Ads
వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ వేరే పార్టీలో చేరట్లేదు అని చెప్పారు. భవిష్యత్తు గురించి సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అన్నారు.
Video Advertisement
అయితే అంబటి రాయుడు గతవారం, అంటే డిసెంబర్ 28వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చేరిన వారం రోజులకే రాజీనామా చేయడం అనేది చర్చనీయాంశమైన విషయంగా మారింది. అసలు రాజీనామా ఎందుకు చేశారు అనే విషయం మీద అనుమానాలు నెలకొన్నాయి.
అంబటి రాయుడు తాను షేర్ చేసిన పోస్ట్ లో, “నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటికి వచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాను. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకుంటున్నాను. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది కొంత టైంలో చెప్తాను. థాంక్యూ. ” అని రాశారు. అయితే అంబటి రాయుడు ఈ కారణంగానే రాజీనామా చేశారు అనే ఒక అనుమానం వ్యక్తం అవుతోంది. అదేంటంటే, గుంటూరు నుండి లోక్‌సభకు పోటీ చేయాలి అని అంబటి రాయుడు అనుకున్నారట.
టికెట్ ఇచ్చే విషయం మీద పార్టీ నుండి ఎటువంటి హామీ రాలేదు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర కూడా పడుతుంది. ఇంక ఆలస్యం చేయడం ఎందుకు అని పార్టీ నుండి దూరం అయ్యే నిర్ణయం అంబటి రాయుడు తీసుకుని ఉంటారు అని విశ్లేషకులు అంటున్నారు. అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా. ఫామ్ లో ఉన్నప్పుడే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు చేరిన వారం రోజులకి వైసీపీ నుండి దూరమవుతున్నట్టు ప్రకటించారు.
అంబటి రాయుడు సామాజిక వర్గాన్ని బట్టి పరిశీలిస్తే జనసేన నుండి కానీ లేదా తెలుగుదేశం నుండి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరొక సారి లోక్‌సభకు పోటీ చేయలేను అని చెప్పారు. కాబట్టి ఒకవేళ అంబటి రాయుడు తెలుగుదేశం పార్టీలో చేరితే టికెట్ వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మీద చాలా అనుమానాలు వస్తున్నా కూడా, వీటి మీద ఒక్కసారి అంబటి రాయుడు స్పందించి స్పష్టత ఇస్తే కానీ అసలు విషయం ఏంటి అనేది తెలియదు.
End of Article