Ads
ఉదయం 6:00 అయ్యింది. రాత్రి ఏమైందో ఏమో బాగా అలసట గా అనిపించి, గుండెల్లో కొంచెం నొప్పి అనిపించింది. తట్టుకోలేక అక్కడే పడిపోయాను. తర్వాత నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు పడుకోబెట్టారు ఏమి గుర్తు లేదు. అబ్బా! తల పగిలిపోతుంది వెంటనే లేచి కాఫీ తాగాలి. నా భార్య ఎక్కడ? ఈపాటికే నన్ను లేపి కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. ఇవాళ ఏంటి ఆలస్యం అయింది ? సరేలే ఏదో పనిలో ఉంటుంది. నేనే వెళ్ళి అడిగి తెచ్చుకుంటా. ఇదేంటి! హాల్ లో ఎంత మంది ఉన్నారు ఏంటి? ఏమైంది? సరే దగ్గరికి వెళ్లి చూద్దాం.
Video Advertisement
నా భార్య ఏడుస్తోంది ఏంటి? నా కొడుకు కి ఏమైంది వాడు ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు? నా స్నేహితుడు కూడా వచ్చాడు. వాడికి నాకు ఏడాది క్రితం గొడవైంది. ఇప్పటివరకూ మాట్లాడుకోలేదు. వాడు మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి. ఏమో ఎందుకు వచ్చాడో. ఏంటిది ? ఎవరో చచ్చిపోయినట్టు ఉన్నారు. ఈ ఇంట్లో ? ఎవరై ఉంటారు? అమ్మానాన్న లో ఎవరైనా? లేదు ముందు వాళ్ళ రూమ్ లో చూద్దాం. అమ్మ నాన్న బానే ఉన్నారు కదా. కానీ వీళ్లు కూడా ఏడుస్తున్నారు ? అసలు ఎవరో ఒకసారి చూస్తే గానీ అర్థం కాదు.
ఎవరది? ఏంటి అది అది అది నేనే. నేను చనిపోయానా ? ఎలా ? లేదు నేను చనిపోలేదు. నా భార్య ముందు బిగ్గరగా అరుస్తున్న వినట్లేదు. నా కొడుకు కూడా నేను పిలుస్తున్న పలకట్లేదు. పోనీ అమ్మానాన్నలు చెబుదామా? అయ్యో వాళ్లు కూడా నా మాట వినట్లేదు. నా స్నేహితుడికి చెప్తే? ఇంక ఈగో చంపుకొని నేనే వెళ్ళి వాణ్ణి క్షమాపణ అడుగుతాను. జరిగిన గొడవలో ఎంతో కొంత నాతో కూడా ఉంది కదా. అరే వీడు కూడా పలకట్లేదు ఏంటి? అంటే నేను నిజంగానే చనిపోయానా ?
దేవుడా ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కష్టపడి నన్ను బాబుని అమ్మానాన్నల్ని చూసుకుంటున్న నా భార్యతో ఒక్కసారి కూడా తను అందంగా ఉందని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలి. అలాగే నాకు ఏ సమస్య రాకుండా ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకున్నందుకు థాంక్స్ కూడా చెప్పాలి. ఉద్యోగంలో పడి నా కొడుకుతో ఇప్పటివరకు నేను సరిగ్గా మాట్లాడలేదు. వాడితో మాట్లాడాలి. ఆడుకోవాలి. మా అమ్మ నాన్న లను కూడా ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదు. వాళ్లతో కొంత సమయం గడపాలి. అలాగే నా స్నేహితుడికి క్షమాపణ చెప్పాలి. కుటుంబం మొత్తాన్ని ఎక్కడికైనా టూర్ కి తీసుకెళ్లాలి. వాళ్లతో కొన్ని రోజులు సరదాగా గడపాలి.
ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి దేవుడా. ప్లీజ్ దేవుడా నా తప్పులను క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వు దేవుడా. ఒక్కసారి బ్రతికించు దేవుడా ప్లీజ్ దేవుడా. నాకు ప్రాణబిక్ష పెట్టు దేవుడా. ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా. ఇలా అంటుండగానే నన్ను ఎవరో గట్టిగా కుదిపినట్టు అనిపించింది. నాకేం అర్థం కావట్లేదు. మెల్లగా నా భార్య నన్ను లే అంటున్నట్టు వినిపిస్తోంది. ఇప్పుడు ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది. ఒక్కసారిగా కళ్లు తెచ్చుకున్నా. నా భార్య పక్కనే ఉంది. నేను నా రూమ్ లోనే ఉన్నాను. టేబుల్ మీద కాఫీ కూడా ఉంది. ” ఏమైంది ఏమైనా కల వచ్చిందా? ఎందుకలా కలవరిస్తున్నావు?” అని నవ్వింది నా భార్య. అంటే నేను బతికే ఉన్నానా? హమ్మయ్య నేను బతికే ఉన్నా! థాంక్యూ దేవుడా.
కాఫీ తాగి లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళుతూ నా భార్యకి నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు ఇంట్లో అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నేను ఆఫీసులో శ్రద్ధతో పని చేయగలుగుతున్నాను. అన్నిటికీ థాంక్యూ. అని చెప్పాను. ఆనందంతో తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అమ్మానాన్నలతో కూడా ఓ పావుగంట మాట్లాడాను. బాబుని స్కూల్లో దించేసి. నేను ఆఫీస్ కి బయలుదేరాను. దారిలో నా స్నేహితుడికి ఫోన్ చేశాను. సారీ చెప్పాను. అరే మనలో మనకు సారీలు ఏంట్రా? సాయంత్రం కలుద్దాం అని అన్నాడు.
ఎందుకో తెలీదు రోజు కంటే ఇవాళ ఆఫీస్ కి కొంచెం ఉత్సాహం తో వెళ్తున్నాను. ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తోంది. బహుశా ఇవాళ నా ఇగో ని పక్కన పెట్టి మనసు చెప్పిన మాట విన్నాను. అందుకే ఏమో కొంచెం తేలికగా అనిపిస్తుంది. మీరు కూడా నాకెందుకు ? నేను ఏంటి ఒకళ్ళకి సారీ చెప్పేది? ఇష్టముంటే వాళ్లే వచ్చి మాట్లాడారు. ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి అందరితో మంచిగా మాట్లాడండి. కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో మంచి రిలేషన్ ఏర్పరుచుకోండి. తర్వాత చేద్దాం అన్న ఆలోచన తీసేయండి. ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే చేసేయండి. ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్లు తప్పు లేకుండా నొప్పించకండి. నెగిటివిటీ ని దూరంగా ఉంచండి. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని నవ్వుతూ హాయిగా గడపండి.
End of Article