Ads
ఒకొక్కసారి భయంలో మనం తీసుకునే నిర్ణయం తర్వాత ఇద్దరికీ దారి తీస్తాయి. మన పరిస్థతిని కొంత మంది అర్ధం చేసుకున్నా కూడా కొంత మంది అర్ధం చేసుకోలేరు. అలాంటప్పుడే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి.
Video Advertisement
తను భయంవల్ల చేసిన ఒక పని, తర్వాత తనకు చాలా ఇబ్బందులు తీసుకొచ్చింది అంటూ ఒక అమ్మాయి ఈ విధంగా రాసింది. ఆ కథ ఏంటో ఆ అమ్మాయి మాటల్లోనే విందాం.
నా పేరు కవిత. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి నా వెనకాల పడ్డాడు. ముందు కొద్ది రోజులు నేను అసలు పట్టించుకోలేదు. తర్వాత అలాగే వెంటపడుతూ ఉంటేటప్పటికి మాట్లాడాను. అతనికి నేనంటే చాలా ఇష్టం అని అతని మాటల్లో అర్థమయ్యింది. నేను కూడా అతనిని ఇష్టపడ్డాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. బ్రేకప్ అయ్యింది.
ఒక సంవత్సరం పాటు నేను తనతో మాట్లాడాలి అని, కన్విన్స్ చేయాలి అని చాలా ప్రయత్నించాను. కానీ నన్ను పట్టించుకోలేదు. అప్పటికే మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక సంబంధం చూశారు. నాకు ఆ అబ్బాయి నచ్చాడు. దాంతో పెళ్లికి సరే అన్నాను. మిగిలిన విషయాలు అన్నింటి గురించి కూడా ఆలోచించుకొని కొద్ది రోజుల తర్వాత నిర్ణయం చెప్తాము అని మేము చెప్పాము. ఇంక వాళ్లకి అబ్బాయి నచ్చాడు అని చెప్పి, ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం అనుకున్న సమయానికి నన్ను ప్రేమించిన అతను మళ్ళీ వచ్చాడు. నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. నేనంటే ఇష్టం ఇంకా పోలేదు అని, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని, తనని పెళ్లి చేసుకోమని అడిగాడు.
నిజం చెప్పాలంటే నాకు కూడా అప్పటికీ అతనంటే ఇష్టం ఉంది. దాంతో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించాను. ముందు మా ఇంట్లో వాళ్ళు నా మీద చాలా కోప్పడ్డారు. కానీ నేను అవన్నీ భరించాను. చివరికి నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి చేయడానికి సరే అన్నారు. ఇదంతా జరిగిన రెండు రోజుల తర్వాత అతని మాటలో తేడా మళ్లీ గమనించాను. కట్నం కావాలని, బిజినెస్ పెట్టడానికి డబ్బులు కావాలని అడగడం మొదలు పెట్టాడు. ఈసారి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుందామని డిసైడ్ అయ్యాను.
అలాంటి వాడితో నేను జీవితాంతం కలిసి ఉండలేను అని నాకు అర్ధమైపోయింది. దాంతో నేను అతనికి ఫోన్ చేశాను. “మనిద్దరికీ పెళ్లి జరగదు. జరిగితే సంతోషంగా ఉండలేం” అని చెప్పి ఫోన్ పెట్టేసాను. అతను మళ్లీ నాకు కాల్ చేసి, “జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. మనిద్దరం దిగిన ఫోటోలు, మెసేజెస్, కాల్ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి” అని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈసారి నేను భయపడినా కూడా ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్లు నావల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంక నేను వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
ముందు అనుకున్న అబ్బాయితోనే నా పెళ్లి జరిగింది. అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఎక్కడో నా ప్రేమ విషయం నా భర్తకి చెప్పలేదు అనే బాధ నాకు ఉండేది. ఒకరోజు సడన్ గా నా భర్త తన ఫోన్ తీసి నాకు ఇచ్చి “ఏంటి ఇవన్నీ?” అని అడిగారు. చూస్తే నన్ను ప్రేమించిన అతను పంపించిన ఫొటోస్ ఉన్నాయి. నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. నా భర్త చాలా కోపంగా ఉన్నారు. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అయినా సరే నేను జరిగింది అంతా చెప్పడానికి ప్రయత్నించాను.
చెప్తే ఏమవుతుందో అని భయంతోనే చెప్పలేదు అని, అంతే కాని ఆయనని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు అని నేను చెప్పాను. అయినా సరే ఆయన వినలేదు. ఈ సంఘటన జరిగి రెండు నెలలు అవుతోంది. అప్పటి నుండి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అప్పటి వరకు నన్ను చాలా బాగా చూసుకున్న నా భర్త, తర్వాత నుంచి నా మొఖం కూడా చూడటం మానేశారు. మా మధ్య మాటలు కూడా లేవు. నేను ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అప్పటివరకు మంచిదాన్ని అయిన నేను, ఒక్క సారిగా ఆయన దృష్టిలో ఒక తప్పు చేసిన దాని లాగా అయిపోయాను. నేను నా పరిస్థితి ఎలా వివరించాలి? నేను ఇలా జరిగిందంతా దాచిపెట్టింది కేవలం భయంతోనే అనే విషయం నా భర్తకి ఎలా చెప్పాలి?
End of Article