Ads
తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో, హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. వీళ్ళిద్దరూ కలిసి అంతకుముందు మాస్టర్ సినిమా చేశారు. ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : లియో
- నటీనటులు : విజయ్, అర్జున్ సార్జా, త్రిష కృష్ణన్.
- నిర్మాత : లలిత్ కుమార్
- దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
స్టోరీ :
పార్తిబన్ (విజయ్), తన భార్య సత్య (త్రిష) కొడుకు, కూతురితో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటాడు. అక్కడే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ నడుపుతూ ఉంటాడు. అలా ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా ఒక సంఘటన ఎదురవుతుంది. దాని కారణంగా పార్తిబన్ చిక్కుల్లో పడతాడు. వాళ్లకి ఏం జరిగింది? వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్) పార్తిబన్ కి ఏమవుతారు? అసలు లియో ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కొన్ని సినిమాలు ప్రకటించినప్పటి నుండే ఒక ఆసక్తి క్రియేట్ చేస్తాయి. సినిమా ఎలా ఉండబోతోంది అని రిలీజ్ అయ్యేంతవరకు ఎదురు చూస్తూనే ఉంటారు. అంతేకా కుండా సినిమాకి సంబంధించి వచ్చే పాటలు, పోస్టర్స్ కూడా ఈ ఆసక్తిని పెంచేలాగానే ఉంటాయి. దాంతో ఎన్నో అంచనాల మధ్య సినిమా రిలీజ్ అవుతుంది. అలాంటి ఒక సినిమా లియో. కొద్ది నెలల క్రితం సినిమా ప్రకటించారు. అప్పటి నుండి కూడా సినిమా మీద ఏవేవో కథలు వస్తూనే ఉన్నాయి.
లోకివెర్స్ కి ఈ సినిమాకి సంబంధం ఉంది అని అన్నారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ సినిమా ఒక స్టాండ్ అలోన్ సినిమా అని, లోకేష్ ముందు సినిమాలకి ఈ సినిమాకి ఏం సంబంధం లేదు అని అన్నారు. కానీ తీరా చూస్తే ఇది కూడా లోకివెర్స్ సినిమాల్లో ఒక భాగమే అని ముందే తెలిసిపోయింది. సినిమా కథ బాగా తెలిసిన కథ. అసలు సినిమా గురించి తెలుసుకొని వెళ్లినా, తెలుసుకోకుండా వెళ్లినా కూడా సినిమా కాస్త ముందుకు వెళ్లాక ఒక ప్రేక్షకుడికి సినిమా ఏ రూట్ లో వెళ్తోంది అనేది అర్థం అయిపోతుంది.
సినిమా అంతా కూడా ఒకటే స్టోరీ లైన్ మీద నడుస్తుంది. సినిమా ఫస్ట్ పది నిమిషాలు అస్సలు మిస్ అవ్వద్దు అని లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూస్ లో చెప్తూనే ఉన్నారు. సినిమా మొదటి నుండి చివరి వరకు చాలా గ్రిప్పింగ్ గా నడుస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందో తెలిసినా కూడా ఒక ప్రేక్షకుడిని సీట్ నుండి కదలకుండా సినిమా చివరి వరకు కూర్చోపెట్టే అంత ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఉంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు.
వారి పాత్ర నిడివి ఎంత సేపు ఉన్నా కూడా, ప్రతి పాత్ర ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో వారిని ఈ సినిమాలోకి తీసుకున్నట్టు తెలిసిపోతుంది. ఉన్నవాళ్లు అందరూ కూడా వారు తెరపై కనిపించిన సమయంతో సంబంధం లేకుండా గుర్తుంటారు. సినిమాకి మెయిన్ పిల్లర్ హీరో విజయ్ విషయానికి వస్తే, ఇటీవల వచ్చిన చాలా సినిమాల కంటే ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొద్ది సినిమాల నుండి తన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉండేలాగా విజయ్ చూసుకుంటున్నారు.
కానీ ఈ సినిమాలో ఆ ఇమేజ్ నుండి బయటికి వచ్చి నటించారు. లుక్స్ పరంగా కూడా, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చాలా బాగున్నారు. డాన్స్ కి స్కోప్ ఉన్న ఒకే ఒక్క పాటలో కూడా బాగా చేశారు. త్రిష తన పాత్ర పరిధి మేరకు నటించారు. లుక్స్ పరంగా బాగున్నారు. సింగర్ చిన్మయి వాయిస్ త్రిషకి చాలా బాగా సూట్ అయ్యింది. గౌతమ్ మీనన్ కి ఒక మంచి పాత్ర దొరికింది. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాత్ర ఇంకా బాగా తెరపై కనిపించింది.
సినిమాకి మరొక హైలైట్ మాత్రం అర్జున్ సార్జా. ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు ఈ పాత్ర వస్తుంది. అర్జున్ తన పాత్రలో చాలా బాగా నటించారు. మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన సంజయ్ దత్, ప్రియా ఆనంద్ కూడా పర్వాలేదు. ఇంక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాకి సినిమాకి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనిరుధ్. తెలుగు దర్శకులు కూడా అనిరుధ్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇందుకే ఏమో అనిపిస్తుంది.
ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అది చాలా బాగుంది. పాటలు కూడా ఒక మెలోడీ పర్వాలేదు. నా రెడీ సాంగ్ అయితే థియేటర్లలో ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అసలు సినిమా మొత్తం కూడా యాక్షన్ మీద నడుస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వారి 100% ఇచ్చారు అని చెప్పొచ్చు. అలాగే లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలకి ఈ సినిమాకి సంబంధం ఉంది. అందుకు సంబంధించిన కొన్ని పాత్రలు కూడా తెరపై కనిపించారు.
కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఒక ఎమోషన్ తో ఉన్న ఒక కథను చూపించడానికి ప్రయత్నించారు. ఆ ఎమోషన్ అస్సలు కనెక్ట్ అవ్వదు. చాలా రెగ్యులర్ ఎమోషన్. అంత బాగా తీసుకెళ్తున్న కథలో ఇది మాత్రం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ పాటల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. తమిళ్ లో చాలా హిట్ అయ్యాక తెలుగులో ఆ పాటలు రిలీజ్ చేశారు. దాంతో పోల్చి చూస్తే మాత్రం తెలుగు పాటల విషయంలో ఇంకా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- యాక్షన్ ఎపిసోడ్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- కనెక్ట్ అవ్వని ఎమోషన్
- తెలుగు డబ్బింగ్ పాటలు
- సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అయిన కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ఎలా డిజైన్ చేశారు అని చూడాలి అనుకున్న వారిని, విజయ్ కోసం సినిమా చూడాలి అనుకున్న వారిని ఈ సినిమా నిరాశ పరచదు. విక్రమ్ సినిమా ఇచ్చిన అంత హై ఈ సినిమా ఇవ్వకపోయినా కూడా, మంచి యాక్షన్ సీన్స్, ఎలివేట్ చేసే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫాస్ట్ గా సాగే స్క్రీన్ ప్లే, చాలా మంచి నిర్మాణ విలువలతో లియో సినిమా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : వచ్చే జన్మలో కూడా కలిసి పని చేయలేని అంత పెద్ద నమ్మకద్రోహం ఏం చేశాడు..? అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి..?
End of Article