Ads
సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : సైంధవ్
- నటీనటులు : వెంకటేష్ దగ్గుబాటి, శ్రద్ధ శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య.
- నిర్మాత : వెంకట్ బోయినపల్లి
- దర్శకత్వం : శైలేష్ కొలను
- సంగీత దర్శకత్వం : సంతోష్ నారాయణన్
- విడుదల తేదీ : జవనరి 13, 2024
స్టోరీ :
సైంధవ్ కొలను (వెంకటేష్) తన కూతురితో కలిసి ఉంటాడు. సైంధవ్ కి గతం ఉంటుంది. దానికి దూరంగా ప్రస్తుతం అసలు దానికి సంబంధమే లేకుండా బతుకుతాడు. ఒక సమయంలో తన కూతురు గాయత్రి పాప (బేబీ సారా) కి ఆరోగ్యం పాడవుతుంది. ఆ అమ్మాయి కోసం 17 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు సైంధవ్ ఏం చేశాడు? అసలు సైంధవ్ గతం ఏంటి? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ఎక్స్పరిమెంటల్ సినిమాలని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న నటుల్లో వెంకటేష్ ఒకరు. కమర్షియల్ సినిమాల్లో అయినా కూడా తన వయసుకు తగ్గ పాత్రలే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా కోసం దర్శకుడు శైలేష్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆ ఇంజక్షన్ విలువ నిజంగానే 17 కోట్లు ఉంటుంది. దాన్ని తీసుకురావడానికి తన కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి పడే తపన ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు.
ఎప్పుడో ఘర్షణ సినిమాలో వెంకటేష్ ని ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసాం. ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సీరియస్ పాత్రలో చూస్తున్నాం. వెంకటేష్ ఈ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. డైలాగ్ డెలివరీ నుండి మేనరిజమ్స్ వరకు అన్ని బాగున్నాయి. స్టోరీ పాయింట్ ఎంత బాగున్నా కూడా టేకింగ్ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా వెళుతుంది. స్టోరీలోకి వెళ్లడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడ గ్రిప్పింగ్ గా అనిపించదు.
అసలు సైంధవ్ అనే వ్యక్తికి అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏముంది అని చూపించాలి అనుకున్నారు. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిజంగానే అతని గతం ఏంటి అని ప్రేక్షకులు కూడా ఊహించుకుంటారు. ఆ అంచనాలని అందుకోవడంలో అక్కడక్కడ విఫలం అయ్యారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ ఎంతో అనుభవం ఉన్న నటుడు. ఆయన పోషించని పాత్ర లేదు.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. పాత్రలో నటనకి పెద్దగా ఆస్కారం లేకపోయినా కూడా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం వెంకటేష్ నటన చూస్తుంటే ఆయనకు నిజంగా ఎంత అనుభవం ఉంది అనేది తెలిసిపోతుంది. ఎమోషన్స్ తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. మనోజ్ఞ పాత్రలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ తన పాత్ర పరిధి మేరకు బానే నటించారు. మరొక ముఖ్య పాత్రలో నటించిన రుహానీ శర్మ, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆండ్రియా కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.
గాయత్రి పాపగా నటించిన బేబీ సారా మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా ఇంత బాగా నటించడం అనేది అభినందించాల్సిన విషయం. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు తెలుగులో మొదటి సినిమా చేశారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నారు. నవజుద్దీన్ కూడా బాగా నటించారు. ఇంకొక పాత్రలో జయప్రకాష్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ముఖేష్ రిషి తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా పోషించే విలన్ పాత్రలోనే కనిపించారు. జిష్షు సేన్‌గుప్తా పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
తనకి ఉన్న లిమిటెడ్ టైంలో బానే నటించారు. మరొక ముఖ్య పాత్రలో హీరో ఆర్య నటించారు. పాత్ర కనిపించేది కొంచెం సేపు అయినా కూడా ఆయన నటన కూడా బాగానే ఉంది. నటులు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కాబట్టి బాగా నటించలేదు అన్నమాట రాదు. కాకపోతే వారి పాత్రలు మాత్రం కొందరికి ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే, కొంత మంది మాత్రం కొంచెం సేపు కనిపిస్తారు అంతే. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. చాలా స్టైలిష్ గా అనిపించింది.
సంతోష్ నారాయణన్ అందించడం పాటలు అంత గొప్పగా ఏమీ అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్నిచోట్ల బాగుంది. ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రం ఇంకా కాస్త క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఆ కాన్సెప్ట్ ని తెరపై చూపించడంలో మాత్రం చాలా కష్టపడాలి. ఇక్కడ సినిమా బృందం కష్టం అంతా తెలుస్తోంది. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
- వెంకటేష్
- సినిమాటోగ్రఫీ
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- కొన్ని పాత్రలని రాసుకున్న విధానం
- కొన్ని చోట్ల డల్ అయిన సీన్స్
- పెద్దగా సూట్ అవ్వని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్:
3/5
ట్యాగ్ లైన్:
స్టోరీ పాయింట్ బాగున్నా కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కేవలం వెంకటేష్ కోసం మాత్రమే సినిమా చూద్దాం అని అనుకునే వారికి సైంధవ్ సినిమా ఒక్కసారి చూడగలిగే కమర్షియల్ యాక్షన్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article