మన దగ్గర నేరం చేసిన వారికంటే బాధితులనే తప్పు అని అంటుంటారు కదా? గతంలో దిశా విషయంలో కూడా ప్రియాంక రెడ్డిని ఆ నీచులు మానవ మృగాళ్ల లాగా దాడి చేసి చివరికి చంపి కాల్చేశారు. ఆ సమయంలో కూడా కొంతమంది అజ్ఞ్యానులు అమ్మాయిదే తప్పు అని మాట్లాడారు. వాళ్ళు అలా చేసారు అంటే అమ్మాయి తప్పు కూడా ఉండే ఉంటుంది ఎంతో అసభ్యంగా మాట్లాడారు. ఇంకా కొందరు అయితే వాళ్ళని నమ్మడం అమ్మాయి తప్పు…అమ్మాయిలు ఆ టైం కి వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్ళకూడదు అని నీతులు చెప్పారు. విక్టిమ్ బ్లెమింగ్ అనేది అంత కామన్ అయిపొయింది కదా మన దగ్గర.
ఇప్పుడు మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అమృత ని కామెంట్ చేయడం స్టార్ట్ చేసారు కొంతమంది. రెండు చావులకి కారణం అమృత అట? ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన తప్పు అంట. ఇంట్లో ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకొని తన మానాన తను బతకడం అమృత చేసిన తప్పా? భర్త ని చంపు అని మారుతి రావు కి చెప్పిందా? ఆత్మహత్య చేసుకో అని తన తండ్రికి చెప్పిందా?
కూతురుని ప్రేమించడం తప్పు కాదు. కానీ కూతురు ప్రేమించిన వాడిని చంపేయడం తప్పు కదా? మరొక కుటుంబంలో శోకాన్ని మిగల్చడం తప్పు కాదా? ప్రణయ్ తల్లితండ్రులకు కొడుకు లేని లోటు తీర్చగలరా? అమృత కొడుకుకి తండ్రి లేని లోటు తీర్చగలరా? అమృతకు భర్త లేని లోటు తీర్చగలరా? పైగా అమృత ఒంటరి అవ్వడానికి కారణం కూడా అమృత అనే అంటారు. కొంచెమైనా మానవత్వం ఉందా మీకు?
మరికొందరు అయితే కుల ప్రేమ అలాగే ఉంటుంది. కులం కోసం పరువు పొతే ఆత్మహత్య చేసుకుంటారు అని మారుతీరావు ని సపోర్ట్ చేస్తున్నారు. కులం కోసం ఇంత చేసారు మారుతీ రావు. చివరికి ఏం సాధించారు?
ఒక్కటి గుర్తుఉంచుకోండి పిల్లలని కనడం మీ చేతిలో ఉంటుంది,వారి ఆలోచనలు మీ చేతిలో ఉండవు.కష్టం వచ్చినప్పుడు ప్రొటెక్షన్ మాత్రమే ఇవ్వగలరు,కానీ కష్టం రాకుండా ఎవరు చేయలేరు. ఒక వేళ అమృత ప్రేమ పెళ్లి నిర్ణయాలు తప్పో ఒప్పో నిర్ణయించడానికి మనం ఎవరం. రాజు పేద కావచ్చు పేద రాజు కావచ్చు. డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. కులం అంతకంటే కాదు.
సమాజం,పరువు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఉపయోగ పడవు, వాటి కోసమే బతుకుత అంటే ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య చేసుకుంటావు. సమాజం జోహార్ అని చెప్పి పెద్ద కర్మ రోజు బోజనాలు చేసి మర్చిపోతుంది. నిజంగా మారుతీ రావు రియల్ లైఫ్ చూసి అయినా కొంతమంది మారితే బాగుండు.