Ads
శ్రీ రామచంద్రుని అనన్య భక్తుడు హనుమంతుని గురించి తెలియని హిందువు ఉండడు. ఆయన బలశాలి, ధైర్య శాలి.. ఎంత బలం ఉన్నా ఎప్పుడు, ఎక్కడ, ఏమి మాట్లాడాలో తెలిసిన వాడు. అందుకే శ్రీరాముడు సైతం ఆంజనేయుడిని అభిమానిస్తూ ఉంటాడు. ఆయన మాటకారితనాన్ని అందరు వేనోళ్ళ కీర్తిస్తుంటారు.
Video Advertisement
కానీ, ఆ ఊరి ప్రజలు మాత్రం హనుమంతుని పేరెత్తరు. ఆయనను పూజించడం అస్సలు ఉండదు. అసలు ఆయనని తలవడానికి కూడా ఇష్టపడరు. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న ద్రోణగిరి గ్రామంలో ప్రజలు హనుమంతుని పూజించరు.
అసలు దేశం మొత్తంలో ఏ ఊరిలో అయినా హనుమంతుడికి గుడి ఉంటుంది. మారుమూల కుగ్రామంలో, చివరకు జన సంచారం తక్కువ ఉండే రహదారులపై కూడా హనుమంతుడికి గుడి ఉంటుంది. కానీ, ఆ ఊరిలో ప్రజలు మాత్రం హనుమంతుడిని ఆరాధించడానికి ఇష్టపడరు. అక్కడి నుంచే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్లాడని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు.
రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితిలో పడిపోతే హనుమంతుడు సంజీవని కోసం వెతుకుతాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో హిమాలయాల వైపు వచ్చి సంజీవని పర్వతం వైపు ఎటు వెళ్లాలో హనుమకు దారి తెలియకపోతే.. ఓ మహిళ దారి చూపించిందని, అయితే హనుమకు సంజీవని మొక్క ఏదో తెలియక ఆ పర్వతాన్నే తమ గ్రామం నుంచి తీసుకెళ్లిపోయాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
తమ గ్రామ ప్రజలకు సంజీవనిని దూరం చేశాడన్న కారణంతో ఇక్కడి వారు హనుమ పై కోపం పెంచుకున్నారు. అందుకే ఆయన పేరైనా పలకరు. కనీసం ఆయనను తలవరు. ఇక గుళ్ళు గోపురాలు, పూజలు పునస్కారాల సంగతి సరేసరి. ఆ గ్రామంలో హనుమని పూజించడం నేరం గా పరిగణిస్తారు.
End of Article