద్దరు బౌద్ధ సన్యాసులు నదిని దాట బోతు ఉండగా వాళ్లకి ఒక పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే పిలిచింది ఒక యువతి.

వీళ్ళిద్దరూ ఆ యువతి వాళ్లని పిలవడానికి గల కారణం ఏంటి అని అడిగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ యువతి తనకి నది దాటాలి అంటే భయంగా ఉంది అని వాళ్ళని సహాయం చేయమని అడిగింది.ఇదంతా విన్న ఆ బౌద్ధ సన్యాసుల లో ఒక అతను ఆ యువతికి సహాయం చేయాలి అంటే సంకోచించాడు. కానీ ఇంకొక బౌద్ధ సన్యాసి మాత్రం ఆ యువతికి సహాయం చేస్తానని చెప్పాడు. ఆ యువతిని తన భుజాలమీద ఎక్కించుకొని నది దాటేందుకు సహాయం చేశాడు. దాంతో ఆ యువతి అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.

అప్పుడు పక్కనే ఉన్న మరొక బౌద్ధ సన్యాసి ఇతనిని తాము ఆడవాళ్ళని ముట్టుకోవడం అనేది తప్పు కదా? ఇప్పుడు ఇతను చేసిన పని ఆధ్యాత్మిక సూత్రాలకి వ్యతిరేకంగా ఉంది కదా? అని అడిగాడు.ఈ ప్రశ్న విని ఆ బౌద్ధ సన్యాసి ఈ విధంగా సమాధానం చెప్పాడు ” మిత్రమా! నేను తనని ఇందాకే మోసి సహాయం చేశాను. నువ్వు ఇప్పటికి కూడా తనని నీ ఆలోచనల రూపంలో ఇంకా మోస్తూనే ఉన్నావు” అని సమాధానం ఇచ్చాడు. ముందు చెప్పిన తెలియకుండానే బరువు మోయడం అంటే ఏంటి అనే విషయం ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది.