ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియకుండా చేసే చిన్న పొరపాటు కూడా అనుకోని పరిణామాలకు దారి తీస్తుంది. అసలు మనం చేసేది పొరపాటు కిందకి కూడా పరిగణనలోకి రాదు.

Video Advertisement

కానీ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల మనకి తెలియకుండా వచ్చే ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని తమిళనాడుకి చెందిన ఒక వ్యక్తి తన కథను ఈ విధంగా పంచుకున్నాడు.

“జనవరి 7వ తేదీ దాదాపు సాయంత్రం 6 గంటలు అవుతున్నప్పుడు నేను నా భార్య బైక్ మీద బయటికి వెళ్ళాం. అన్నా నగర్ దగ్గర ఉండగా నా భార్య సడన్ గా స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే నేను దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను. డాక్టర్లు సిటీ స్కాన్ చేసి మెదడు ఎడమ వైపు భాగం ఉబ్బుతోందని. ఇంక బతకడం కష్టం అని చెప్పారు. నేను హాస్పిటల్ నుండి నా భార్యని డిశ్చార్జ్ చేయించి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళాను.

అక్కడి డాక్టర్లు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత నా భార్య మెదడు స్పందించడం క్రమంగా తగ్గింది. అప్పుడు నా భార్య ఐదు నెలల గర్భవతి. నా భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. ఐదు రోజుల తర్వాత నా కొడుకు ఈ లోకాన్ని కూడా చూడకుండా తన తల్లి కడుపులో ఉండగానే మరణించాడు.

డాక్టర్లు నా భార్యకు బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. మేము అవయవ దానం చేయాలి అని ముందే నిర్ణయించుకున్నాం. దుఃఖం లోనే ఆర్గాన్ డొనేషన్ ఫార్మ్ మీద సంతకం చేశాను. జనవరి 13న నా భార్య నన్ను విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయింది.

ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే బైక్ నడిపేటప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను కానీ నా భార్య హెల్మెట్ పెట్టుకోలేదు. తను కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇవాళ తనని కాపాడుకునే వాడిని. అందుకే జాగ్రత్త అనేది చిన్నదైనా పెద్దదైనా ముఖ్యమైనదే. తెలిసీ తెలియకుండా నేను అజాగ్రత్తగా ఉండటం వల్ల నా జీవితం అయిన నా భార్య ఉమ నాకు దూరం అయింది”.అని తన బాధను చెప్పి తన భార్యతో చివరిగా దిగిన సెల్ఫీ ని పోస్ట్ చేశాడు.